వివరాలు వెల్లడిస్తున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి, పక్కన డీసీపీ అఖిల్ మహాజన్ తదితరులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఆధారాలు దొరకకుండా హత్య చేసేందుకే మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్(గుడిపల్లి) ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురిని బలిగొన్నారని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు పేర్కొన్నారు. ఆరుగురు సజీవ దహనం కేసు వివరాలను మంగళవారం డీసీపీ అఖిల్ మహాజన్.. ఏసీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్‌తో కలసి వెల్లడించారు.
ఈ ఘటనలో ఐదు గురిపై హత్య, కుట్ర, ఒకరిపై అదనంగా అట్రాసిటీ కేసు పెట్టామన్నారు. బాధితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంకింద పరిహారం అందేలా చూస్తా మని తెలిపారు. మూడురోజులు 16 బృందాలు ద ర్యాప్తు చేసి క్షుణ్ణంగా పరిశీలించాయన్నారు. ఏ1గా మేడి లక్ష్మణ్, ఏ2 శనిగరపు సృజన, ఏ3 శ్రీరాముల రమేశ్, ఏ4గా వేల్పుల సమ్మయ్య, ఏ5గా ఆర్నకొండ అంజయ్య ఉన్నారని తెలిపారు.
ఏళ్లుగా దంపతుల మధ్య గొడవలు..
మందమర్రి మండలం వెంకటాపూర్ పరిధి గుడిపల్లికి చెందిన మాసు శివయ్య(48) రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ(42) దంపతులు. శ్రీరాంపూర్‌కు చెందిన సింగరేణి మైనింగ్ సర్దార్ శనిగరపు శాంతయ్య(57) భార్య సృజనతో గొడవల కారణంగా శివయ్య–రాజ్యలక్ష్మితో ఉంటున్నాడు. ఇరువురు పంచాయతీలు, కేసులు పెట్టుకున్నారు. మెయింటెనెన్సు, జీతభత్యం వేరెవరికీ ఇవ్వకుండా కేసులు ఉన్నాయి.
అయినా జీతం డబ్బులు, ఆస్తులు రాజ్యలక్ష్మికే ఇస్తున్నాడని భావించిన శాంతయ్య భార్య సృజన.. భర్తను హత్య చేయాలనుకుంది. తండ్రితో కలసి తనకు సన్నిహితుడైన లక్షెట్టిపేటవాసి మేడి లక్ష్మణ్(42)సాయం కోరింది. దీనికోసం 3 గుంటల భూమి రాసిస్తానని చెప్పింది. అలాగే, రెండు దఫాల్లో రూ.4 లక్షలు ఇచ్చింది. రంగంలోకి దిగిన లక్ష్మణ్.. శాంతయ్యను చంపేందుకు రూ.4లక్షలు ఇస్తానంటూ లక్షెట్టిపేటవాసి శ్రీరాముల రమేశ్ (36) సాయం కోరాడు.
రోడ్డు ప్రమాదం చేసేందుకు రూ.1.40 లక్షలతో పాత బొలెరోను కొన్నా రు. నెల క్రితం మంచిర్యాల నుంచి శాంతయ్య, రాజ్యలక్ష్మి వెళ్తున్న ఆటోను బొలెరోతో ఢీకొట్టి చంపుదామనుకుని విఫలమయ్యారు. ఇలా రెండుసార్లు విఫలం కావడంతో ఈనెల 16న ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న లక్ష్మణ్, రమేశ్ మంచిర్యాలకు బస్సులో వెళ్లారు. శివయ్య, రాజ్యలక్ష్మి, శాంతయ్య ముగ్గురే ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు రమేశ్, సమ్మయ్య ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పుపెట్టారు.
నిద్రిస్తున్న వారిలో రాజ్యలక్ష్మి అక్క కూతురు మౌనిక(24), కూతుళ్లు ప్రశాంతి(3), హిమబిందు (13నెలలు) ఉన్నట్లు వాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో ఒకరి కోసం ప్లాన్ వేస్తే ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. నిందితులను మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడంతో వివరాలు బయటపడ్డాయి. నిందితుల్ని బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment