
ద్విచక్ర వాహనాల ద్వారా టీకాలు
- ఇంటింటికీ వెళ్లి పిల్లలకు సేవలు..
- దేశంలోనే తొలిసారిగా ప్రారంభం
- ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా ‘టీకా బండి’అనే సరికొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం కింద పూర్తిగా టీకాలు అందని చిన్నారులకు అన్ని వ్యాధి నిరోధక టీకాలు వారి ఇళ్లకే వెళ్లి అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పది ద్విచక్ర వాహనాలను శనివారం మంత్రి ఏఎన్‌ఎంలకు అందించారు. ఎంత పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించినా ఇంకా 28 శాతం పిల్లలకు టీకాలు అందడం లేదని మంత్రి చెప్పారు. అసలు టీకాలే తీసుకోని వారు 7 శాతం మంది ఉన్నారని చెప్పారు.
అర్బన్ స్లమ్ ఏరియాలు, తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకున్న చోట్ల పిల్లలను గుర్తించి టీకాలు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం 68 శాతం ఉన్న టీకాల శాతాన్ని 80 శాతానికి పెంచాలనే లక్ష్యం తో టీకా ద్విచక్ర వాహనాల రూపకల్పన చేసినట్లు వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబా ద్‌కు 5, మేడ్చల్‌కు 3, సంగారెడ్డి జిల్లాకు రెండు చొప్పున వాహనాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. సోమ, మంగళ, గురువారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్ణీత ప్రాంతాల్లో టీకాలు వేస్తారని వెల్లడించారు. కాగా, మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం రెండో విడతలో భాగంగా ఈ నెల 7 నుంచి 18 వరకు 13 జిల్లాల్లో టీకాలు అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ రమణి పాల్గొన్నారు.