శాంతిభద్రతలపై బిల్లులోనే స్పష్టత
* ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో హోంశాఖ కార్యదర్శి సమావేశం
* పాల్గొన్నకేంద్ర అధికారులు
* కృష్ణాకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి: తెలంగాణ సీఎస్
* ఈఆర్‌సీ ఆమోదం ఉన్న పీపీఏలను మాత్రమే కొనసాగిస్తాం: ఏపీ సీఎస్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో శాంతి భద్రతలను గవర్నర్‌కి అప్పగించడంపై విభజన బిల్లులోనే స్పష్టంగా ఉన్నందున దానిపై వివాదాలు అవసరంలేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పలు కీలక అంశాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు ఆయన ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశమయ్యారు.
గురువారం ఉదయం 11 గంటల నుంచి దాదాపు గంటన్నరపాటు నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు పర్యవేక్షిస్తున్న అడిషనల్ కార్యదర్శి సురేశ్‌కుమార్ సహా పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రధానంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశం గవర్నర్‌కి అప్పగించడం, కృష్ణా జలాల పంపిణీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుతోపాటు ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర చర్చకు దారితీసిన విద్యుత్ కేటాయింపుల అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. పలు అంశాలపై ఇరువురు సీఎస్‌లతో గంటన్నరకు పైగా సమావేశమైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి గోస్వామి వారికి పలు సూచనలు చేశారు.
హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కి అప్పగించే అంశాన్ని ఏపీ సీఎస్ ప్రస్తావించగా... ఈ సమావేశంలో గవర్నర్ అధికారాల అంశాన్ని చర్చించాల్సిన అవసరంలేదని, అది విభజన బిల్లులోనే పేర్కొన్నామని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సూచించినట్టు తెలిసింది.
కృష్ణా వాటర్‌బోర్డు ఏర్పాటుకు అవసరమైన సిబ్బందిని సైతం త్వరగా నియమించాలని ఇరు రాష్ట్రాలకు గోస్వామి సూచించినట్టు సమాచారం. కృష్ణా ట్రిబ్యునల్‌లో రాష్ట్రాల సంఖ్య నాలుగుకి చేరినందున ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్‌ను రద్దుచేసి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎస్ కోరారు. విభజన బిల్లులోనూ ఈ అంశం ఉందని గుర్తుచేశారు. అయితే ఇందుకు తమకు ఇంకా సమయం కావాలని ఏపీ సీఎస్ చెప్పినట్టు తెలిసింది.
విద్యుత్ కేటాయింపులకు సంబంధించి పీపీఏ పైనా సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈఆర్‌సీ ఆమోదం ఉన్న పీపీఏలను మాత్రమే కొనసాగిస్తామని, లేనివాటిని రద్దు చేస్తామని ఏపీ సీఎస్ స్పష్టం చేసినట్టు సమాచారం.ఈనెల 24న కమల్‌నాథన్ కమిటీ సమావేశం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమల్‌నాథన్ కమిటీ ఈనెల 24న ఢిల్లీలో మరోమారు భేటీ కానున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు మార్గదర్శకాలు రూపొందించిన కమిటీ, తుది నివేదికను సమర్పించే ముందు అవసరమైన మార్పులు చేర్పులపై మరోమారు చర్చించనున్నట్ట తెలిసింది.