కేంద్ర హోంశాఖ కార్యదర్శిపై వేటు | Home Secretary Anil Goswami sacked | Sakshi
Sakshi News home page

కేంద్ర హోంశాఖ కార్యదర్శిపై వేటు

Published Thu, Feb 5 2015 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

కేంద్ర హోంశాఖ కార్యదర్శిపై వేటు

కేంద్ర హోంశాఖ కార్యదర్శిపై వేటు

న్యూఢిల్లీ: శారదా కుంభకోణంలో కాంగ్రెస్ నేత మాతంగ్‌సిన్హ్ అరెస్ట్‌ను నిలువరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల్లో చిక్కుకున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామికి ప్రభుత్వం ఉద్వాసన పలికింది. తొలుత ఆయనను తొలగించాలని నిర్ణయించినప్పటికీ.. గౌరవప్రదంగా తప్పుకునేందుకు అవకాశమిస్తూ రాజీనామా చేయాలని ఆదేశించింది. అయితే.. స్వచ్ఛం దం పదవీ విరమణకు అవకాశమివ్వాలని గోస్వామి కోరడంతో.. సర్కారు నోటీసు కాలానికి మినహాయింపునిచ్చి వీఆర్‌ఎస్‌కు అనుమతించింది.

దీంతో గోస్వామి బుధవారం రాత్రి వీఆర్‌ఎస్ తీసుకున్నారు. ఆయన స్థానంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న ఎల్.సి.గోయల్(1979 బ్యాచ్ కేరళ కేడర్) హోంశాఖ కొత్త కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించినట్లు రాత్రి పొద్దుపోయాక అధికారిక ప్రకటన వెలువడింది. కేంద్రంలో ఉన్నతస్థాయి అధికారిని పదవి నుంచి తొలగించటం వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఉదంతం. గత బుధవారం విదేశాంగ శాఖ కార్యదర్శి పదవి నుంచి సుజాతాసింగ్‌ను ప్రభుత్వం అర్థంతరంగా తొలగించిన విషయం తెలిసిందే.  

రాజ్‌నాథ్ వద్ద అంగీకరించిన గోస్వామి..

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో మాతంగ్‌సిన్హ్ అరెస్ట్ వ్యవహారంలో అనిల్‌గోస్వామి జోక్యం చేసుకోవటంపై అసంతృప్తిగా ఉన్న సీబీఐ.. గోస్వామి, సీబీఐలోని జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారుల మధ్య సాగిన వ్యవహారంపై ప్రధాని కార్యాలయానికి ఆదివారం నాడు ఒక నివేదిక సమర్పించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. మంగళవారం రాజధాని ఢిల్లీకి తిరిగివచ్చిన హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అదే రాత్రి.. ఈ వ్యవహారంపై గోస్వామితో మాట్లాడారు. బుధవారం ఉదయం గోస్వామిని తన చాంబర్‌కు పిలిపించుకుని గంటసేపు సమావేశమయ్యారు.

మాతంగ్‌ను సీబీఐ అరెస్ట్ చేయడానికి ముందు.. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులతో తాను మాట్లాడానని గోస్వామి రాజ్‌నాథ్ వద్ద అంగీకరించారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సీబీఐ డెరైక్టర్ అనిల్‌సిన్హాను కూడా రాజ్‌నాథ్ తన చాంబర్‌కు పిలిపించి సమావేశమయ్యారు. సీబీఐ డెరైక్టర్ కూడా అనిల్‌గోస్వామితో వేరుగా భేటీ అయ్యారు. మొత్తం వ్యవహారంపై ప్రధానికి రాజ్‌నాథ్ వివరించారని.. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి పదవి నుంచి అనిల్‌గోస్వామిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు వివరించాయి.

తక్షణమే వీఆర్‌ఎస్ అమలు

అనిల్‌గోస్వామిని పదవి నుంచి తొలగించినట్లు తొలుత వార్తలు వెలువడినప్పటికీ.. తానే గౌరవప్రదంగా వైదొలగేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ.. రాజీనామా చేయాలని ఆదేశించిందని ఆ తర్వాత అధికార వర్గాలు వివరించాయి. అయితే.. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేందుకు అవకాశమివ్వాలని గోస్వామి కోరారని.. దీంతో నోటీసు కాలం నుంచి మినహాయింపునిచ్చి ఆయన వీఆర్‌ఎస్‌ను తక్షణమే అమలులోకి తెస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి అధికారిక ప్రకటనలో తెలిపింది.

జమ్మూకశ్మీర్ కేడర్‌కు చెందిన 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనిల్‌గోస్వామి.. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీకి ఆయనకు 60 ఏళ్ల వయసు నిండింది. అస్సాంకు చెందిన వివాదాస్పద నేత మాతంగ్‌సిన్హ్ ఆయనకు సన్నిహితులని చెప్తారు. మాతంగ్ పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. హోంశాఖ కార్యదర్శిగా గోస్వామి రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది జూన్ వరకూ ఉన్నప్పటికీ.. మాతంగ్ అరెస్ట్ వ్యవహారంలో జోక్యంతో అర్థంతరంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement