గణనీయంగా పెరిగిన నిత్యావసరాల ధరలు
ఎగుమతులపై ఆంక్షల ఎత్తివేతతో
బియ్యం, దిగుమతి సుంకం పెంపుతో నూనెల ధరలకు రెక్కలు
ఈ ఏడాదిలో కూరగాయల ధరల్లో సగటున 30 శాతం వృద్ధి
పేదల నుంచి దిగువ ఉన్నతస్థాయి వర్గాల వరకు ఆందోళన
దేశంలో భారీగా తగ్గిన సాగు.. గుర్తించిన కేంద్ర వ్యవసాయ శాఖ
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పులు, తగ్గిన పంటల దిగుబడులు, అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు... సామాన్యుల వంటింటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిత్యం వినియోగించే బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏమాత్రం తగ్గకుండా పెరుగుతున్న ధరలతో సామాన్యుడు ఏం కొనేటట్టు లేదని.. ఏం తినేటట్టు లేదని వాపోతున్నాడు. దేశవ్యాప్తంగా 14 నెలల గరిష్టానికి నిత్యావసరాల ధరలు చేరుకున్నాయని ఇటీవలే కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ స్పష్టం చేసింది.
దేశంలో 70 రకాల పంటల సాగుకు అవకాశం ఉన్నప్పటికీ, కేవలం 20 నుంచి 25 రకాల పంటలనే ఎక్కువగా సాగు చేస్తున్నట్లు భారత వ్యవసాయ శాఖ గుర్తించింది. అందులో కొన్ని పంటలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయా వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలా దేశంలో గత పదేళ్లలో 22 రకాల సరుకుల ధరలు గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వం లెక్కలు వేసింది.
మొత్తమ్మీద సగటు వినియోగదారుడు వెచ్చాల కోసం భారీగా వెచ్చించాల్సిన పరిస్థితి. కాగా, డిసెంబర్ 6న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణంపై సమీక్షించనుందని, ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కొంతమేర ఊరట దక్కుతుందని ఆశిస్తున్నారు.
బియ్యం ధరలకు రెక్కలు
బాస్మతీయేతర తెల్లబియ్యంపై ఎగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం నెలరోజుల క్రితం రద్దు చేసింది. అలాగే పారా బాయిల్డ్ బియ్యంపై ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించింది. ఆంక్షలు ఎత్తివేయడంతో దేశం నుంచి బియ్యం ఎగుమతులు పెరిగాయి. విదేశాలకు ఎగుమతి అవుతున్న తెల్ల బియ్యం, పారా బాయిల్డ్ రైస్‌లో భారత్ వాటా 45 శాతం కాగా, ఇందులో తెలంగాణ, ఏపీలే కీలకం. రాష్ట్రంలో మేలు రకం బియ్యం ధరలు క్వింటాలుకు రూ.6,500 నుంచి రూ.7,500కు చేరుకున్నాయి.
ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ, సోనా మసూరి, జైశ్రీరాం వంటి మేలు రకాల ముడి బియ్యం ధరలు రూ.7వేల పైనే ఉన్నాయి. స్టీమ్డ్ రైస్ క్వింటాలుకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు లభిస్తున్నాయి. మిల్లుల నుంచి కిరాణా దుకాణాలు, ప్రొవిజనల్ స్టోర్స్, భారీ మాల్స్ వరకు అన్ని చోట్ల ధరలు అటు ఇటుగా ఇలాగే ఉండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
మండుతున్న నూనె
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే క్రూడ్ పామ్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 20 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. అలాగే రిఫైన్ చేసిన పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఇప్పటికే ఉన్న 12.5 శాతం సుంకాన్ని 32.5 శాతానికి పెంచింది. దీంతో మార్కెట్‌లో రూ.90 లోపు లభించే లీటర్ పామాయిల్ రూ.130 వరకు చేరుకోగా, సన్‌ఫ్లవర్ నూనె ధరలు రూ.135 నుంచి రూ.150కి చేరాయి. సుంకం పెంచని వేరుశనగ, రైస్‌బ్రాన్, కుసుమ నూనె ధరలను కూడా ఆయా ఉత్పత్తి సంస్థలు విపరీతంగా పెంచడం గమనార్హం.
కూర ‘గాయాలే’..!
కూరగాయల ధరల్లో ఈ ఏడాది సగటున 30 శాతం వృద్ధి కనిపించింది. అందరూ రోజూ కూరల్లో తప్పకుండా వినియోగించే టమాట, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, వెల్లుల్లి ధరలు కొంతకాలంగా ఆకాశాన్ని అంటుకున్నాయి. నెలరోజుల క్రితం వరకు ఉల్లిగడ్డ, టమాట ధరలు ఏకంగా కిలో రూ.వందకు చేరాయి. ప్రస్తుతం ఉల్లి రూ.60 వరకు ఉండగా, టమాట ధరలు కొంత తగ్గినట్టు కనిపించినా, ఇప్పటికీ మేలు రకం రూ.50కి తక్కువ లేదు. క్యారట్ కిలో ఏకంగా రూ.120 వరకు ఉండగా, బీట్‌రూట్ రూ.80, ముల్లంగి రూ. 72, చిక్కుడు రూ.100, వంకాయలు రకాన్ని బట్టి రూ. 70–90 వరకు విక్రయిస్తున్నారు.
క్యాప్సికమ్ రూ.90, బెండకాయ రూ.60, బీరకాయ రూ.70, బీన్స్ రూ.70, కాకర రూ.60, దోసకాయ రూ.60 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌లు, రైతుబజార్లలో కొంత మేర తక్కువకు విక్రయించినప్పటికీ, చిల్లర వ్యాపారుల వద్ద ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. ములక్కాడలు ఒక్కోటి రూ.20కి విక్రయిస్తుండగా, నిమ్మకాయలు కిలోకు రూ.120–140 వరకు ఉన్నాయి. ఆకుకూరల ధరలూ ఆకాశంవైపే చూస్తున్నాయి. కాగా, సబ్బులు, టూత్‌పేస్ట్, షాంపూలు, కాఫీ, టీ పౌడర్, సౌందర్య వస్తువుల ధరలు కూడా మూడు నెలలుగా పెరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment