రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణచట్టం-2014లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన అన్ని హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని..
కేంద్ర కార్యదర్శులతో సీఎస్ కృష్ణారావు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణచట్టం-2014లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన అన్ని హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని కోరారు. ఆయనతో పాటు ఢిల్లీలో పలుశాఖల కార్యదర్శులతో సీఎస్ వరుసగా భేటీ అయ్యారు.
సాయంత్రం ఏపీభవన్‌లో కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రాతో సమావేశమై వీలైనంత త్వరగా ఉద్యోగుల విభజన చేపట్టాలని కోరినట్లు తెలిపారు. హుద్‌హుద్ తుపాను సాయం కింద ప్రధాని ప్రకటించిన మొత్తంలో రావాల్సిన మిగిలిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు.
నేడు ఏపీ, తెలంగాణ సీఎస్‌ల భేటీ: విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను త్వరితగతిన అమలు చేయడంతోపాటు, ఏపీ, తెలంగాణల మధ్య తలెత్తిన పలు వివాదాలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల సీఎస్‌లు కృష్ణారావు, రాజీవ్‌శర్మలు శుక్రవారం ఇక్కడ భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో మధ్యాహ్నం 12 గంటలకు నార్త్‌బ్లాక్‌లో ఈ సమావేశం జరగనుంది.