ముంబై/న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్(48)కు సంబంధించి ముంబై, లక్నోలో ఆరు చోట్ల ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ బుధవారం సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సోనూకు చెందిన కంపెనీకి, లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయని, అందుకే సోదాలు జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సోనూ భేటీ అయిన కొన్ని రోజులకే ఐటీ సోదాలు జరగడం గమనార్హం. ఢిల్లీలో పాఠశాల విద్యార్థుల కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రారంభించిన మార్గదర్శక (మెంటార్‌షిప్) కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సోనూ అంగీకరించారు. ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తనకు కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరే ఆలోచన లేదని సోనూ సూద్ స్పష్టతనిచ్చారు.
ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనను లక్ష్యంగా చేసుకుందని, అందుకే ఐటీ సోదాలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్య మార్గంలో నడుస్తున్నప్పుడు లెక్కలేనన్ని అవరోధాలు ఎదురవుతాయని, ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల ఆశీస్సులు సోనూ సూద్‌కు ఉన్నాయని తెలిపారు. కరోనా విపత్కర సమయంలో ఆయన దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆదుకున్నారని గుర్తుచేశారు. వారంతా ఆయన కోసం ప్రార్థిస్తున్నారని చెప్పారు. సోనూ సూద్‌కు సంబంధించి ఐటీ సోదాలు జరపడాన్ని శివసేన తప్పుపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment