How in India
-
ఇలా అయితే మేక్ ఇన్ ఇండియా అసాధ్యం
{పభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే అభివృద్ధిలో వెనుకబాటే తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం హెచ్‌సీఎల్ ఉద్యోగులకు సంఘీభావం కవాడిగూడ: ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ మరోవైపు కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అని పిలుపునివ్వడం ఎంతవరకు సబబని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడిన ప్రభుత్వ రంగసంస్థలను పటిష్టం చేస్తేనే ప్రభుత్వం ఆశించిన మేక్ ఇన్ ఇండియా సాధ్యమవుతుందని ఆయన అన్నారు. హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) కంపెనీని మూతవేయాలనే కుట్రలకు నిరసనగా హెచ్‌సీఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మంగళవారం మహాధర్నా జరిగింది. కార్యక్రమానికి కోదండరాం, ఎమ్మెల్యేలు రవీంద్రనాయక్ (సీపీఐ), సున్నం రాజయ్య (సీపీఎం), బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, సీఐటీయూ నాయకులు సాయిబాబా, ఏఐటీయూసీ నాయకులు వీఎస్ బోస్‌లు హాజరై హెచ్‌సీఎల్ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. కోదండరాం మాట్లాడుతూ దేశంలో పెట్టుబడులు లేనప్పుడు ప్రభుత్వరంగ సంస్థల ద్వారానే పారిశ్రామిక అభివృద్ధి జరిగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రాజకీయజోక్యం అధికమవడం వల్లే ఎక్కువ శాతం ప్రభుత్వ కంపెనీలు మూతపడ్డాయని వివరించారు. ప్రభుత్వ కంపెనీలు మూతపడిన కారణంగా కేవలం హైదరాబాద్ నగరంలోనే సుమారు 25 వేల మంది ఉద్యోగులను తొలగించారని తెలిపారు. హెచ్‌సీఎల్ కంపెనీని ఓఎఫ్‌బీ (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు) తీసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు తీసుకుంటున్న అడ్డుగోలు నిర్ణయాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు కనుమరుగువుతున్నాయని పేర్కొన్నారు. ప్రయివేటు కేబుల్ పరిశ్రమలకు అనుమతిచ్చి హెచ్సీఎల్ను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా డిఫెన్స్ అసోసియేషన్ నాయకులు చంద్రయ్య, ఇసీఐఎల్, మిథానీ, బీఇఎల్, బీహెచ్ఇఎల్ తదితర కార్మిక సంఘాల నేతలతో పాటు హెచ్‌సీఎల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జె.సుబ్బారావు, ఉపాధ్యక్షులు శరత్‌బాబు, బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.దామోదరరెడ్డి, సహాయ కార్యదర్శులు పాపయ్య, లక్ష్మీనారాయణ, పద్మారావు, సాంబశివారెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి!
సహకరిస్తాం.. పెట్టుబడులతో రండి ప్రవాస భారతీయులకు సుష్మాస్వరాజ్ పిలుపు గాంధీనగర్: ప్రధాని నరేంద్రమోదీ కలలు కంటున్న నవ భారతావని నిర్మాణానికి సహకరించాల్సిందిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘భారత్‌లో తయారీ(మేక్ ఇన్ ఇండియా)’, ‘స్వచ్ఛభారత్’ తదితర కార్యక్రమాలకు పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. గాంధీనగర్ బుధవారం మొదలైన 13వ ‘ప్రవాసీ భారతీయ దివస్(పీబీడీ)’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం సుష్మా పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం, వ్యాపార వాణిజ్యాలు నిర్వహించడం సులభతరం అయ్యేందుకు అవసరమైన చర్యలను తమ ప్రభుత్వం తీసుకుంటోందని వివరించారు. ‘రానున్న ఏళ్లలో మనకు విదేశీ పెట్టుబడుల అవసరం చాలా ఉంటుంది. వివిధ రంగాల్లో, ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టి యువ ప్రవాస భారతీయులు దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అన్నారు. పారదర్శకత విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి హామీ ఇచ్చారు. శాస్త్రీయ, సాంకేతికపరమైన ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని, దేశాభివృద్ధిలో పాలు పంచుకునేందుకు భారత్‌కు తిరిగివచ్చే విషయంపై ఆలోచించమని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు జరుపుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ అభ్యర్థించారు. స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్) రంగాల్లో వెలుగులోకి వచ్చిన శాస్త్రవేత్తల్లో 80% మంది భారత్‌లోని బెంగళూరు, హైదరాబాద్, విజయవాడు, పూణె, చెన్నైలనుంచే వచ్చారని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో రూపొందిన ఒక పరిశోధనా పత్రం వెల్లడించిందని తెలిపారు. అహింసే ఆయుధంగా, భారతీయులందరినీ ఒక్కటి చేసి, బలమైన బ్రిటిష్‌వారిని ఎదుర్కొన్న గాంధీజీ అత్యంత వ్యూహాత్మక రాజకీయ నేత అని విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకేసింగ్ వ్యాఖ్యానించారు. కాగా గుజరాత్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సర్దార్ పటేల్ విగ్రహం ‘ఐక్యతా శిల్పం’ కోసం అమెరికాకు చెందిన ప్రవాస భారత వైద్యుడు ఇంద్రజిత్ జే పటేల్ నిధుల సేకరణ చేపట్టారు. ప్రధాని మోదీ చిత్రం ఉన్న వెండి నాణేలను అమ్మి 2.5 లక్షల డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రవాస భారతీయ దివస్ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం పంపించిన ఆహ్వానాన్ని మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ తిరస్కరించారు.