రంగుల చర్మం వెనుక రహస్యమిదిగో!
- చర్మ రంగుల తేడాలకు జన్యు మూలాలను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు
- సీసీఎంబీ ఆధ్వర్యంలో విస్తృత పరిశోధనలు
సాక్షి, హైదరాబాద్: ఆఫ్రికన్లది నలుపు రంగు. యూరోపియన్లది తెలుపు. చైనీలు ఎల్లో. జపనీలు ఇంకో రంగు. మరి భారతీయులో? ఇలా ఒకటా రెండా.. అన్ని రంగుల వాళ్లూ మనకు కనిపిస్తారు. అలాగే మనదేశంలో ఉత్తరాన పంజాబీలు, కశ్మీరీలది మిలమిల మెరిసే తెలుపైతే.. దక్షిణాన కేరళ, తమిళనాడుల్లో కారు నలుపు మనుషులు కనిపిస్తారు. వీరే కాక, చామనఛాయ, గోధుమ వర్ణం, ఇలా రకరకాల రంగుల సమ్మేళనం భారతీయుల్లో కనిపిస్తుంది. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే..? సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ (సీసీఎంబీ) బయాలజీ శాస్త్రవేత్తలు ఈ చర్మ రంగుల తేడాలకు సంబంధించిన జన్యు మూలాలను ఆవిష్కరించారు కాబట్టి. సీసీఎంబీ ఈస్టోనియా, కొన్ని ఇతర అంతర్జాతీయ పరిశోధక సంస్థలతో కలిసి ఈ అంశంపై విస్తృత అధ్యయనం చేసింది. భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సుమారు 1000 మందిని ఎంపిక చేసుకొని వారిలో 375 మందికి జన్యుపరమైన పరీక్షలు నిర్వహించింది.
ఈ పరిశోధనల ద్వారా తేలిందేమిటంటే.. తేలికపాటి చర్మం రంగుకు కారణమని ఇప్పటికే నిర్ధారించిన ఎస్‌ఎల్‌సీ24ఏ5 జన్యువులో వచ్చిన రెండు మార్పులని వీరు తెలుసుకోగలిగారు. దీంతోపాటు భారతదేశంలోకి గత 2వేల సంవత్సరాలుగా వేర్వేరు ప్రాంతాల ప్రజలు వలస రావడం ఒక కారణమని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ తెలిపారు. అంతేకాకుండా సామాజికమైన హోదా, ఒక వర్గంలోనే అధికంగా పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చర్మం రంగులో ఉన్న తేడాలకు కారణాలుగా వీరు గుర్తించారు. భారతదేశంలోని గిరిజన, తెగల జన్యువులతో ఇతరుల జన్యువులను పోల్చి చూసినపుడు చర్మం రంగుకు సంబంధించిన తేడాలు ప్రస్ఫుటంగా కనిపించారుు. ఈ పరిశోధన వివరాలుక ఆన్‌లైన్ పత్రిక ‘ది జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ’ నవంబర్ సంచికలో ప్రచురితమయ్యారుు. జన్యుపరమైన పరిశోధనలు సీసీఎంబీ విసృ్తతంగా చేపడుతోందని, వీటి ద్వారా భవిష్యత్తులో వ్యాధులకు మెరుగైన చికిత్సతోపాటు వ్యక్తుల జన్యుప్రభావం ఆధారంగా చికిత్స అందించే సౌకర్యం కలుగుతుందని సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.