Anil Goswami
-
గుర్రమే కాదు రౌతు కూడా మారాలి
ప్రభుత్వ విధానాలకు బద్ధులై పనిచేయాల్సిన అధికార యంత్రాంగం చేసే తప్పులలో తన ప్రమేయం లేదని ప్రభుత్వం తప్పించుకోలేదు. మూలం నుంచే సంస్కరణ జరగాలి. అధికారులు, నేతలు కూడా నైతిక విలువలకు కట్టుబడి పనిచేయాలి. అప్పుడే గోస్వామి వంటివారు పరిధులు దాటి చలాయించే అధికారాలకు అడ్డుకట్ట పడుతుంది. దేశ అధికార యంత్రాంగానికి ఇప్పుడు ‘ఫోన్’ అంటేనే వణుకు పుడుతోంది. శారదా కుంభ కోణం నిందితుల అరెస్టును ఆపాలని కోరుతూ సీబీఐ అధి కారులకు ఫోన్ చేసినందుకు సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిపై వేటు పడటమే ఇందుకు కారణం. సీబీఐ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగిస్తే సహించేది లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత గంభీరంగా చెబుతున్నా... ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ప్రభుత్వం పనితీరు గొప్పతనాన్ని ఓటర్లకు చాటాలనే ఉద్దేశమే అసలు కారణమనే వాదనను కాదనలేం. ఏదేమైనా, గోస్వామి ఉదంతం అధికార యంత్రాంగానికి, రాజకీయ నాయకులకు మధ్య సంబంధాలు, అధికారుల పనితీరులో, తప్పిదాల్లో నేతల పాత్ర, బాధ్యత ఎంత? అనే అంశాలను చర్చకు తెచ్చింది. ఇది ముదావహం. తన అధికారాల పరిధిని దాటడమే అనిల్ గోస్వామి తప్పయితే ఆయనపై వేటు ఎన్నడో పడాల్సింది. నరేంద్రమోదీ ప్రభుత్వ ప్రధాన కార్శదర్శి హోదాలో ఆయన పలు రాష్ట్రాల గవర్నర్లకు ఫోన్లు చేశారు. ప్రభు త్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం నియమించిన గవర్నర్లు రాజీనామా చేయాలని కోరారు. అలా గవర్నర్ల తో నేరుగా మాట్లాడటం తన అధికార విధుల్లో భాగ మేనని అప్పట్లో ఆయన సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తన చర్యను సమర్థించుకున్నారు. ఆ సంద ర్భంగా బీజేపీ ప్రభుత్వం, గోస్వామిని సమర్థించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గవర్నర్లు మారడం సాంప్రదాయమని సూత్రీకరించింది కూడా. రాజకీయ నాయకత్వం అభీష్టానుసారమే గోస్వామి గవర్నర్ల రాజీనామాలు కోరారనేది స్పష్టమే. ‘‘ఆర్టికల్ 156 ప్రకారం రాష్ట్రపతి అభీష్టం అనేది కేంద్ర మంత్రివర్గ సలహాపై ఆధారపడి ఉండేదే అయినా అది, అతడు లేదా ఆమెకు మాత్రమే చెందినది. దాని గురించి ఎలాంటి సమాచా రాన్ని చేరవేయడమైనా రాష్ట్రపతి కార్యాలయం నుంచి జరగాల్సిందే. ‘అభీష్టం’ బదలాయించగలిగినది కాదు.’’ ఇవి ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ కేసులో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం అన్న మాటలు. గవర్నర్ల కు రాజీనామాలు చేయాలనే సమాచారం అందించా ల్సింది రాష్ట్రపతి కార్యాలయం కాగా గోస్వామి ఆ పని చేసి, తన పరిధిని అతిక్రమించారు. అది తప్పుగా అప్ప ట్లో కేంద్రానికి కనిపించలేదు. ఇప్పుడు సీబీఐ అధికా రులతో ఫోన్లో మాట్లాడటమే తప్పుగా కనిపిస్తోంది. అధి కారంలోని నేతల ఆదేశాల మేరకు లేదా అభీష్టం మేరకు పనిచేసే అధికారుల తప్పొప్పులకు కొలబద్ధ నేతల ఇష్టా యిష్టాలు, విచక్షణ మాత్రమేనని అనుకోవాలి! ఈ సమస్య కొత్తదేమీ కాదు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన నిందితుడు ఆండర్సన్ దేశం నుంచి తప్పించుకు పోయినది నాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్, రాజీవ్‌గాంధీల అభీష్టం మేరకేననేది బహిరంగ రహస్యం. నిందితులు నిమిత్తమాత్రులైన జిల్లా అధికా రులా? లేక అసలు సూత్రధారులా? ఇలాంటి సందర్భాల్లో చర్య తీసుకోవాల్సింది ఎవరిపైన? ఈ చర్చ దశా బ్దాలుగా సాగుతోంది. మన పార్లమెంటరీ విధానం ప్రకా రం ప్రభుత్వ చర్యలకు కార్యనిర్వహణాధికారులే అంటే మంత్రులే బాధ్యులు. నెహ్రూ హయాంలో హరిదాస్, ముంద్రా కంపెనీల నుంచి ఎల్ఐసీ షేర్ల కొనుగోలు వ్యవహారంలో తన ప్రమేయమేమీ లేదని, దానికి ఆర్థిక కార్యదర్శి హెచ్ఎమ్ పటేల్‌దే బాధ్యతని నాటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి చేసిన వాదన చెల్లలేదు. ఆయన రాజీనామా చేయక తప్పలేదు. అలాగే గోవధ వ్యతిరేక నిరసన ప్రదర్శనలకు అనుమతినిచ్చింది తాను కాదన్న నాటి హోం మంత్రి గుల్జారీలాల్ నందా వాదన చెల్లక రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజకీయ కార్య నిర్వాహకుల బాధ్యతను గుర్తు చేయడానికే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. అంతేగానీ అధికారులు చట్టాలకు అతీతులూ కారు. గోస్వామి ఫోన్ల వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనీ కాదు. ప్రజా సేవలో ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా పని చేయాలనే అఖిల భారత సర్వీసు అధికారులకు రాజ్యాంగ రక్షణ కల్పించారు. అయితే వారు ప్రభుత్వ విధానాలకు, నిర్ణయాలకు బద్ధులై పనిచేయాలి. వాటి పట్ల అభ్యంతరాలుంటే అసమ్మతి నోట్ ఇవ్వవచ్చు. ప్రభుత్వాలతో విభేదించి ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేసిన శంకరన్ వంటి అధికారులెందరినో చూశాం. కానీ అశోక్ ఖేమ్కా ఉదంతం, సీబీఐ కేసుల పాలైన బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ ఉదంతం క ళ్లముందుండగా స్వతంత్రంగా ప్రజా సంక్షేమానికి తెగించేదెందరు? అవినీతి, అక్రమాల నుంచి బూటకపు ఎదురుకాల్పుల వరకు అధికార యంత్రాంగం పాత్ర లేదని ఎవరూ అనడం లేదు. ప్రభుత్వ విధానాలకు బద్ధులై పనిచేయాల్సిన అధికార యంత్రాంగం తప్పులలో తమ ప్రమేయం లేదని మంత్రులు తప్పించుకోలేరు. మూలం నుంచే సంస్కరణ జరగాలి. గుర్రమే కాదు రౌతు కూడా మారాలి. అధికారులే కాదు, వారిని శాసించే నేతలు కూడా నైతిక విలువలకు కట్టుబడి, ప్రజాహితం కోసం పని చేయాలి. అప్పుడే గోస్వామి వంటివారు పరిధులు దాటి చలాయించే అధికారాలకు అడ్డుకట్ట పడుతుంది. (వ్యాసకర్త సామాజిక కార్యకర్త మొబైల్ నం: 9394486016) -
కేంద్ర హోం సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన గోయల్
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎల్ సీ గోయల్ గురువారం హోంశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1979 కేరళ ఐఏఎస్ బ్యాచ్ అధికారి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయంలో అంతర్గత భద్రత విభాగంగా సంయుక్త కార్యదర్శిగా గోయల్ విధులు నిర్వహించారు. అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న అనిల్ గోస్వామికి కేంద్ర సర్కార్ ఉద్వాసన తెలిపింది. దాంతో హోంశాఖ కార్యదర్శిగా ఎల్ సీ గోయల్ నియమించాలని కేంద్రం బుధవారం రాత్రి నిర్ణయించిన సంగతి తెలిసిందే. శారదా స్కాం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి మాతంగి సిన్హా అరెస్ట్ వ్యవహారంలో అనిల్ గోస్వామి జోక్యం చేసుకున్నారని... సీబీఐ.. ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) ఫిర్యాదు చేసింది. దాంతో పీఎంవో వెంటనే స్పందించి అనిల్ గోస్వామిని పదవి నుంచి తొలగించింది. దాంతో ఎల్ సీ గోయిల్ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు. -
కేంద్ర హోంశాఖ కార్యదర్శిపై వేటు
-
కేంద్ర హోంశాఖ కార్యదర్శిపై వేటు
న్యూఢిల్లీ: శారదా కుంభకోణంలో కాంగ్రెస్ నేత మాతంగ్‌సిన్హ్ అరెస్ట్‌ను నిలువరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల్లో చిక్కుకున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్గోస్వామికి ప్రభుత్వం ఉద్వాసన పలికింది. తొలుత ఆయనను తొలగించాలని నిర్ణయించినప్పటికీ.. గౌరవప్రదంగా తప్పుకునేందుకు అవకాశమిస్తూ రాజీనామా చేయాలని ఆదేశించింది. అయితే.. స్వచ్ఛం దం పదవీ విరమణకు అవకాశమివ్వాలని గోస్వామి కోరడంతో.. సర్కారు నోటీసు కాలానికి మినహాయింపునిచ్చి వీఆర్ఎస్కు అనుమతించింది. దీంతో గోస్వామి బుధవారం రాత్రి వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆయన స్థానంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న ఎల్.సి.గోయల్(1979 బ్యాచ్ కేరళ కేడర్) హోంశాఖ కొత్త కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించినట్లు రాత్రి పొద్దుపోయాక అధికారిక ప్రకటన వెలువడింది. కేంద్రంలో ఉన్నతస్థాయి అధికారిని పదవి నుంచి తొలగించటం వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఉదంతం. గత బుధవారం విదేశాంగ శాఖ కార్యదర్శి పదవి నుంచి సుజాతాసింగ్‌ను ప్రభుత్వం అర్థంతరంగా తొలగించిన విషయం తెలిసిందే. రాజ్‌నాథ్ వద్ద అంగీకరించిన గోస్వామి.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో మాతంగ్‌సిన్హ్ అరెస్ట్ వ్యవహారంలో అనిల్‌గోస్వామి జోక్యం చేసుకోవటంపై అసంతృప్తిగా ఉన్న సీబీఐ.. గోస్వామి, సీబీఐలోని జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారుల మధ్య సాగిన వ్యవహారంపై ప్రధాని కార్యాలయానికి ఆదివారం నాడు ఒక నివేదిక సమర్పించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. మంగళవారం రాజధాని ఢిల్లీకి తిరిగివచ్చిన హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అదే రాత్రి.. ఈ వ్యవహారంపై గోస్వామితో మాట్లాడారు. బుధవారం ఉదయం గోస్వామిని తన చాంబర్‌కు పిలిపించుకుని గంటసేపు సమావేశమయ్యారు. మాతంగ్‌ను సీబీఐ అరెస్ట్ చేయడానికి ముందు.. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులతో తాను మాట్లాడానని గోస్వామి రాజ్‌నాథ్ వద్ద అంగీకరించారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సీబీఐ డెరైక్టర్ అనిల్సిన్హాను కూడా రాజ్‌నాథ్ తన చాంబర్‌కు పిలిపించి సమావేశమయ్యారు. సీబీఐ డెరైక్టర్ కూడా అనిల్‌గోస్వామితో వేరుగా భేటీ అయ్యారు. మొత్తం వ్యవహారంపై ప్రధానికి రాజ్‌నాథ్ వివరించారని.. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి పదవి నుంచి అనిల్‌గోస్వామిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు వివరించాయి. తక్షణమే వీఆర్ఎస్ అమలు అనిల్‌గోస్వామిని పదవి నుంచి తొలగించినట్లు తొలుత వార్తలు వెలువడినప్పటికీ.. తానే గౌరవప్రదంగా వైదొలగేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ.. రాజీనామా చేయాలని ఆదేశించిందని ఆ తర్వాత అధికార వర్గాలు వివరించాయి. అయితే.. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేందుకు అవకాశమివ్వాలని గోస్వామి కోరారని.. దీంతో నోటీసు కాలం నుంచి మినహాయింపునిచ్చి ఆయన వీఆర్ఎస్ను తక్షణమే అమలులోకి తెస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి అధికారిక ప్రకటనలో తెలిపింది. జమ్మూకశ్మీర్ కేడర్‌కు చెందిన 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనిల్‌గోస్వామి.. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీకి ఆయనకు 60 ఏళ్ల వయసు నిండింది. అస్సాంకు చెందిన వివాదాస్పద నేత మాతంగ్‌సిన్హ్ ఆయనకు సన్నిహితులని చెప్తారు. మాతంగ్ పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. హోంశాఖ కార్యదర్శిగా గోస్వామి రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది జూన్ వరకూ ఉన్నప్పటికీ.. మాతంగ్ అరెస్ట్ వ్యవహారంలో జోక్యంతో అర్థంతరంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. -
అనిల్ గోస్వామిని పంపిస్తారా?
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి బుధవారం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. శారదా కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుడు మాతాంగ్ సింగ్ ను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆయన అడ్డుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ ఉదయం కార్యాలయానికి రాగానే తనను కలవాలని గోస్వామికి రాజ్ నాథ్ కబురు పంపారు. దీంతో ఆయనను గోస్వామి కలిశారు. దాదాపు గంటసేపు వారు చర్చలు జరిపారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు అనిల్ గోస్వామి ఇష్టపడలేదు. అయితే ఆయనపై వేటు పడే అవకాశముందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన విషయంలో కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందనేది త్వరలోనే తేలనుంది. -
ఆ ఆస్తుల్లో ఆంధ్రాకూ వాటా
-
ఆ ఆస్తుల్లో ఆంధ్రాకూ వాటా
* పలు సంస్థల ఆస్తులపై కేంద్ర హోంశాఖకు ఏపీ సీఎస్ లేఖ * పదో షెడ్యూల్ సంస్థలతో పాటు ఏ షెడ్యూల్లో లేని సంస్థల్లోనూ ఏపీకి వాటా ఇవ్వాలి * లేదంటే కొత్త రాజధానిలో ఆ సంస్థల ఏర్పాటుకయ్యే వ్యయాన్ని కేంద్రం భరించాలి * అప్పటివరకు ఆ సంస్థల సేవలు ఏపీకి అందించాలి.. ఆ తర్వాత వదిలేస్తాం * తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నట్లు ఇతర రాష్ట్రాల విభజన అంశాలు ఏపీకి వర్తించవు * ఆ రాష్ట్రాల్లో ఉమ్మడి రాజధాని లేదు.. విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ అధికారాల నిబంధనలు రూపొందించాలి. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్లో పొందుపరచిన సంస్థల ఆస్తుల్లో సెక్షన్ 64 ప్రకారం.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి నివేదించారు. పదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉన్నందున ఆ సంస్థలన్నీ తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని, కేవలం సెక్షన్ 75 ప్రకారం ఆ సంస్థల సేవలను మాత్రమే ఏడాది పాటు అందిస్తామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వ వాదన సరికాదని ఆయన వివరించారు. సెక్షన్ 75 కేవలం ఆయా సంస్థల సేవలు అందించే విషయాన్ని పేర్కొందని, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆరో విభాగంలో సెక్షన్ 64 మాత్రం పదో షెడ్యూల్లోని సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని, రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాలు ఆస్తులను పంపిణీ చేసుకోవాలని, ఇరు రాష్ట్రాలు పంపిణీ చేసుకోలేకపోతే కేంద్ర ప్రభుత్వమే పంపిణీ చేయాలని పేర్కొందని సీఎస్ వివరించారు. అంతేకాకుండా గతంలో రాష్ట్రాల విభజన సమయంలో పలు ప్రక్రియలు ఇక్కడ వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన కూడా సరికాదని ఆయన స్పష్టంచేశారు. గతంలో విడిపోయిన రాష్ట్రాలకు ప్రస్తుతం ఏపీకి ఉన్న తరహాలో ఉమ్మడి రాజధాని లేదని గుర్తుచేశారు. వాటా లేదంటే కొత్త రాజధానిలో కేంద్రమే ఏర్పాటు చేయాలి... తెలంగాణ వాదన ప్రకారం పదో షెడ్యూల్లోని సంస్థల్లోను.. అలాగే ఏ షెడ్యూల్లో లేని సంస్థల్లోను ఎటువంటి వాటా కోరకూడదంటే.. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ఆయా సంస్థల నిర్మాణానికి అవసరమైన మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని.. నూతన రాజధానిలో ఆ సంస్థలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి వచ్చే వరకు.. తెలంగాణలోని ఆయా సంస్థల సేవలను ఆంధ్రాకు కొనసాగింపచేయాలని కృష్ణారావు కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరారు. అప్పుడు పదో షెడ్యూల్లోని సంస్థల ఆస్తుల్లో వాటా అడగకుండా వదిలేసి వెళ్లిపోతామని స్పష్టంచేశారు. లేదంటే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఆయా సంస్థల ఆస్తులు పంపిణీని కేంద్ర ప్రభుత్వమే చేయాలని, ఇందుకు అవసరమైన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. ఇతర అంశాలపైనా స్పష్టత ఇవ్వాలి... ‘‘రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 53 (1) (బి) ప్రకారం తొమ్మిదో షెడ్యూల్లోని ప్రధాన కార్యాలయాలను ఇరు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి మేరకు పంపిణీ చేయాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యాలయాలు మాత్రమే అని భావిస్తోంది. భవనాలతో పాటు ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ కేంద్రాన్ని కోరారు. ఈ విషయంపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి’’ అని ఐవైఆర్ కోరారు. హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాలను అమలు చేయండి.. ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర ప్రాంత వాసుల ప్రయోజనాలను పరిరక్షించడం, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగిస్తూ చట్టంలోని 8వ సెక్షన్లో పేర్కొన్నారని, ఇందుకు సంబంధించిన నిబంధనలను ఇప్పటి వరకు రూపొందించలేదని ఏపీ సీఎస్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులను నియమించినా, వారికి ఇప్పటి వరకు ఎటువంటి పనిలేదని, చట్టంలో పేర్కొన్న అధికారాలను గవర్నర్ నిర్వహించలేకపోతున్నారని సీఎస్ వివరించారు. దీని నిబంధనలను త్వరగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. అలాగే కార్మిక సంక్షేమ నిధి బదిలీతో పాటు తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎవరిది తప్పో తేల్చడానికి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కూడా ఐవైఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
విభజన హామీలు అమలు చేయండి
కేంద్ర కార్యదర్శులతో సీఎస్ కృష్ణారావు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణచట్టం-2014లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన అన్ని హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని కోరారు. ఆయనతో పాటు ఢిల్లీలో పలుశాఖల కార్యదర్శులతో సీఎస్ వరుసగా భేటీ అయ్యారు. సాయంత్రం ఏపీభవన్‌లో కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రాతో సమావేశమై వీలైనంత త్వరగా ఉద్యోగుల విభజన చేపట్టాలని కోరినట్లు తెలిపారు. హుద్‌హుద్ తుపాను సాయం కింద ప్రధాని ప్రకటించిన మొత్తంలో రావాల్సిన మిగిలిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. నేడు ఏపీ, తెలంగాణ సీఎస్ల భేటీ: విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను త్వరితగతిన అమలు చేయడంతోపాటు, ఏపీ, తెలంగాణల మధ్య తలెత్తిన పలు వివాదాలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల సీఎస్‌లు కృష్ణారావు, రాజీవ్‌శర్మలు శుక్రవారం ఇక్కడ భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో మధ్యాహ్నం 12 గంటలకు నార్త్‌బ్లాక్‌లో ఈ సమావేశం జరగనుంది. -
ఎబోలా నిరోధానికి కసరత్తు
19, 20 తేదీల్లో రాష్ట్రాల అధికారులకు ఢిల్లీలో శిక్షణ న్యూఢిల్లీ/ముంబై: ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకించి, పశ్చివూఫ్రికా దేశాల్లో దాదాపు 4వేలమందికిపైగా వుృతికి కారణమైన భయనక ఎబోలా వ్యాధి నిర్ధారణ, నిరోధంపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య అధికారులకు శిక్షణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్, కేంద్ర హోంశాఖ కార్యద ర్శి అనిల్ గోస్వామి నిర్వహించిన ఉన్నతస్థారుు సవూవేశంలో ఈ మేరకు నిర్ణయుం తీసుకున్నారు. ఈ నిర్ణయుంమేరకు ఎబోలా నిరోధంపై వివిధ రాష్ట్రప్రభుత్వాల అధికారులు ఈ నెల 19,20 తేదీల్లో ఢిల్లీలో శిక్షణపొందుతారని, వారు తవుతవు రాష్ట్రాలకు తిరిగివచ్చి, అధికారులకు శిక్షణ ఇస్తారని అధికారవర్గాలు తెలిపారుు. దేశంలోకి ప్రవేశించే ప్రతి ప్రయూణికుడి కీ ఎబోలా పరీక్షలు నిర్వహించేందుకు తవు తవు రాష్ట్రాల్లోని వివూనాశ్రయూల్లో, ఓడరేవుల్లో తగిన ఏర్పాట్లు చేయూలని, ఎబోలా వైరస్ సోకిన వారెవరూ దేశంలోకి రాకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఆదేశించారు. ఎబోలా ప్రపంచమంతటా వ్యాపించే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని, నిరోధంపై పూర్తిశ్రద్ధతో వ్యవహరించాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచిం చింది. జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి ఎబోలా వ్యాధిలక్షణాలున్నవారితో అతి దగ్గరి శారీరక సంబంధాలవల్లనే ఎబోలా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 8వేల మందికి పైగా ఎబోలా వ్యాధి సోకగా, వారిలో 4వేల మంది మరణించారు. కాగా, ఆఫ్రికా దేశాలనుంచి దేశంలో ప్రవేశించే ప్రయణికులందరిపైనా, ఎబోలా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అంతర్జాతీయు విమానాశ్రయూలన్నింటిలోనూ, అంతర్జాతీయు విమానాలు దిగే పుణె, నాగపూర్ విమానాశ్రయూల్లోను థర్మల్ ఇమేజి స్కానర్లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం బొంబాయి హైకోర్టుకు తెలియజేసింది. కేంద్రం తరఫు న్యాయవాది రూయ్ రోడ్రిజెస్ ఈ విషయన్ని బొంబాయి హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు. ఇదిలా ఉండగా, ఎబోలా సంక్షోభం ఇలాగే కొనసాగిన పక్షంలో అది తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
శాంతిభద్రతలపై బిల్లులోనే స్పష్టత
* ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో హోంశాఖ కార్యదర్శి సమావేశం * పాల్గొన్నకేంద్ర అధికారులు * కృష్ణాకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి: తెలంగాణ సీఎస్ * ఈఆర్సీ ఆమోదం ఉన్న పీపీఏలను మాత్రమే కొనసాగిస్తాం: ఏపీ సీఎస్ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో శాంతి భద్రతలను గవర్నర్‌కి అప్పగించడంపై విభజన బిల్లులోనే స్పష్టంగా ఉన్నందున దానిపై వివాదాలు అవసరంలేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పలు కీలక అంశాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు ఆయన ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశమయ్యారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి దాదాపు గంటన్నరపాటు నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు పర్యవేక్షిస్తున్న అడిషనల్ కార్యదర్శి సురేశ్‌కుమార్ సహా పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశం గవర్నర్‌కి అప్పగించడం, కృష్ణా జలాల పంపిణీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుతోపాటు ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర చర్చకు దారితీసిన విద్యుత్ కేటాయింపుల అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. పలు అంశాలపై ఇరువురు సీఎస్‌లతో గంటన్నరకు పైగా సమావేశమైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి గోస్వామి వారికి పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కి అప్పగించే అంశాన్ని ఏపీ సీఎస్ ప్రస్తావించగా... ఈ సమావేశంలో గవర్నర్ అధికారాల అంశాన్ని చర్చించాల్సిన అవసరంలేదని, అది విభజన బిల్లులోనే పేర్కొన్నామని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సూచించినట్టు తెలిసింది. కృష్ణా వాటర్‌బోర్డు ఏర్పాటుకు అవసరమైన సిబ్బందిని సైతం త్వరగా నియమించాలని ఇరు రాష్ట్రాలకు గోస్వామి సూచించినట్టు సమాచారం. కృష్ణా ట్రిబ్యునల్‌లో రాష్ట్రాల సంఖ్య నాలుగుకి చేరినందున ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్‌ను రద్దుచేసి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎస్ కోరారు. విభజన బిల్లులోనూ ఈ అంశం ఉందని గుర్తుచేశారు. అయితే ఇందుకు తమకు ఇంకా సమయం కావాలని ఏపీ సీఎస్ చెప్పినట్టు తెలిసింది. విద్యుత్ కేటాయింపులకు సంబంధించి పీపీఏ పైనా సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈఆర్సీ ఆమోదం ఉన్న పీపీఏలను మాత్రమే కొనసాగిస్తామని, లేనివాటిని రద్దు చేస్తామని ఏపీ సీఎస్ స్పష్టం చేసినట్టు సమాచారం.ఈనెల 24న కమల్‌నాథన్ కమిటీ సమావేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమల్‌నాథన్ కమిటీ ఈనెల 24న ఢిల్లీలో మరోమారు భేటీ కానున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు మార్గదర్శకాలు రూపొందించిన కమిటీ, తుది నివేదికను సమర్పించే ముందు అవసరమైన మార్పులు చేర్పులపై మరోమారు చర్చించనున్నట్ట తెలిసింది. -
20 లోగా మార్గదర్శకాలు
ఉద్యోగుల ఆకాంక్షలకు తగినట్లుగానే ఉంటాయి అనిల్ గోస్వామి హామీ హైదరాబాద్: ఉద్యోగ సంఘాల ఆకాంక్షలకు అనుగుణంగానే మార్గదర్శకాలు ఉంటాయని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి హామీ ఇచ్చారు. ఏపీఎన్జీవో, టీఎన్జీవో, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, తెలంగాణ ఉద్యోగుల సంఘం, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి బృందాలు మంగళవారం వేర్వేరుగా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో గోస్వామిని కలిసి వినతిపత్రాలు సమర్పించారుు. సంఘాల ప్రతినిధులు చెప్పిన విషయాలను హోం శాఖ కార్యదర్శి సావధానంగా విన్నారు. ఈనెల 19 లేదా 20న మార్గదర్శకాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలికంగానే ఉద్యోగుల విభజన జరుగుతుందని, తదుపరి రెండు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉద్యోగుల పంపిణీ చేస్తాయన్నారు. 371(డీ)లో పేర్కొన్న జోన్ల సంఖ్య పెంపు లేదా కుదింపు కోరుతూ ఆయా ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదనలు అందజేయవచ్చునని చెప్పారు. అందరికీ ఆప్షన్లు ఇవ్వాలి: సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇవ్వాల్సిందే. రాష్ట్రస్థాయి నియామకాల్లో ఉద్యోగాలు సంపాదించి సచివాలయం, హెచ్వోడీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జోనల్ వ్యవస్థ వర్తించదు. వారిని స్థానికత ఆధారంగా కాకుండా ఆప్షన్ల మేరకు ఇరు రాష్ట్రాలకు కేటాయించాలి.జిల్లాల నిష్పత్తిలో కాకుండా జనాభా నిష్పత్తిలో ఉద్యోగుల విభజన జరగాలి.రాజధానిలో ఉన్న ఉద్యోగుల పిల్లల స్థానికతను ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్లు ఇవ్వాలి. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన పిల్లలు సీమాంధ్రకు వెళ్లాలనుకుంటే అక్కడ వారిని ‘స్థానిక’ అభ్యర్థులుగా పరిగణించాలి.విభజనలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లో ఉండే అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలి. స్థానికత ఆధారంగా విభజించాలి: తెలంగాణ ఉద్యోగ సంఘాలు స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలి. తాత్కాలిక కేటాయింపునకు కూడా స్థానికతనే ఆధారంగా తీసుకోవాలి.సీమాంధ్రలో అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు పంపించాలి. అదే విధంగా తెలంగాణ నుంచి సీమాంధ్రకు పంపించాలి.ఉద్యోగుల విభజన మార్గదర్శకాల్లో 610 జీవో, గిర్గ్లానీ కమిటీ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలి.టీచర్లకూ ఆప్షన్లు ఇవ్వాలి: పీఆర్టీయూ, ఎస్టీయూవిభజన నేపథ్యంలో టీచర్లు సొంత జిల్లా, రాష్ట్రానికి వెళ్లడానికి వీలుగా ఆప్షన్ సౌకర్యం కల్పించాలి. దంపతులైన టీచర్లకూ ఈ సౌకర్యం ఉండాలి.కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలి.సీమాంధ్రకు లోటు బడ్జెట్ ఉన్నందున ఉద్యోగుల జీతభత్యాలకు ఇబ్బంది రాకుండా కేంద్రం సహకరించాలి. -
అధికారుల పంపిణీపై 16న మార్గదర్శకాలు: అనిల్ గోస్వామి
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర కేడర్ ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి మార్గదర్శకాలు 16న జారీ అయ్యే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ కార్యద ర్శి అనిల్ గోస్వామి చె ప్పారు. విభజన ప్రక్రియ పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో సీఎస్‌తో కలిసి ఆయన విభజన ప్రక్రియను సమీక్షించారు. వచ్చే రెండు వారాలు కీలకమని, విభజనపై వివిధ శాఖల ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని గోస్వామి తెలిపారు. కేంద్ర పరిధిలోకి వచ్చే అంశాలపై ప్రతిపాదనలను ఢిల్లీకి పంపాల్సిందిగా సూచించారు. అనంతరం గోస్వామి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో విభజన అంశాలపై చర్చించారు. -
ఒప్పుకుంటే అన్ని స్థాయిల్లో ఆప్షన్లు: అశోక్‌బాబు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏర్పడే కొత్త ప్రభుత్వాలు రెండూ ఒప్పుకుంటే అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మలు వెల్లడించినట్లు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. ఆ ప్రభుత్వాలు అంగీకరిస్తే ఏ రాష్ట్రంలోని ఉద్యోగులను ఆ రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. శనివారం అశోక్‌బాబుతో పాటు ఏపీఎన్జీవో సంఘం నేతలు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు హోంశాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శిలను కలిసి ఆప్షన్ల విషయమై వినతులు అందజేశారు. అనంతరం అశోక్‌బాబు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. పెన్షన్ల విషయంలోనూ ఇబ్బందులు తలెత్తకుండా పెన్షన్ ఖర్చును జనాభా ప్రతిపాదికన ఇరు ప్రాంతాలకు పంచుతున్నామని కేంద్ర అధికారులు చెప్పారన్నారు. -
‘ఉమ్మడి భద్రత’ ఇబ్బందే
వేధిస్తున్న సిబ్బంది కొరత 30 శాతం ఖాళీలు భర్తీ చేయాలి అనిల్ గోస్వామికి వివరించిన సిటీ పోలీసులు అది రాష్ట్ర పరిధిలోని అంశమన్న కేంద్ర ప్రతినిధి ఎన్నికల తర్వాత గవర్నర్‌కు నివేదించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా విభజన ప్రక్రియ పురోగతిని సమీక్షించడానికి వచ్చిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి పర్యటనపై నగర పోలీసులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఉమ్మడి రాజధానిలో తమపై పడే భారాన్ని ఆయనకు వివరించిన అధికారులు ఖాళీల భర్తీ, సిబ్బంది సంఖ్య పెంపు అంశాలను ప్రస్తావించారు. మొత్తం సావధానంగా విన్న గోస్వామి ఆ అంశాలు రాష్ట్ర పరిధిలోవని, మీరే తేల్చుకోవాలంటూ స్పష్టం చేశారు. దీంతో వాస్తవ పరిస్థితుల్ని వివరిస్తూ ఎన్నికల అనంతరం గవర్నర్‌కు కీలక ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. రెట్టింపు కానున్న బందోబస్తులు రాష్ట్ర విభజన తరవాత కూడా హైదరాబాద్ నగరం గరిష్టంగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. దీంతో సీఎం క్యాంప్ కార్యాలయం, సచివాలయం, మంత్రుల, ఎమ్మెల్యేల నివాస సముదాయాలు రెండేసి కానున్నాయి. రోడ్లపై ప్రముఖుల కదలికలు దాదాపు రెట్టింపు అవుతాయి. తమకున్న సమస్యలపై నిరసనలు తెలపడానికి రెండు రాష్ట్రాలకూ చెందిన నిరసనకారులు ఇక్కడే ధర్నాలు వంటిని కొనసాగిస్తారు. వీటికి తోడు తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ సమావేశాలు సైతం ఇక్కడే జరుగుతాయి. ప్రస్తుతం ఏడాదిలో మూడు దఫాలుగా జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలే గరిష్టంగా 45 రోజుల పాటు సాగుతున్నాయి. ‘ఉమ్మడి’ నేతృత్వంలో ఈ కాలం కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన కీలకాంశాలే. తీసికట్టుగా నగర పోలీసు సిబ్బంది దాదాపు 24 ఏళ్ల క్రితం అప్పటి సిటీ జనాభాను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం.. నగర పోలీసు విభాగానికి పోస్టుల్ని కేటాయించింది. కమిషనర్ నుంచి కానిస్టేబుల్ వరకు మొత్తం 12,401 పోస్టులు ఎలాట్ చేసింది. నాటి నుంచి నేటి వరకు ఇవి నూరు శాతం భర్తీ చేసిన దాఖలాలు లేవు. దీంతో ప్రస్తుతం సిటీ పోలీసు విభాగంలో 8,698 మంది సిబ్బందే అందుబాటులో ఉండగా దాదాపు 30 శాతం (3,703) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన, దర్యాప్తు అధికారి హోదా కలిగిన ఎస్సై స్థాయితో పాటు బందోబస్తు, భద్రతా విధుల్లో కీలక పాత్ర పోషించే కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ పోసుల్లో అనేకం ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి రాజధాని నేపథ్యంలో జంట కమిషనరేట్లను కలిపేసినా సిబ్బంది కొరత తీరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం 3500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సైబరాబాద్‌లో సైతం అందుబాటులో ఉన్న సిబ్బంది 5,155 మందే. కేంద్రం పరిధి కాదన్న గోస్వామి ఈ విషయాలను అనిల్ గోస్వామి దృష్టికి తీసుకువెళ్లిన నగర పోలీసులు ‘ఉమ్మడి భద్రత’ను చేపట్టాలంటే నగర కమిషనరేట్ పరిధిలో ఉన్న ఖాళీలను పూరించడంతో పాటు అదనంగా మరో నాలుగు వేల పోస్టుల్ని మంజూరు చేయాలని కోరారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించే విషయాన్ని పరిశీలించమని కోరారు. ఈ అంశంపై స్పందించిన అనిల్ గోస్వామి హైదరాబాద్ పోలీసు సిబ్బంది అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశమని, దీనికి పరిష్కారం ఇక్కడే చూసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం నగర పోలీసులు తమ ఆశలన్నీ గవర్నర్ పైనే పెట్టుకున్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల అంశం గవర్నర్ చేతిలో ఉంటుంది. బందోబస్తు సమస్యలు శాంతిభద్రతల నిర్వహణ కిందికే వస్తుంది కనుక పోస్టుల భర్తీపై గవర్నరే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. దీంతో ఆయనకు కీలక ప్రతిపాదనలు పంపాలని సిటీ పోలీసులు నిర్ణయించారు. ఇందులో సిటీ పోలీసుల రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టడానికి అనుమతించడంతో పాటు నిధుల్ని మంజూరు చేయాల్సిందిగా కోరాలని భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో ప్రస్తుతం కోడ్ అమలులో ఉండటంతో.. ఈ ఘట్టం పూర్తయిన తరవాత గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. -
'ఉమ్మడి రాజధానిలో పోలీసులదే కీలకపాత్ర'
ఉమ్మడి రాజధాని నిర్వహణలో పోలీసులదే కీలకపాత్ర అని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అపాయింటెడ్ డేట్‌కు ముందే పోలీస్ శాఖలో స్పష్టత రావాలని ఆయన తెలిపారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు కేంద్రం ఆధీనంలోనే పని చేస్తాయని వెల్లడించారు. వాటి నిర్వహణ బాధ్యత కూడా కేంద్రమే చూసుకుంటుందని అనిల్ గోస్వామి పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నేతత్వంలోని బృందం మంగళవారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. విభజన నేపథ్యంలో జరుగుతున్న నివేదికలను ఆ బృందం పరిశీలిస్తుంది. అందులోభాగంగా ఇప్పటికే అనిల్ గోస్వామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ తదితరులను కలసి సంగతి తెలిసిందే. -
సీఎస్ మహంతితో అనిల్ గోస్వామి భేటీ
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు జరుగుతున్న కసరత్తుపై అనిల్ గోస్వామి రెండోరోజు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో భేటీ అయ్యారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డీజీపీ ప్రసాదరావు, ఇతర పోలీసు ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఉమ్మడి రాజధాని, శాంతి భద్రతలు, పోలీసుల పాత్రపై ఈ సందర్భంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. -
రాజధానిలో మినహా.. ఎక్కడివారక్కడే
-
రాజధానిలో మినహా.. ఎక్కడివారక్కడే
* జిల్లాల్లోని ఉద్యోగులకు ‘విభజన’ వర్తించదు * కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్పష్టీకరణ * వర్సిటీలు, సొసైటీలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఎక్కడ నియమితులై తే అక్కడే * సచివాలయంలోని శాశ్వత ఉద్యోగులనే విభజనలో పరిగణలోకి తీసుకుంటారు * విభజన పనుల పురోగతిపై సంతృప్తి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి మినహా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో నియమితులైన ఉద్యోగులు రాష్ట్ర విభజన పరిధిలోకి రారని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. అక్కడ నియమితులైన వారు ఉద్యోగులు అక్కడే పనిచేస్తారని ఆ శాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి తెలిపారు. వారు అదే సంస్థల్లో పనిచేయడానికి నియమితులైన ందున వారు ఆప్షన్ పరిధిలోకి రారని వివరించారు. విభజన విషయంలో ఎవరీకి అన్యాయం జరగకుండా మానవతా దృక్పథంతో, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. విభజన ప్రక్రియ పురోగతిపై మంగళవారం ఆయన సచివాలయంలో కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌శర్మ, సంయుక్త కార్యదర్శి సురేష్‌కుమార్‌లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో పాటు విభజనపై ఏర్పాటు చేసిన కమిటీల ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. చిత్తూరు జిల్లాలోని ద్రవిడ యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయమని, అక్కడి ఉద్యోగుల పరిస్థితి ఎలా అని ఓ అధికారి ప్రశ్నించగా గోస్వామి పై విధంగా స్పందించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిని ఇరు రాష్ట్రాలకు సర్దుబాటు చేస్తారు తప్ప.. ఇతర జిల్లాలకు పంపించడానికి వీలుండదని రాష్ట్ర ఉన్నతాధికారి కూడా ఒకరు స్పష్టంచేశారు. రాష్ట్ర విభజనకు జరుగుతున్న కసరత్తుపై గోస్వామి పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రధానంగా ఫైళ్లు, ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల విభజన కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. సమీక్షలో ముఖ్యాంశాలివీ.. తెలంగాణ రాష్ట్ర ఖాతాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభించాలని అనిల్‌గోస్వామి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులతో బుధవారం సమావేశమై ఖాతా ఏర్పాటుపై చర్చించనున్నారు. * జూన్ ఒకటో తేదీ అర్థరాత్రికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ రోజుకు ఉన్న కన్సాలిడేటెడ్ ఫండ్‌ను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. * రాష్ట్ర శాసనసభ ఇదివరకే అమోదించిన ఆరు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆధారంగా నిధులు వ్యయం చేసుకోవచ్చని, అందుకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే వీలు కల్పించారని ఓ అధికారి వివరించారు. * రాష్ట్రస్థాయి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ అయ్యాక, పూర్తి సమాచారాన్ని కేంద్రానికి నివేదిస్తారు. స్థానికత, విద్యాభ్యాసం, ఉద్యోగంలో చేరికను ప్రామాణికత తీసుకుంటారా? అన్నది కేంద్ర మార్గదర్శకాలు వచ్చాకే తేలుతుంది. * విభజన సమయంలో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లోని శాశ్వత ఉద్యోగులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విభజన పరిధిలోకి తీసుకోరు. వారికి న్యాయపరంగా హక్కు లేనందున వారిని విభజన పరిధిలోకి తీసుకోం. * కమలనాథన్ కమిటీ ఇచ్చే సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. * సివిల్ సర్వీసెస్ అధికారుల పంపిణీకి కేంద్రం ఒక కమిటీని నియమిస్తుంది. వారి నిర్ణయమే ఫైనల్. * జూన్ 2న ఇరు రాష్ట్రాలకు సీఎస్‌లు, డీజీపీలు ఉండటంతో పాటు.. ట్రెజరీలు, ఖాతాలు ఉంటాయి. * ఏప్రిల్ చివరి నాటికి పూర్తి సమాచారం సిద్ధంగా ఉండాలి. జూన్ రెండో తేదీన ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు రాష్ట్రాల పాలన సాగాలి. * గవర్నర్‌తో అనిల్‌గోస్వామి భేటీ: అనిల్‌గోస్వామి మంగళవారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్యకంగా కలుసుకున్నారు. మరోవైపు.. గోస్వామి, రాజీవ్‌శర్మ, సురేశ్కుమార్లకు సీఎస్ మహంతి మంగళవారం ప్రైవేట్ హోటల్లో విందు ఇచ్చారు. * పోలీసు విభజనపై నేడు సమీక్ష: రాష్ట్ర విభజన నేపథ్యంలో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసులు, పోలీసు సంస్థల పంపిణీ అంశాలపై కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు అనిల్‌గోస్వామి, రాజీవ్‌శర్మ, సురేశ్‌కుమార్‌లు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. మరోవైపు పాలక మండలి (బోర్డు)లో విభజన తీర్మానం చేసి పంపాలని ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్ర సర్కారు ఆదేశించింది. ప్రభుత్వరంగ సంస్థలపై ఏర్పాటైన ప్రదీప్ చంద్ర కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమయ్యింది. ఇందులో 65 ప్రభుత్వరంగ సంస్థలు, సహకార సంస్థలకు చెందిన ఎండీలు పాల్గొన్నారు. మార్చి 25 నాటికి పూర్తిస్థాయిలో విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు పాలనా ట్రిబ్యునల్ లేదా? పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొరపాటు.. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి పాలనా (అడ్మినిస్ట్రేటివ్) ట్రిబ్యునల్ ఏర్పాటు కాదా? అంటే.. ఏర్పాటు కాదు అనే సమాధానం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. విభజన ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటుపై చట్టంలో పొరపాటు ఉందని ఒక అధికారి ప్రస్తావించారు. దీనిపై గోస్వామి స్పందిస్తూ.. చట్టంలో పొరపాటు జరిగిన మాట వాస్తవ మేనని, అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక దీనిపై న్యాయ సలహా తీసుకుని ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నట్లు సమాచారం. రాజ్యాంగంలోని 371-డి అధికరణ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి పాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని స్పష్టంచేశారు. అయితే.. తెలంగాణలో పాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు కావాలంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తీసుకురావాల్సి ఉంటుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయింది. చట్టంలో సవరణలు చేయకుండా ఇతర మార్గాలేమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమని, రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఈ విషయంపై న్యాయ సలహాలతో ముందుకు వెళ్తారని గోస్వామి పేర్కొన్నట్లు తెలిసింది. -
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంశాఖ బృందం
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ బృందం మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నేతత్వంలోని ఈ బృందం నగరానికి విచ్చేసింది. విభజన నేపథ్యంలో జరుగుతున్న నివేదికలను పరిశీలిస్తారు. ఇందులో భాగంగానే మంగళవారం సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చిస్తారు. ఇప్పటివరకు విభజన అంశాలపై ముందుకు సాగేందుకు 15 కమిటీలను ఏర్పాటు చేశారు. ఉద్యోగుల పంపిణీ నుంచి కొత్త రాజధానికి స్థల పరిశీలన వరకూ కమిటీలు పని చేస్తున్నాయి. ఈ కమిటీల పురోగతిని గోస్వామి సమీక్షిస్తారు. అలాగే పోలీసులకు సంబంధించిన అంశాలు, ఉద్యోగులు, ఐపీఎస్‌ల పంపకాలపై బుధవారం జాతీయ పోలీసు అకాడమీలో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న తాజా వివరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గవర్నర్ నరసింహన్, 3.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఈ బృందం భేటీ కానుంది. -
పాట్నాలో మరో రెండు బాంబులు వెలికితీత!
పాట్నాలోని గాంధీ మైదానంలో మరో రెండు బాంబులను మంగళవారం పోలీసులు నిర్వీర్యం చేశారు. సంఘటనా స్థలాన్ని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సందర్శించి.. పేలుడు ప్రదేశాన్ని పరిశీలించారు. గోస్వామి సంఘటనా స్థలానికి వెళ్లడానికి రెండు గంటల ముందు రెండు బాంబులను పోలీసులు కనుగొన్నారు. తొలి బాంబును గాంధీ మైదానానికి 50 మీటర్ల దూరంలోని ఎస్కే మోమోరియల్ హాల్ వద్ద, రెండవ బాంబును గాంధీ మైదానంలోనే పోలీసులు నిర్వీర్యం చేశారు. గాంధీ మైదానంలో ఇంకొన్ని బాంబులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎలాంటి వస్తువులైనా.. అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇప్పటి వరకు పోలీసులు మొత్తం ఆరు బాంబులు గాంధీ మైదానం వద్ద కనుగొన్నారు. ఆదివారం గాంధీ మైదానంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ హుంకార్ ర్యాలీని నిర్వహించిన సమయంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లకు కారణమని అనుమానిస్తున్న మహమ్మద్ ఇంతియాజ్ అన్సారీని పాట్నాలోని జుడిషియల్ కస్టడీకి తరలించగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
నేడు బ్యాంకుల చీఫ్‌లతో చిదంబరం భేటీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో మంగళవారం ఆర్థిక మంత్రి పీ.చిదంబరం సమావేశం కానున్నారు. మొండిబకాయిల సమస్య, రుణ వృద్ధి, ద్రవ్య వ్యవస్థ పనితీరు వంటి అంశాలపై ఈ సమావేశం చర్చించనుందని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి 31నాటికి రూ.1.55 లక్షల కోట్లు ఉంటే, ఈ పరిమాణం జూన్ క్వార్టర్ నాటికి రూ.1.76 లక్షల కోట్లకు పెరిగింది. వాణిజ్య బ్యాంకుల స్థూల రుణాల్లో స్థూల మొండిబకాయిల నిష్పత్తి 2011 మార్చిలో 2.36 శాతం ఉంటే- 2013 మార్చికల్లా ఇది 3.92 శాతానికి చేరింది. ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలోనే వ్యవస్థలో డిమాండ్‌ను పునరుద్ధరించడానికి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని కొంత తక్కువ వడ్డీరేటుకు గృహ, వాహన, వినియోగ వస్తువులపై బ్యాంకులు రుణాలను మంజూరు చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జరగనున్న చిదంబరం-బ్యాంకర్ల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
సురక్షిత ప్రాంతాలకు 5 లక్షల మంది
న్యూఢిల్లీ: తుపాను ప్రభావం ఎక్కువగా పడే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల నుంచి 5.25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోం సెక్రటరీ అనిల్ గోస్వామి తెలిపారు. ఒడిశాలో 4.25 లక్షల మందిని, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మందిని 500 రక్షిత కేంద్రాలకు తరలించినట్లు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలు, ఒడిశా తీరప్రాంతంలో విద్యుత్ నిలిపివేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఒడిశాలో 1500 మెగావాట్లు, ఏపీలో 500 మెగావాట్లు విద్యుత్ వినియోగం తగ్గిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. హైవేలను మరమ్మతు చేయండి పై-లీన్ తుపాను కారణంగా హైవేలు ఎక్కడైనా ధ్వంసమైతే ఆ ప్రాంతంలో వెంటనే మరమ్మతులు చేయడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు కేంద్ర రోడ్లు, హైవేల మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. తుపాను ప్రభావం పడే ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్‌కు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ఒక ప్రకటనలో ఆదేశించింది. దీనికోసం ఒక కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశామని తెలిపింది. -
కార్గిల్‌లో మళ్లీ పాక్ కాల్పులు
1999 నాటి యుద్ధం తర్వాత తొలిసారి.. న్యూఢిల్లీ: పద్నాలుగేళ్ల కిందట కార్గిల్‌లోకి చొరబడి భారత జవాన్ల చేతిలో మట్టికరచిన పాక్ సైన్యం తాజాగా మళ్లీ అక్కడ కవ్వింపునకు దిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంత మైన కార్గిల్ సెక్టార్లో నాలుగు రోజుల్లో రెండుసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాక్ 14 ఏళ్లలో కార్గిల్‌లో కాల్పులకు పాల్పడడం ఇదే తొలిసారి. సోమవారం రాత్రి ద్రాస్, కార్గిల్‌ల మధ్యలోని కక్సార్లో ఉన్న చెనిగుండ్ పోస్టుపై పాక్ బలగాలు తొలుత చిన్నపాటి ఆయుధాలతో, తర్వాత ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపాయి. గురువారం రాత్రి లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్లో సాందో పోస్టుపై ఇదే దుశ్చర్యకు ఒడిగట్టాయి. పాక్ కాల్పులకు భారత జవాన్లు దీటైన ఎదురుకాల్పులతో గట్టి జవాబిచ్చారు. 1999లో పాక్ సైనికులు కార్గిల్‌లోకి చొరబడడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కార్గిల్ జోలికి రావడానికి భయపడిన పాక్ బలగాలు ప్రస్తుతం సరిహద్దులో కాల్పుల విరమణను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ మళ్లీ కార్గిల్‌లో కాల్పులు జరిపాయి.1999 నాటి యుద్ధంలో భారత యువ లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా, ఆయన సహచరులు చెనిగుండ్ పోస్టు వద్దే కనిపించకుండా పోయారు. తర్వాత చిత్రహింసలతో ఛిద్రమైన వారి మృతదేహాలను పాక్ భారత్‌కు అప్పగించింది. కాగా, సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో భారత హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి జమ్మూలో భద్రతా పరిస్థితిని సమీక్షించారు.