మార్కాపురం : జిల్లాలో పత్తి పంట(వేసవి పత్తి+ఖరీఫ్ పత్తి) 77 వేల హెక్టార్లలో సాగవుతోంది. వేసవిలో సాగు చేసిన పత్తి దిగుబడి ప్రారంభమైంది. అయితే కొన్ని ప్రాంతాల్లోని పత్తి ఆకులు కుంకుమ రంగులోకి మారి పొలం మొత్తం ఎర్రగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని మార్కాపురం వ్యవసాయాధికారి డీ బాలాజీనాయక్ దృష్టికి తీసుకెళ్లగా మెగ్నీషియం, జింక్ లోపం వల్లే ఆకులు ఎర్రగా కనిపిస్తున్నాయని వివరించారు. సూక్ష్మ ధాతు లోపాలను నివారించుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చని తెలిపారు.
‘పత్తి పంట 90 నుంచి 120 రోజుల దశల్లో ఉంది. వర్షపాతం ఎక్కువైనా, వర్షం లేకపోయినా పత్తిలో ఈ లోపం కనిపిస్తుంది. ఆకులు కుంకుమ రంగులోకి మారి పత్ర హరితాన్ని కోల్పోతాయి. ఎరుపుగా మారిన ఆకు పచ్చగా మారి రాలిపోతుంది. పక్వానికి రాని కాయలు పగలడం, మొక్క ఎత్తు పెరగకపోవడం, ఉన్న పత్తి బరువు తగ్గిపోవటం జరుగుతుంది. పూత, పిందె రాలిపోతాయి.
దీని వల్ల పంట దిగుబడి 60 నుంచి 80 శాతం తగ్గిపోతుంది. మోతాదుకు మించి నత్రజని, భాస్వరం, పొటాష్ వాడటం, సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల జింక్, మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. జింక్ లోపం ఉంటే ఆకుల మధ్య భాగం పసుపు పచ్చగా మారి పత్రహరితాన్ని కోల్పోతాయి. మొక్క ఆహారం తయారు చేసుకునే శక్తి కోల్పోతుంది. కొమ్మలు రాలిపోయి తక్కువ పూత వస్తుంది. పిందె పెరుగుదల ఉండదు. నివారణకు ఎకరాకు 20 కిలోల మెగీషియం సల్ఫేట్ భూమిలోగానీ లేదా పైపాటుగా ఎకరాకు 2 కిలోల మెగ్నీషియం సల్ఫేట్, ఈడీటీఏ 12 శాతం జింక్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. దీంతో కొత్తగా వచ్చే ఆకుల్లో మెగ్నీషియం లోపం ఉండదు’.
పత్తిలో మెగ్నీషియం, జింక్ లోపం
Published Tue, Nov 18 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement
Advertisement