రాజధానిలో మినహా.. ఎక్కడివారక్కడే | All Districts employees not come under division, except hyderabad | Sakshi
Sakshi News home page

రాజధానిలో మినహా.. ఎక్కడివారక్కడే

Published Wed, Mar 19 2014 2:53 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

రాజధానిలో మినహా.. ఎక్కడివారక్కడే - Sakshi

రాజధానిలో మినహా.. ఎక్కడివారక్కడే

* జిల్లాల్లోని ఉద్యోగులకు ‘విభజన’ వర్తించదు
* కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్పష్టీకరణ
* వర్సిటీలు, సొసైటీలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఎక్కడ నియమితులై తే అక్కడే
* సచివాలయంలోని శాశ్వత ఉద్యోగులనే విభజనలో పరిగణలోకి తీసుకుంటారు
* విభజన పనుల పురోగతిపై సంతృప్తి

 
 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి మినహా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో నియమితులైన ఉద్యోగులు రాష్ట్ర విభజన పరిధిలోకి రారని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. అక్కడ నియమితులైన వారు ఉద్యోగులు అక్కడే పనిచేస్తారని ఆ శాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి తెలిపారు. వారు అదే సంస్థల్లో పనిచేయడానికి నియమితులైన ందున వారు ఆప్షన్ పరిధిలోకి రారని వివరించారు. విభజన విషయంలో ఎవరీకి అన్యాయం జరగకుండా మానవతా దృక్పథంతో, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.
 
  విభజన ప్రక్రియ పురోగతిపై మంగళవారం ఆయన సచివాలయంలో కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌శర్మ, సంయుక్త కార్యదర్శి సురేష్‌కుమార్‌లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో పాటు విభజనపై ఏర్పాటు చేసిన కమిటీల ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. చిత్తూరు జిల్లాలోని ద్రవిడ యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయమని, అక్కడి ఉద్యోగుల పరిస్థితి ఎలా అని ఓ అధికారి ప్రశ్నించగా గోస్వామి పై విధంగా స్పందించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిని ఇరు రాష్ట్రాలకు సర్దుబాటు చేస్తారు తప్ప.. ఇతర జిల్లాలకు పంపించడానికి వీలుండదని రాష్ట్ర ఉన్నతాధికారి కూడా ఒకరు స్పష్టంచేశారు. రాష్ట్ర విభజనకు జరుగుతున్న కసరత్తుపై గోస్వామి పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రధానంగా ఫైళ్లు, ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల విభజన కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. సమీక్షలో ముఖ్యాంశాలివీ..
 
 తెలంగాణ రాష్ట్ర ఖాతాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభించాలని అనిల్‌గోస్వామి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులతో బుధవారం సమావేశమై ఖాతా ఏర్పాటుపై చర్చించనున్నారు.
*  జూన్ ఒకటో తేదీ అర్థరాత్రికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ రోజుకు ఉన్న కన్సాలిడేటెడ్ ఫండ్‌ను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది.
*  రాష్ట్ర శాసనసభ ఇదివరకే అమోదించిన ఆరు నెలల ఓటాన్  అకౌంట్ బడ్జెట్ ఆధారంగా నిధులు వ్యయం చేసుకోవచ్చని, అందుకు రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనే వీలు కల్పించారని ఓ అధికారి వివరించారు.
*  రాష్ట్రస్థాయి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేంద్ర  ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ అయ్యాక, పూర్తి సమాచారాన్ని కేంద్రానికి నివేదిస్తారు. స్థానికత, విద్యాభ్యాసం, ఉద్యోగంలో చేరికను ప్రామాణికత తీసుకుంటారా? అన్నది కేంద్ర మార్గదర్శకాలు వచ్చాకే తేలుతుంది.
*  విభజన సమయంలో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లోని శాశ్వత ఉద్యోగులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను విభజన పరిధిలోకి తీసుకోరు. వారికి న్యాయపరంగా హక్కు లేనందున వారిని విభజన పరిధిలోకి తీసుకోం.
*  కమలనాథన్ కమిటీ ఇచ్చే సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.
 
*  సివిల్ సర్వీసెస్ అధికారుల పంపిణీకి కేంద్రం ఒక కమిటీని నియమిస్తుంది. వారి నిర్ణయమే ఫైనల్.
*  జూన్ 2న ఇరు రాష్ట్రాలకు సీఎస్‌లు, డీజీపీలు ఉండటంతో పాటు.. ట్రెజరీలు, ఖాతాలు ఉంటాయి.
*  ఏప్రిల్ చివరి నాటికి పూర్తి సమాచారం సిద్ధంగా ఉండాలి. జూన్ రెండో తేదీన ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు రాష్ట్రాల పాలన సాగాలి.
* గవర్నర్‌తో అనిల్‌గోస్వామి భేటీ: అనిల్‌గోస్వామి మంగళవారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్యకంగా కలుసుకున్నారు. మరోవైపు.. గోస్వామి, రాజీవ్‌శర్మ, సురేశ్‌కుమార్‌లకు సీఎస్ మహంతి మంగళవారం ప్రైవేట్ హోటల్‌లో విందు ఇచ్చారు.
* పోలీసు విభజనపై నేడు సమీక్ష: రాష్ట్ర విభజన నేపథ్యంలో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసులు, పోలీసు సంస్థల పంపిణీ అంశాలపై కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు అనిల్‌గోస్వామి, రాజీవ్‌శర్మ, సురేశ్‌కుమార్‌లు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. మరోవైపు పాలక మండలి (బోర్డు)లో విభజన తీర్మానం చేసి పంపాలని ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్ర సర్కారు ఆదేశించింది. ప్రభుత్వరంగ సంస్థలపై ఏర్పాటైన ప్రదీప్ చంద్ర కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమయ్యింది. ఇందులో 65 ప్రభుత్వరంగ సంస్థలు, సహకార సంస్థలకు చెందిన ఎండీలు పాల్గొన్నారు. మార్చి 25 నాటికి పూర్తిస్థాయిలో విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు.  
 
 తెలంగాణకు పాలనా ట్రిబ్యునల్ లేదా?
 పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొరపాటు..
 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి పాలనా (అడ్మినిస్ట్రేటివ్) ట్రిబ్యునల్ ఏర్పాటు కాదా? అంటే.. ఏర్పాటు కాదు అనే సమాధానం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. విభజన ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటుపై చట్టంలో పొరపాటు ఉందని ఒక అధికారి ప్రస్తావించారు. దీనిపై గోస్వామి స్పందిస్తూ.. చట్టంలో పొరపాటు జరిగిన మాట వాస్తవ మేనని, అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక దీనిపై న్యాయ సలహా తీసుకుని ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నట్లు సమాచారం.
 
 రాజ్యాంగంలోని 371-డి అధికరణ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి పాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని స్పష్టంచేశారు. అయితే.. తెలంగాణలో పాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు కావాలంటే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తీసుకురావాల్సి ఉంటుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయింది. చట్టంలో సవరణలు చేయకుండా ఇతర మార్గాలేమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమని, రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఈ విషయంపై న్యాయ సలహాలతో ముందుకు వెళ్తారని గోస్వామి పేర్కొన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement