ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వరి నారు ముదిరిపోయింది.. సోయాబీన్ రబీలో వేసుకోవచ్చా.. ఎరువులు అందడం లేదు.. పత్తికి బీమా సౌకర్యం ఉందా.. యంత్రాలు ఎప్పుడు వస్తాయి అంటూ రైతులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు(జేడీఏ) రోజ్‌లీల, శాస్త్రవేత్తలు సమాధానాలు ఇచ్చారు. గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన లభించింది.
జిల్లా నలుమూలల నుంచి 30 మందికి పైగా ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సాగులో ఎదుర్కొంటున్న సమస్యలు, చీడపీడల నివారణ, గడువు దాటిన వరి నారు నాట్లు వేసుకునే అవకాశం ఉందా.. ఉంటే ఆశించిన దిగుబడి వస్తుందా..? ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి అని అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలో ఎరువులు వేసుకుంటే లాభం ఉంటుందా అని అడిగిన ప్రశ్నలకు జేడీఏ, శాస్త్రవేత్తలు, ఏరువాక కో ఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్ సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు రమేష్, అలీ అహ్మద్ పాల్గొన్నారు.
ప్రశ్న : పసుపు పంటలో ముడత పడుతుంది(కొమ్ముకుంది) ఏ మందులు వేసుకోవాలి. - రైతు భూమేష్ , లక్ష్మణచాంద, నిర్మల్
జవాబు : రెండు గ్రాములు ప్లాంటోమెసిన్ 10 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి.
ప్ర : వరి నారు అలికి 45 రోజులు అవుతుంది. నాట్లు వేసుకునే అవకాశం ఉందా..? ఉంటే ఆశించిన దిగుబడి వస్తుందా..? ఏ ఎరువులు వేసుకోవాలి. - రైతు లక్ష్మణ్, ఖానాపూర్
జ : వరి నారు కొసలు కత్తిరించి ఒకటి రెండు మొలకలు నాటుకునే బదులు ఐదారు మొలకలు నాటుకోవాలి. అధికంగా ఎరువులు వేసుకోవాలి. ముఖ్యంగా యూరియా, పొటాష్ ఎకరాకు 30 నుంచి 40 కిలోల వరకు వేసుకోవాలి. గడువు దాటినా వరి నారు ఎక్కువ మోతాదులో, ఎరువులు ఎక్కువగా వేసుకుంటేనే దిగుబడి వస్తుంది.
ప్ర : పత్తి పంట బీమా చేసుకునే అవకాశం ఉందా..? ఉంటే ఎప్పటి లోగా చెల్లించాలి. యూరియా ఎరువులు అందడం లేదు. వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తే అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నరు.
- యం. నరేందర్, గ్రామం : బన్సవల్‌పల్లి, మం : దిలావర్‌పూర్
జ : పత్తికి నేరుగా బీమా చెల్లించే గడువు దాటిపోయింది. బ్యాంకులో కొత్త రుణం పొందే సమయంలోనే వారు బీమా ప్రీమియం మినహాయించుకుని మిగితా మొత్తం చెల్లిస్తారు. బ్యాంకు ద్వారా చెల్లించే గడువు సెప్టెంబర్ 30వరకు ఉంది. యూరియా లోడు ఈ రోజు మండలానికి పంపించాం. యూరియా కొరత లేదు. డీలర్ గానీ సొసైటీ వారు అధికంగా డబ్బులు తీసుకుంటనే వెంటనే సమాచారం అందించాలి. వారిపై చర్యలు తీసుకుంటాం. యూరియా బ్యాగుకు రూ.284 కంటే ఎక్కువగా చెల్లించొద్దు. డబ్బులు చెల్లించి రశీదు తీసుకోవాలి.
ప్ర : వరి నారు అలికి 60 రోజులు అవుతుంది. నాట్లు వేసుకోవచ్చా. - రైతు గంగయ్య, తాండుర్
జ : వరి నారు 25 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో నాట్లు వేసుకుంటనే మంచి దిగుబడి వస్తుంది. చీడపీడలు ఎక్కువగా ఆశించవు. 60 రోజుల నారు చాలా వరకు ముదిరిపోయింది. నాట్లు వేసుకోకపోవడం మేలు.
ప్ర : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు యూరియా వేసుకున్న. రాత్రి వర్షం కురిసింది. పంటకు మేలు అవుతుందా.. ఎరువు వృథాగా పోతుందా..? మళ్లీ ఎరువు వేసుకోవాలా..? - రైతు హన్మండ్ల వేణు, క్రిష్ణాపూర్
జ : వర్షం కురిసిన వెంటనే ఎరువులు వేసుకోరాదు. వేసుకున్న కొద్ది గంటలకు వర్షం పడింది కాబట్టి ఎక్కువగా వృథా కాదు. పది శాతం నుంచి 20 శాతం మాత్రం పోతుంది. వర్షం పడి నీరు పారుతున్న సమయంలో ఎరువులు వేసుకోరాదు. కొద్దిగా బురద, భూమిలో తేమ ఉంటే సరిపోతుంది.
ప్ర : సోయాబీన్, పత్తి పంటలకు బీమా చేసుకునే అవకాశం ఉందా.. గడువు ఎప్పటి వరకు ఉంది ? - రైతు శ్రీనివాస్, గ్రామం : రాయిపూర్, మం : లోకేశ్వరం
జ : సోయాబీన్ పంటకు నేరుగా బీమా ప్రీమియం చెల్లింపు మూడు రోజులు మాత్రమే ఉంది. పత్తికి బ్యాంకు రుణం పొందే వారికి మాత్రమే అవకాశం ఉంది. రుణం పొందే సమయంలోనే వచ్చే నెల 30వరకు ప్రీమియం చెల్లింపునకు అవకాశం ఉంది.
ప్ర : సోయా పంటలో ఆకులకు రంధ్రాలు పడుతున్నాయి. చిన్న పురుగు కనిపిస్తుంది. - మారుతి, కుభీర్
జ : క్లోరికొపాస్ 2ఎంఎల్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయండి.
ప్ర : సోయా పంట 35 రోజుల్లోనే పూతకు వచ్చింది. పూత రాలిపొతుంది. - సంతోష్‌కూమార్, కుంటాల
జ : క్లొరికల్ లేదా రిమాన్ 1 మిల్లీలీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
ప్ర : మందు పిచికారీ డబ్బ పక్క రైతుది. అతను కలుపు నివారణ మందు పిచికారీ చేసి నాకు ఇచ్చిండు. అదే డబ్బాలో పత్తికి పురుగుల నివారణ మందు పిచికారీ చేశాను. ఆకులు ముడుత పడుతున్నాయి. - రవి, బజార్‌హత్నూర్
జ : మల్టీకే స్ప్రే చేయండి. పిచికారీ చేసిన రెండు రోజుల్లోపు అయితే చక్కెర, యూరియా కలిపి కరిగించి పిచికారీ చేయాలి.
ప్ర : పత్తికి పిండి నల్లి ఉంది. - దీపక్, కుచ్‌లాపూర్
జ : కొమ్మలు చుంచి దూరంగా పడేయండి. లేదా ప్రొఫెనోపాస్ 3మిల్లీలీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసుకోండి.
ప్ర : వ్యవసాయ యంత్రాలు ఎప్పుడు వస్తాయి. రాయితీ ఎంత వరకు ఉంటుంది. - శ్రీకాంత్‌రెడ్డి, మామడ
జ : వ్యవసాయ యంత్రాల కంపెనీలతో ధర నిర్ణయం కాలేదు. యంత్రాలకు సంబంధించిన రాయితీ, దరఖాస్తు విధానంపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. రెండు రోజుల్లో కమిషనర్ సమావేశం అనంతరం విషయాలు తెలుస్తాయి. వివరాలు రాగానే ఏవోల ద్వారా తెలుపుతాం.
వరి నారు ముదిరింది..
Published Fri, Aug 29 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement
Advertisement