Covid Vaccine: కరోనా టీకా.. ‘కాస్త టైం పడుతుంది’! | Sputnik V To Be Available In India From May | Sakshi
Sakshi News home page

Covid Vaccine: కరోనా టీకా.. ‘కాస్త టైం పడుతుంది’!

Published Wed, Apr 28 2021 2:08 AM | Last Updated on Wed, Apr 28 2021 5:02 PM

Sputnik V To Be Available In India From May - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఆస్పత్రులు నిండిపోతున్నాయి. యాంటీ వైరల్‌ మందులు, ఆక్సిజన్‌కు కొరత తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ ఆపద్బాంధవుడిలా కనిపిస్తున్నది వ్యాక్సిన్లే. మరి వ్యాక్సిన్లు అందరికీ అందుతాయా? ఎంత సమయం పడుతుంది? అప్పటిదాకా పరిస్థితి ఏమిటి?.. అందరిలో సందేహాలివే. వీటికి సమాధానం ఒక్కటే.. ‘కాస్త టైం పడుతుంది’! దీనికి పరిష్కారం.. వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగి అందరికీ అందుబాటులోకొచ్చే వరకు ఓపిక పట్టడం. అలాగని చూస్తూ కూర్చోలేం. బతుకుబండి నడవాలి. ఎవరికి వారు జాగ్రత్తలూ తీసుకుని, నిత్యం చేసుకునే పనులు కొనసాగించాలి.

ఐదారు నెలలు దాటితే..: దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు, ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం, మున్ముందు పెరిగే కెపాసిటీ, కొత్తగా వచ్చే వ్యాక్సిన్లు, సరఫరా– పంపిణీల తీరును గమనిస్తే.. మరికొద్ది నెలల పాటు ఇప్పుడున్నట్టుగానే వ్యాక్సినేషన్‌ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి టీకా తీసుకునే అనుమతి ఉండగా.. మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికీ వ్యాక్సిన్‌ వేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ లెక్కన మొత్తం 94 కోట్ల మంది టీకాలకు అర్హులు. ఇందులో 45 ఏళ్లుపైబడినవారు సుమారు 26 కోట్ల మంది. వీరిలో ఇప్పటివరకు సుమారు 11.97 కోట్ల మందికి టీకాలు వేయగా.. ఒక డోసు తీసుకున్నవారు సుమారు 10 కోట్లు, రెండు డోసులూ పూర్తయినవారు దాదాపు 2 కోట్ల మంది. అంటే 45 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్‌ రెండు డోసులు పూర్తి కావడానికి సుమారు 38 కోట్ల డోసుల టీకాలు కావాలి. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ రెండింటి ఉత్పత్తి సామర్థ్యం కలిపి నెలకు సుమారు ఏడు కోట్ల డోసులే. జూన్, జూలై నెలల నుంచి ఈ సంఖ్య 15–16 కోట్ల డోసులకు పెరుగుతుందని అంచనా. వీటికితోడు స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. అంటే మొత్తంగా ఐదారు నెలల తర్వాత వ్యాక్సినేషన్‌ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 

దేశంలో ఈఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్‌ మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 26 నాటికి.. అంటే సుమారు 102 రోజుల్లో వైద్యులు, సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 45 ఏళ్లు పైబడినవారికి కలిపి 14.50 కోట్ల మందికి మాత్రమే టీకాలు అందాయి. ఇందులోనూ 12 కోట్ల మందికి ఒకే డోసు వేశారు, రెండు డోసులు పూర్తయిన వారి సంఖ్య సుమారు రెండున్నర కోట్లు మాత్రమే. సగటున లెక్కిస్తే.. దేశవ్యాప్తంగా రోజుకు 22 లక్షల మంది టీకాలు వేయగలిగారు. ఇది ఇలాగే కొనసాగితే.. దేశంలో టీకాలకు అర్హులైన 94 కోట్ల మందికి రెండు డోసులు ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. జనాభాలో కనీసం 70– 80 శాతం మందికి టీకాలు వేస్తే.. వైరస్‌ దాదాపు నియంత్రణలోకి వచ్చినట్టేనని, హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్ల వరకు కరోనా ప్రభావం ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

కేసులు భారీగా పెరుగుతూ..
సెకండ్‌ వేవ్‌ కరోనా కేసుల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే అత్యంత బాధిత దేశంగా మారిపోయింది. రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆస్పత్రులు నిండిపోయి.. బెడ్లకు, ఆక్సిజన్‌కు, అత్యవసర మందులకు కొరత ఏర్పడింది. ఆక్సిజన్, తగిన చికిత్స అందక రోగులు చనిపోతున్నారు. మరోవైపు కోవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 24 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే ఒకటో తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు దాటిన అందరికీ టీకాలిచ్చే కార్యక్రమానికి పచ్చజెండా ఊపింది. కానీ టీకాల సరఫరా, పంపిణీలో లోపాలతో వ్యాక్సినేషన్‌ చాలా నెమ్మదిగా సాగుతోంది. వ్యాక్సినేషన్‌ మొదట్లో రోజుకు మూడు, నాలుగు లక్షల డోసులతో ప్రారంభమైనా.. 45 ఏళ్లుపైబడ్డ వారికి ఇవ్వడం మొదలయ్యాక ఊపందుకుంది. కానీ ఏప్రిల్‌ పదో తేదీ తర్వాత మళ్లీ వేగం తగ్గింది. ఇది చూస్తుంటే జూలై 31 నాటి దేశంలో యాభై కోట్ల మందికి టీకాలివ్వాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నెలకు 17 కోట్ల టీకాలు వేస్తేనే..!
ఈ ఏడాది చివరికల్లా అర్హులైన అందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అది నెరవేరాలంటే నెలకు 17 కోట్ల మందికి టీకాలు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 94 కోట్ల మంది అర్హులకు రెండు డోసులు పూర్తిచేసేందుకు దాదాపు 188 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అవసరం. ఇప్పుడున్నట్టుగా రోజుకు 22 లక్షల డోసుల చొప్పున వేస్తే.. 94 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున ఇచ్చేందుకు అటు ఇటుగా వెయ్యి రోజులు పడుతుంది. అదే ఉత్పత్తి పెంచితే ముందుగా పూర్తవుతుంది. కానీ డిమాండ్‌కు తగినంతగా టీకాల ఉత్పత్తి జరగడం లేదు. దీనితో సమస్యలు ఏర్పడుతున్నాయి.

టీకాల పరిస్థితి ఏమిటి?
ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నెలకు దాదాపు ఆరు కోట్ల టీకాలు ఉత్పత్తి చేయగలదు. కేంద్రం ఇటీవల మంజూరు చేసిన రూ.3 వేల కోట్లతో మరింత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సమకూర్చుకుని, మే నెలాఖరుకల్లా ఉత్పత్తిని పది కోట్ల డోసుల వరకు పెంచుతామని సీరమ్‌ ఇప్పటికే ప్రకటించింది.

మరోవైపు భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం నెలకు అరవై లక్షల నుంచి నుంచి కోటీ డోసుల వరకు ఉంది. మే నెలాఖరుకు మూడు కోట్ల డోసులకు, ఆగస్టుకల్లా ఆరు కోట్ల డోసులకు చేరుతుందని అంచనా. మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం నెలకు ఏడు కోట్ల డోసుల వరకు అందుబాటులో ఉంటోంది. ఈ లెక్కన ఏడాది చివరికల్లా జనాభాలో 80 శాతం మందికి టీకాలు వేయాలంటే.. ఉత్పత్తి మూడింతలు కావాల్సి ఉంది. జనాభా మొత్తానికి టీకాలివ్వాలంటే నెలకు 22 కోట్ల మందికి వేయాలి. అయితే ఆయా రాష్ట్రాల్లో 18 ఏళ్లపైబడ్డ వారు ఎంత మంది ఉన్నారన్న దాన్నిబట్టి.. 80 శాతం మందికి టీకాలివ్వడం ఆధారపడి ఉంటుంది. దేశంలో 18 ఏళ్లుపైబడిన వారిలో 58 శాతం మంది తొమ్మిది రాష్ట్రాల్లోనే ఉన్నారు. రాష్ట్రాల వారీగా ఇప్పటి వేగం ప్రకారం చూస్తే.. ఆయా రాష్ట్రాల్లో కొన్నింటిలో 2023 జూన్‌కు గానీ 80 శాతం అర్హులకు టీకాలు ఇచ్చే పరిస్థితి లేదు.

విదేశీ వ్యాక్సిన్లు వస్తే ఊరట
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశంలో అత్యవసర వినియోగం కోసం రష్యా తయారీ స్పుత్నిక్‌ –వి వ్యాక్సిన్‌కు అనుమతులు జారీ చేసింది. సుమారు మూడు కోట్ల డోసుల మేర త్వరలో దిగుమతి కానుంది. దేశంలో ఆ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఇంకా కొద్దినెలలు సమయం పట్టనుంది. మరిన్ని విదేశీ వ్యాక్సిన్లు కూడా భారత్‌లో అనుమతి కోసం వేచి ఉన్నాయి. వాటిల్లో దేనికైనా అనుమతి వస్తే మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయి. అదే జరిగితే వ్యాక్సినేషన్‌ అనుకున్న మేరకు కొనసాగే అవకాశం ఉంటుంది. మరోవైపు భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కోవాగ్జిన్‌ను ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలించాలని కొంతమంది నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ దిశగా కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే వ్యాక్సినేషన్‌ మరింత వేగంగా సాగే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..
టీకా కార్యక్రమం విషయంలో తెలుగు రాష్ట్రాలు వేగంగానే ఉన్నాయి. అయితే సరైన సమయానికి కేంద్రం నుంచి టీకాలు అందకపోవడంతో వ్యాక్సినేషన్‌లో కాస్త జాప్యం జరుగుతోంది.

తెలంగాణలోని నాలుగు కోట్ల జనాభాలో ఇప్పటివరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 42.89 లక్షలు.. వీరిలో తొలి డోసు వేసుకున్న వారు 37.58 లక్షల మందికాగా.. రెండు డోసులూ తీసుకున్నవారు కేవలం 5.30 లక్షల మంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా టీకాలు వేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవలే ప్రకటించారు. అయితే అంత మందికి ఇచ్చేందుకు టీకాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది తేలడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. అక్కడ ఏప్రిల్‌ 24వ తేదీ నాటికి మొత్తం 56.17 లక్షల మందికి టీకాలు ఇచ్చారు. ఇందులో ఒక డోసు తీసుకున్న వారు 45 లక్షల మంది వరకు ఉండగా.. రెండు డోసులూ పూర్తిచేసుకున్న వారు 11 లక్షల మంది ఉన్నారు. ఏపీలో 18– 45 మధ్య వయస్కులు రెండు కోట్ల నాలుగు లక్షల మంది కోసం.. రాష్ట్ర ప్రభుత్వం భారత్‌ బయోటెక్, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి 4.08 కోట్ల డోసుల టీకాలను ఆర్డర్‌ చేసింది.

అప్పటిదాకా ఏం చేయాలి?
వ్యాక్సిన్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు కొద్ది నెలలు సమయం పడుతుంది. అప్పటివరకు నిబంధనల ప్రకారం అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకోవాలి. కచ్చితంగా మాస్కు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం వంటివి అలవాటుగా చేసుకోవాలి. ఇదే సమయంలో నిత్య జీవితాన్ని యథావిధిగా కొనసాగించాలి. కరోనాకు భయపడి ఇంట్లోనే ఉండిపోవడం, పనులకు వెళ్లకపోవడం వల్ల జీవనోపాధికి దెబ్బపడుతుంది. అందువల్ల పూర్తి జాగ్రత్తలతో ఉద్యోగం, సొంత పనులు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉంటే.. కరోనా సోకే అవకాశాలు అతి స్వల్పంగా ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే.. నిర్దేశిత సమయం ప్రకారం తీసుకోవాలి. వ్యాక్సిన్‌ వేయించుకున్నంత మాత్రాన జాగ్రత్తలను మరవొద్దు. మరికొంతకాలం పాటు మాస్కులు, భౌతికదూరం వంటివి పాటిస్తే.. అప్పటివరకు అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయితే.. కరోనా మహమ్మారిపై విజయం సాధించినట్టే.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement