దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి!
- సహకరిస్తాం.. పెట్టుబడులతో రండి
- ప్రవాస భారతీయులకు సుష్మాస్వరాజ్ పిలుపు
గాంధీనగర్: ప్రధాని నరేంద్రమోదీ కలలు కంటున్న నవ భారతావని నిర్మాణానికి సహకరించాల్సిందిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘భారత్‌లో తయారీ(మేక్ ఇన్ ఇండియా)’, ‘స్వచ్ఛభారత్’ తదితర కార్యక్రమాలకు పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు.
గాంధీనగర్ బుధవారం మొదలైన 13వ ‘ప్రవాసీ భారతీయ దివస్(పీబీడీ)’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం సుష్మా పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం, వ్యాపార వాణిజ్యాలు నిర్వహించడం సులభతరం అయ్యేందుకు అవసరమైన చర్యలను తమ ప్రభుత్వం తీసుకుంటోందని వివరించారు. ‘రానున్న ఏళ్లలో మనకు విదేశీ పెట్టుబడుల అవసరం చాలా ఉంటుంది. వివిధ రంగాల్లో, ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టి యువ ప్రవాస భారతీయులు దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అన్నారు.
పారదర్శకత విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి హామీ ఇచ్చారు. శాస్త్రీయ, సాంకేతికపరమైన ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని, దేశాభివృద్ధిలో పాలు పంచుకునేందుకు భారత్‌కు తిరిగివచ్చే విషయంపై ఆలోచించమని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు జరుపుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ అభ్యర్థించారు.
స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్) రంగాల్లో వెలుగులోకి వచ్చిన శాస్త్రవేత్తల్లో 80% మంది భారత్‌లోని బెంగళూరు, హైదరాబాద్, విజయవాడు, పూణె, చెన్నైలనుంచే వచ్చారని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో రూపొందిన ఒక పరిశోధనా పత్రం వెల్లడించిందని తెలిపారు. అహింసే ఆయుధంగా, భారతీయులందరినీ ఒక్కటి చేసి, బలమైన బ్రిటిష్‌వారిని ఎదుర్కొన్న గాంధీజీ అత్యంత వ్యూహాత్మక రాజకీయ నేత అని విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకేసింగ్ వ్యాఖ్యానించారు.
కాగా గుజరాత్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సర్దార్ పటేల్ విగ్రహం ‘ఐక్యతా శిల్పం’ కోసం అమెరికాకు చెందిన ప్రవాస భారత వైద్యుడు ఇంద్రజిత్ జే పటేల్ నిధుల సేకరణ చేపట్టారు. ప్రధాని మోదీ చిత్రం ఉన్న వెండి నాణేలను అమ్మి 2.5 లక్షల డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రవాస భారతీయ దివస్ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం పంపించిన ఆహ్వానాన్ని మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ తిరస్కరించారు.