పత్తిలో బోరాన్ లోపం
పర్చూరు : పత్తి పంటలో బోరాన్ లోపం ఎక్కువగా ఉందని ఒంగోలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జీ రమేష్ తెలిపారు. పర్చూరు మండలంలోని నూతలపాడు, పర్చూరు, నాగులపాలెం, బోడవాడ, ఉప్పుటూరు గ్రామాల్లో పత్తి, పొగాకు, మిరప పంటలను ఆయన బుధవారం పరిశీలించారు. పంటలను ఆశించిన తెగుళ్లను ఎలా నివారించుకోవాలో శాస్త్రవేత్త రమేష్ రైతులకు వివరించారు.
‘పత్తిలో బోరాన్ లోపాన్ని అధిగమించేందుకు బోరాక్స్ లేదా ఫార్ములా 4 మందును 1.5 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చే యాలి. రసం పీల్చే పురుగులు ఉధృతంగా ఉన్నాయి. వాటి నివారణకు అక్తరా లేదాప్త్రెడ్ 100 మి.లీ మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. మిరపలో ఆకుమచ్చ తెగులు, తెల్లదోమ ఎక్కువగా ఉంది. ఆకు మచ్చతెగులు నివారణకు స్కోర్ 100 మి.లీ లేదా సాఫ్ పావు కిలో మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చే సుకోవాలి. తెల్లదోమ నివారణకు ట్త్రెజోఫాస్ పావు లీటరు+నువాన్ 200 మి.లీ మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి.
మిరపలో పైముడత నివారణకు ఇమిడా ఒక మి.లీ మందును లీటరు నీటికి, కింది ముడత నివారణకు ఓమైట్ 2 మి.లీ మందును లీటరు నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. మినుములో పల్లాకు తెగులు సోకిన మొక్కలను తొలగించాలి. పల్లాకు తెగులు ఉధృతంగా ఉంటే ట్త్రెజోఫాస్ లేదా నువాన్‌ను అధికారుల సూచన మేరకు పిచికారీ చేయాలి.
పొగాకులో లద్దెపురుగు నివారణకు లార్విన్ లేదా రీమాన్ పావు లీటరు మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. పంటల పరిశీలనలో ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ వరప్రసాద్, పర్చూరు ఏడీఏ కే కన్నయ్య, ఏఓ గౌతమ్ ప్రసన్న, టెక్నికల్ ఏఓ సుమతి పాల్గొన్నారు.