హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ బృందం మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నేతత్వంలోని ఈ బృందం నగరానికి విచ్చేసింది. విభజన నేపథ్యంలో జరుగుతున్న నివేదికలను పరిశీలిస్తారు. ఇందులో భాగంగానే మంగళవారం సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చిస్తారు. ఇప్పటివరకు విభజన అంశాలపై ముందుకు సాగేందుకు 15 కమిటీలను ఏర్పాటు చేశారు.
ఉద్యోగుల పంపిణీ నుంచి కొత్త రాజధానికి స్థల పరిశీలన వరకూ కమిటీలు పని చేస్తున్నాయి. ఈ కమిటీల పురోగతిని గోస్వామి సమీక్షిస్తారు. అలాగే పోలీసులకు సంబంధించిన అంశాలు, ఉద్యోగులు, ఐపీఎస్‌ల పంపకాలపై బుధవారం జాతీయ పోలీసు అకాడమీలో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న తాజా వివరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గవర్నర్ నరసింహన్, 3.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఈ బృందం భేటీ కానుంది.
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంశాఖ బృందం
Published Tue, Mar 18 2014 11:14 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement