హోమియోపై మరిన్ని పరిశోధనలు
అంటువ్యాధుల నివారణ కోసం భారత్, ఆస్ట్రేలియా సంస్థల ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం, అంటువ్యాధుల నివారణ కోసం హోమియో వైద్యంపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ (ఐఐహెచ్‌పీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (ఎన్‌ఐఐఎం) ఆస్ట్రేలియా సంస్థలు ఆదివారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. రామంతాపూర్ హోమియో కాలేజీలో జరిగిన సదస్సులో ఐఐహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఎ.రావు, ఆస్ట్రేలియా ఎన్‌ఐఐఎం తరఫున డాక్టర్ ఐజాక్ గోల్డెన్‌లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
హోమియో మందులను అంటువ్యాధుల నివారణలో మరింత మెరుగ్గా ఉపయోగించడానికి, మందుల ప్రభావాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని ఐఐహెచ్‌పీ అంటువ్యాధుల నివారణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.శ్రీనివాస్‌రావు తెలిపారు. రెండు దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మెదడువాపు వ్యాధిని సమూలంగా నిర్మూలించడంలో హోమియో వైద్యులు విజయం సాధించారన్నారు.