సాక్షి, హైదరాబాద్: పరిశోధన.. ఇప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో నాణ్యత ప్రమాణాలతోపాటు పరిశోధనలకు ప్రాధాన్యం పెరిగింది. యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలన్నీ పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పరిశోధనల వైపే మొగ్గుచూపుతుండటంతో అన్ని రాష్ట్రాలు అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలోని విద్యాసంస్థలు పరిశోధనల్లో ఇంకా వెనుకబడే ఉన్నాయి. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) ప్రవేశాల్లో ప్రధాన రాష్ట్రాలన్నీ ముందుండగా, తెలంగాణ మాత్రం 12వ స్థానానికే పరిమితమైంది. అత్యధికంగా తమిళనాడులో 29,778 మంది విద్యార్థులు పీహెచ్‌డీలు చేస్తుండగా, తెలంగాణలో 4,884 మంది మాత్రమే పీహెచ్‌డీ విద్యార్థులు ఉన్నారు.
దేశవ్యాప్తంగా పెరుగుతున్నా..
గడిచిన ఆరేళ్లలో పరిస్థితిని పోల్చితే దేశవ్యాప్తంగా పీహెచ్‌డీ ప్రవేశాలు ఏటేటా పెరుగుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆశించిన మేర పీహెచ్‌డీ ప్రవేశాలు పెరగడం లేదు. ఉస్మానియా, కాకతీయ వంటి యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశాల విషయంలో గొడవలు సర్వసాధారణం అయ్యాయి. చివరకు తెలుగు యూనివర్సిటీలోనూ అదే పరిస్థితి నెలకొంది. రెండేళ్ల కిందటి విద్యా సంవత్సరాన్ని పేర్కొంటూ ఇటీవల పీహెచ్‌డీ ప్రవేశాలకు తెలుగు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మిగతా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు లేకపోయినా పీహెచ్‌డీ ప్రవేశాలు చేపట్టడం, ప్రొఫెసర్లు ఉన్న చోట వివాదాలతో పీహెచ్‌డీలకు ప్రవేశాలు జారీ చేయకపోవడం వంటి సమస్యలతో రాష్ట్రంలో పీహెచ్‌డీ ప్రవేశాలు గందరగోళంగా మారాయి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్లు దాదాపు 30 వేల మంది వరకు అవసరమున్నా, కేవలం 2 వేలలోపే ఉండటంతో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల అభ్యర్థులపై ఆధారపడాల్సి వస్తోంది. కాలేజీలకు అవసరాలు ఉండటంతో ఇతర రాష్ట్ర యూనివర్సిటీల నుంచి పీహెచ్‌డీలను కొనుక్కుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో జేఎన్‌టీయూహెచ్ కూడా నకిలీ పీహెచ్‌డీలను గుర్తించి, ఆ ఫ్యాకల్టీని బ్లాక్ లిస్టులో పెట్టింది.
పీజీలు చేస్తున్నా పీహెచ్‌డీలకు దూరం..
దేశవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో లక్షల మంది చేరుతున్నా అంతా పీహెచ్‌డీలు చేయడం లేదు. గడిచిన ఆరేళ్లలో పీహెచ్‌డీలు చేస్తున్న వారి సంఖ్య పెరిగినా ఆశించిన స్థాయిలో లేదన్నది విద్యావేత్తల అభి ప్రాయం. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో 72.65 లక్షల మంది చదువుతుండగా, అందులో పీహెచ్‌డీలు చేస్తున్న విద్యార్థుల సంఖ్య కేవలం 0.5 శాతమే. యూనివర్సిటీలు, కాలేజీలుసహా దేశవ్యాప్తంగా 1,61,412 మంది విద్యార్థులు పీహెచ్‌డీలు చేస్తున్నారు. యూనివర్సిటీలు మినహా పీహెచ్‌డీ కోర్సులను నిర్వహిస్తున్న కాలేజీలు దేశంలో 3.6 శాతమే ఉన్నట్లు కేంద్ర ఉన్నత విద్యాశాఖ అంచనా వేసింది.
పీహెచ్‌డీలు చేస్తున్న మొత్తం విద్యార్థుల్లో అత్యధికంగా 43,959 మంది (31.6 శాతం) రాష్ట్ర యూనివర్సిటీల్లో పీహెచ్‌డీలు చేస్తుండగా, జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో 28,383 మంది (20.4 శాతం) చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో 15.8 శాతం మంది, డీమ్డ్ యూనివర్సిటీల్లో 13.4 శాతం మంది పీహెచ్‌డీలు చేస్తున్నారు. మిగతా వారు ఇతర ప్రైవేటు యూనివర్సిటీలు, కాలేజీల్లో చేస్తున్నారు. మొత్తం పీహెచ్‌డీ ప్రవేశాల్లో 3,110 మంది ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలు చేస్తున్నారు. మరోవైపు పీహెచ్‌డీ చేస్తున్న వారిలో మహిళలకంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నట్లు కేంద్రం లెక్కలు తేల్చింది.
సైన్స్‌కోర్సుల్లోనేఎక్కువ మంది..
దేశంలో అత్యధికంగా సైన్స్ కోర్సుల్లోనే పీహెచ్‌డీలు చేస్తున్నారు. ఆ తరువాత స్థానం ఇంజనీరింగ్‌దే. సైన్స్ స్ట్రీమ్‌లో మొత్తంగా 41,844 మంది పీహెచ్‌డీలు చేస్తుండగా, ఇంజనీరింగ్‌లో 38,714 మంది చేస్తున్నారు. ఇందులోనూ మెకానికల్ ఇంజనీరింగ్‌లో 5,235 మంది, సివిల్ ఇంజ నీరింగ్‌లో 35,967 మంది పీహెచ్‌డీలు చేస్తున్నారు. సైన్స్‌లో పీహెచ్‌డీలు చేస్తున్న వారిలో 5,612 మంది (21.1%) అగ్రికల్చర్, అనుబంధ రంగాల్లో చేస్తున్నారు. ఇందులో 58.9% మంది పురుషులే ఉన్నారు. తమ పీజీ పూర్తయ్యాక ఇంజనీరింగ్‌లో 20.07 శాతం మంది పీహెచ్‌డీలలో చేరుతున్నారు. మెడికల్ సైన్స్‌లో 7,086 మంది, సోషల్ సైన్స్‌లో 18,366 మంది పీహెచ్‌డీలు చేస్తుండగా, కామర్స్‌లో 4,493 మంది పీహెచ్‌డీలలో చేరారు. భారతీయ భాషల్లో 7,850 మంది, విదేశీ భాష ల్లో 3,889 మంది పీహెచ్‌డీలు చేస్తుండగా ఒక్క ఇంగ్లిష్‌లోనే 3,110 మంది పీహెచ్‌డీలలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment