ధరలు పెరిగిపోతున్నాయి. అసలు వస్తువులు, కూరగాయల ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయో తెలియని అయోమయ పరిస్థితి! ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న సర్ మాంటో ఏది ఏమైనా ధరల పెంపుదలకు కారణాలు కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. ఆడమ్ స్మిత్, డేవిడ్ రిచార్డో, జాన్ కినెస్ వంటివారు ఆర్థిక పరిస్థితుల మీద రచించిన గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. రాబడి, పన్నులు, నిరుద్యోగం వంటి వాటి మీద పరిశోధనలు చేసినా ధరల పెరుగుదల రహస్యాన్ని ఛేదించలేకపోతున్నాడు! ఇక ఈ విషయమ్మీద విసుగుపుట్టి వదిలివేయాలనుకున్న తరుణంలో పొరుగున ఒక పెద్దావిడ మాటల మధ్యలో సర్ మాంటోతో ‘‘ఈ విషయమ్మీద ఇంత మథనపడటమెందుకు? అసలు ఈ ధరలు పెంచి అమ్ముతున్న వారినే కలిసి అడిగితే సరిపోతుంది కదా!’’ అని ఒక సలహా ఇచ్చింది.సర్ మాంటోకు ఆ సలహా నచ్చింది. తన ప్రశ్నలకు, అనుమానాలకు త్వరలోనే ఊహించిన దానికన్నా మంచి సమాధానం దొరకబోతున్నదని ఆనందపడిపోయాడు.వెంటనే రియో డిజనైరోలో తన వీధి చివరనున్న మార్కెట్‌కు వెళ్లి ఉల్లిపాయలు అమ్మే అతన్ని, ‘‘ఎందుకు ఉల్లిపాయల ధరను పెంచేసి అమ్ముతున్నావు, ఎదుటివాడి ఆర్థిక పరిస్థితి అర్థం చేస్కోవా?’’ అని అడిగాడు.
‘‘అయ్యా! నేను కూడా బతకాలి కదా. ఎక్కువ ధర పెట్టి కొని, మరలా నా లాభం వేసుకుని అమ్మాలి కదా ఆలోచించండి’’ అన్నాడు. ‘‘నీకు ఎక్కువ ధరకు ఎవరు అమ్ముతున్నారు?’’‘‘సెంట్రల్ మార్కెట్‌లో ఉన్న డీలరు దగ్గర కొంటున్నాను’’ అని చెప్పాడు.వెంటనే సర్ మాంటో సెంట్రల్ మార్కెట్‌కి వెళ్లి, ‘‘ఉల్లిపాయలు ధర పెంచి మార్కెట్ వాళ్లకి ఎందుకు అమ్ముతున్నావు?’’ కర్కశంగా మొహం పెట్టి అడిగాడు.‘‘అయ్యా! నన్ను నమ్మండి. నేను తక్కువ ధరకే అమ్మాలనుకుంటున్నాను. లారీ వాడే ధర పెంచి లారీ లోడు ఉల్లిపాయలు నాకు అమ్మాడు. నేనేం చేసేది?’’ బేలగా చెప్పాడు.రెండోరోజు వేకువజామున మార్కెట్ దగ్గర కాపు కాచి ఉల్లిపాయల లోడుతో వచ్చిన లారీ వాణ్ని పట్టుకొని, ‘‘తెల్లవారి ఎవరూ చూడటం లేదని ఉల్లిపాయల ధరలు పెంచి అమ్ముతున్నావా?’’ అడిగాడు. ‘‘అయ్యా! నేనేం చేసేది? ఉల్లిపాయలు పండించే రైతే ధర పెంచి అమ్ముతున్నాడు. దానిమీద కొద్ది లాభంతో సెంట్రల్ మార్కెట్‌లో డీలర్‌కు అమ్ముకుంటున్నాను’’ చెప్పాడు.వెంటనే బస్సెక్కి సర్ మాంటో ఉల్లిపాయలు పండిచే రైతు వద్దకు వెళ్లి ‘‘నీవే ఉల్లిపాయల ధరలు పెంచి అమ్ముతున్నట్టు లారీ డ్రైవర్ చెప్పాడు. నీ విషయం ప్రభుత్వానికి చెప్పి నీ ఆటలు కట్టిస్తాను.’’ కోపంగా చెప్పాడు సర్ మాంటో. ‘‘దీనికంతా కారణం వానలు లేని వాతావరణం. వాన పడినపుడు తగినవిధంగా ఎరువులు వెయ్యాలి కదా! ఎరువులు 85 శాతం పెరిగిపోయాయి. మరి అంత ఖరీదు పెట్టి కొన్న ఎరువులతో పండించిన ఉల్లిపాయలు ధరలు పెంచి అమ్మక ఏం చేస్తాం?’’ బేలగా చెప్పాడు రైతు. సర్ మాంటో ఇక ఆలస్యం చేయకుండా ఎరువులు అమ్మే దుకాణానికి వెళ్లాడు. ఎరువులు అమ్మే దుకాణదారుడిని ఉల్లిపాయల ధరలకి కారణం నీవే అన్నట్టు కోపంగా వాడి కళ్లలో కళ్లు పెట్టి అడిగాడు.‘‘సార్! ధరలు పెంచి అమ్మడం నాకు సరదానా? నేను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న పొటాషియం కలిగిన ఎరువును కొద్దిలాభంతో అమ్మి నా కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాను’’ చెప్పాడు ఎరువుల దుకాణదారుడు.
సర్ మాంటో ఏది ఏమైనా ధరల పెరుగుదల విషయం అంతు చూడదలుచుకున్నాడు.రెండో రోజే విమానంలో ఫ్రాన్సుకు వెళ్లి ఎరువుల ఫ్యాక్టరీ సెక్రటరీని కలిసి బ్రెజిల్‌లో ధర పెరిగిపోతున్న ఉల్లిపాయల్ని గురించి అడిగాడు.‘‘దీనికి కారణం ఎరువుల తయారీకి కావలసిన రసాయనాలు తెచ్చే ఓడలు రవాణా ఖర్చు విపరీతంగా పెంచడమే..’’ చెప్పాడు ఫ్యాక్టరీ సెక్రటరీ. ఆ ఓడల నౌకాశ్రయం జర్మనీలోని హోంబర్గ్‌లో ఉంది. సర్ మాంటో సరాసరి అక్కడికి వెళ్లి ‘‘ఎందుకు మీరు రవాణా ఖర్చులను పెంచుతున్నారు. మీ వల్ల ఉల్లిపాయలకు బ్రెజిల్‌లో అధిక ధరలను మేం చెల్లిస్తున్నాం’’ గట్టిగా అడిగాడు.‘‘మేం ఓడలను తయారు చేయడానికి ఇనుముకు ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుసా? గ్రీసు దేశంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీలు ఉక్కును అతి ఎక్కువ ధరకు అమ్ముతున్నాయి. అందుకే మేం రవాణా ధరలు పెంచాం.’’ చెప్పాడు.‘‘దీనికంతా కారణం ఉక్కు పరిశ్రమా?’’ అనుకుంటూ మరలా విమానంలో గ్రీసులోని ఏథెన్స్‌కు వెళ్లాడు. అక్కడి పరిశ్రమలోని పెద్దను కలిసి, ‘‘మీరు ఉక్కు ధరను ఎందుకు పెంచారు? మీ వల్ల ఓడలు తయారుచేయడం ఖరీదు. దాని వల్ల వారు రసాయనాలను ఎక్కువ ధరకు రవాణా చేస్తున్నారు. అందువల్ల ఎరువులు ఖరీదైపోతున్నాయి. రైతులు ఉల్లిపాయల ధరలు పెంచుతున్నారు. అందుకే మా బ్రెజిల్‌లో ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి.ఇది మీకు న్యాయంగా ఉందా?’’ అడిగాడు సర్ మాంటో.‘‘అయ్యా! మీకు ఉక్కు ఏవిధంగా తయారవుతుందో తెలుసా? బొగ్గుతో ఇనుప ఖనిజాన్ని కరిగించి ఇనుముని తయారు చేస్తాం. సౌత్ ఆఫ్రికాలోని బొగ్గు గనులకు వెళ్లండి. బొగ్గుకు ఎంత ధర మేం చెల్లిస్తున్నామో మీకు తెలుస్తుంది’’ నమ్రతగా చెప్పాడు పరిశ్రమ పెద్ద. సర్ మాంటో సౌతాఫ్రికాకు విమానంలో వెళ్లాడు. బొగ్గు గనుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ని కలిసి ఉల్లి ధరల గురించి చెప్పాడు. ‘‘బొగ్గు గనులు తవ్వే పరికరాలకు, బొగ్గు రవాణా చేసే రైలుకు మేం కొంత చెల్లించాలి కదా, చెల్లించిన దానిమీద కొంత లాభం వేసుకుని అమ్ముతున్నాము. ఈ పరికరాలు, రైలు పెట్టెలు మాకు జపాన్‌లోని టోక్యో నుండి వస్తాయి. అందుకే బొగ్గును ఎక్కువ ధరకు వారికి అమ్ముతున్నాం’’ తాపీగా చెప్పాడు ఎగ్జిక్యూటివ్.
సర్ మాంటో ఇక ఆలోచించలేదు. అందుబాటులో ఉండే విమానంలో వెంటనే టోక్యోకు వెళ్లాడు.ఫ్యాక్టరీ చీఫ్ ఇంజనీర్‌ని కలిశాడు.‘‘తమరు బొగ్గు తవ్వే యంత్రాలు, రైలు వ్యాగన్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు? దీని వల్ల మా బ్రెజిల్‌లో ధరలు పెరిగిపోతున్నాయి’’ చెప్పాడు సర్ మాంటో. చీఫ్ ఇంజనీర్ తొణకకుండా ‘‘దీన్నే ట్రేడ్ బ్యాలెన్స్ అంటారు. మా యంత్ర పరికరాల్ని మీ బ్రెజీలియన్ ఉల్లిపాయలకు బదులుగా వారికి ఇస్తాం. పెరిగిపోయిన ఉల్లిపాయల ధరలతో మా పరికరాలు కూడా ధరలు పెరిగిపోయాయి. తమరు బ్రెజిల్ నుండి వచ్చారుగనక అడుగుతున్నాను – మీ బ్రెజిల్‌లో ఉల్లిపాయలు ఎందుకు అంత ఖరీదు?’’ చిరునవ్వుతో అడిగాడు చీఫ్ ఇంజనీర్.సర్ మాంటో ఏం చెప్పాలో తెలియక తలపట్టుకొని కూర్చున్నాడు!
పోర్చుగీస్ మూలం : కార్లోస్ ఎడ్యురాడో నోవెస్
అనువాదం: కంచనపల్లి వేంకట కృష్ణారావు
విష వలయం
Published Sun, Jul 22 2018 12:46 AM | Last Updated on Sun, Jul 22 2018 12:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment