
నేడు బ్యాంకుల చీఫ్‌లతో చిదంబరం భేటీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో మంగళవారం ఆర్థిక మంత్రి పీ.చిదంబరం సమావేశం కానున్నారు. మొండిబకాయిల సమస్య, రుణ వృద్ధి, ద్రవ్య వ్యవస్థ పనితీరు వంటి అంశాలపై ఈ సమావేశం చర్చించనుందని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి 31నాటికి రూ.1.55 లక్షల కోట్లు ఉంటే, ఈ పరిమాణం జూన్ క్వార్టర్ నాటికి రూ.1.76 లక్షల కోట్లకు పెరిగింది.
వాణిజ్య బ్యాంకుల స్థూల రుణాల్లో స్థూల మొండిబకాయిల నిష్పత్తి 2011 మార్చిలో 2.36 శాతం ఉంటే- 2013 మార్చికల్లా ఇది 3.92 శాతానికి చేరింది. ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలోనే వ్యవస్థలో డిమాండ్‌ను పునరుద్ధరించడానికి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని కొంత తక్కువ వడ్డీరేటుకు గృహ, వాహన, వినియోగ వస్తువులపై బ్యాంకులు రుణాలను మంజూరు చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జరగనున్న చిదంబరం-బ్యాంకర్ల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.