సాక్షి, మంచిర్యాల/ఆదిలాబాద్ అగ్రికల్చర్ : బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో వేమనపల్లి మండలంలో సుమారు 700 ఎకరాల్లో పత్తి పంట నీట మునగగా, 50 ఎకరాల్లో సోయాబీన్ నీటిపాలైంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాణాహిత నిండుగా ప్రవహిస్తోంది. నీటి ఉధృతి పెరుగుతుండటంతో పంటలు నీట మునిగాయి. నీల్వాయి ఉప్పొంగడంతో సుమారు 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయాయి.
ముల్కలపేట నుంచి రాచర్లకు వెళ్లే ప్రధాన రహదారి, వంతెన నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. వేమనపల్లి నుంచి సుంపుటంకు వెళ్లే ప్రధాన రహదారి మత్తడివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచాయి. వేమనపల్లి మండలంలో శనివారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచింది. బెల్లంపల్లి పట్టణంలోని అశోక్‌నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి సగం వరకు వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచాయి. తాండూర్ మండలం చౌటపల్లి, తాండూర్, కొత్తపల్లి గ్రామాలలో సుమారు 80 ఎకరాల వరకు పత్తి పంట నీట మునిగింది. నెన్నెల మండలంలోని కొత్తూర్‌లో ఏడు ఇళ్లు భారీ వర్షానికి కూలిపోయాయి.
మెట్‌పల్లిలోని చెరువుకు భారీ వర్షం వల్ల గండి పడింది. కాసిపేట మండలంలోని పెద్దనపల్లి, చింతగూడ, గుర్వాపూర్ వాగులు భారీ వర్షం వల్ల ఉప్పొంగాయి. శ్రీరాంపూర్, గోలేటి, కైరిగూడ, డోర్లి ఓపెన్‌కాస్ట్‌లో భారీగా వరద నీరు చేరుకోవడంతో దాదపు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘతం కలిగింది. సూమారుగా రూ.3.50 కోట్ల నష్టం వాటిల్లింది. తిర్యాణి మండలం ఇర్కపల్లి సర్పంచ్‌గూడ గ్రామానికి చెందిన మడావి హన్మంతరావు(35) ఆదివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని వాగుదాటుతూ వరద ఉదృతికి వాగులో కొట్టుకు పోయాడు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా సర్వం జలమయం అయ్యాయి. జైనథ్, నిరాల వద్ద రహదారిపై నుంచి వరదనీరు ఉప్పొంగడంతో అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచాయి. జైనథ్, బేల మండలాలతోపాటు మహారాష్ట్రకు రాకపోకలు స్తంభించాయి. బేల మండలం డోప్టాల మణియార్‌పూర్, గూడ, సాంగిడి, బెదోడ గ్రామాల్లో చేలల్లోకి నీరు చేరింది. ఆదిలాబాద్ మండలంలో అనుకుంట వాగు ఉప్పొంగడంతో సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. చేలలో భారీగా నీళ్లు చేరాయి. బేల మండలంలో వాగులు పొంగి ప్రవహించడంతో మహారాష్ట్రకు రాకపోకలు స్తంభించాయి.
సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్ పట్టణంలో గల ఆదర్శనగర్, సంఘంబస్తీ, సంజీవయ్యకాలనీల్లో పలువురి ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగజ్‌నగర్ మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెద్దవాగు వద్ద సోమవారం నిర్వహించబోయే గణేష్ నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లు నీటికి కొట్టుకుపోయాయి. దహెగాం మండలంలోని ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వేల ఎకరాల్లో పత్తి, సోయాబిన్ పంటలు నీటమునిగాయి. బ్రాహ్మణ్‌చిచ్యాలలో ఉపాధిహామీ పథకం క్రింద నిర్మించిన రెండు కుంటలు తెగిపోయాయి.
ఐనం రోడ్డుపై పెద్ద చెట్టు విరిగిపడడంతో రాకపోకలకు స్తంభించాయి. చెట్టుదాటికి ఫీడర్ పాడవగా 12 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. బెజ్జూర్ మండలంలోని నాగుల్వాయి, కుశ్నపల్లి కుకుడ, అగర్‌గూడ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీటి ప్రభావంతో సుమారు 2 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. లోడ్‌పల్లి, బెజ్జూర్, బారెగూడ రహదారులు కోతకు గురయ్యాయి.
భైంసా నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో భారీ వర్షంతో పత్తి, సోయా పంటల్లో నీరు నిలిచింది. భైంసాలో 72.4 మిల్లిమీటర్లు, కుంటాలలో 76.4, కుభీర్‌లో 71.3 మిల్లిమీటర్లు, లోకేశ్వరం 87.2 మిల్లిమీటర్లు నమోదైంది.
చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 48 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో చెన్నూర్ మండలంలోని సుద్దాల, కత్తరశాల, నారాయణపూర్, సంకారం గ్రామాల వాగులు ఉప్పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చెన్నూర్‌లోని బతుకమ్మ వాగు ఉప్పొంగడంతో వంతెన ముందు నిర్మించిన సపోర్ట్ రోడ్డు కోతకు గురైంది. ఈ రోడ్డు తెగిపోయినట్లయితే కోటపల్లి, వేమనపల్లి రెండు మండలాలకు రాకపోకలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది.
జైపూర్ మండలంలో మిట్టపల్లి వాగు ఉప్పొంగడంతో వంతెన కోతకు గురైంది. మందమర్రి పట్టణంలో రెండు ఇల్లు కూలాయి. వరి పంట నీట మునిగింది. మండలంలోని తుర్కపల్లి, మామిడిగట్టు, అదిల్‌పేట్ లో లేవల్ కాజ్‌వేలు ఉధృతంగా ప్రవహించడంతో ఆయా గ్రామాలకు ప్రజలుకు రవాణా సౌకర్యం స్తంంభించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోటపల్లి మండలం పంగిడి సోమారం, తున్‌తుంగ వాగులు ఉప్పొంగాయి. దీంతో 4 గ్రామాలకు రాక పోకలు నిలిచాయి.
అధిక వర్షాలతో పంటలకు తెగుళ్లు
ప్రస్తుతం పంటలు పత్తి, సోయాబీన్ పూత దశలో ఉన్నయి. ఈ భారీ వర్షాలతో పూత రాలిపోయే ప్రమాదం ఉందని ఏరువాక కోర్డి నేటర్ శాస్త్రవేత్త రాజశేఖర్ తెలిపారు. వర్షాలతో పంటలకు తెగుళ్లు అశించే అవకాశం ఉంది. పూతలో నీరు నిల్వడం వలన పూత మురిగిపోయి రాలి పోయే అవకాశం ఉంది. పంట చేనులో నీరు నిల్వ ఉండ కుండా చూడాలి. మరో రెండు రోజులు వర్షం కోన సాగితే ఎండ, ఆకుమచ్చ తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది.
అయిన తక్కువనే..
జిల్లా సాధారణ వర్షపాతం ఆదివారం వరకు 889.2 మిల్లీమీటర్లు కాగా 606.9 మిల్లీమీటర్లు కురిసింది. 32 శాతం లోటు వర్షపాతంగా ఉంది. గతేడాది 1,245.8 మిల్లీమీటర్లు కురిసింది. 28 శాతం అధికంగా నమోదు అయ్యింది. శనివారం రాత్రి నుంచి అదివారం ఉదయం వరకు 106.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
జలమయం
Published Mon, Sep 8 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement
Advertisement