ఒంగోలు టూటౌన్ : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అరకొరగా కురిసిన వర్షాలు అన్నదాతను నిరాశకు గురిచేశాయి. జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వేసిన పంటలు చేతికందకుండా పోయాయి. మొత్తం మీద ఖరీఫ్.. కష్టాలను మిగిల్చడంతో రైతులు రబీపైనే ఆశలు పెట్టుకున్నారు. వర్షాలు కురవని కారణంగా జిల్లాలో కంది, పత్తి పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది.
ఈ నేపథ్యంలో కంది, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా మాఘీజొన్నను సాగు చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ‘మాఘీ జొన్న నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అంతేగాకుండా మార్కెట్‌లో ఈ పంటకు మంచి ధర కూడా ఉంటోంది. పశుగ్రాసం కొరత కూడా ఉండద’నిఒంగోలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జీ రమేష్ పేర్కొన్నారు. మాఘీ జొన్న సాగు చేసే విధానం, ఎరువుల యాజమాన్యం గురించి ఆయన ‘సాక్షి’కి వివరించారు.
విత్తన రకాలు..
సీఎస్‌వీ-1 : గింజలు తెల్లగా ఉంటాయి. చొప్ప పశువులు తినేందుకు అనుకూలంగా ఉంటుంది.
ఎన్-35-1 : నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. ఈ రకం బెట్టను తట్టుకుంటుంది.
ఎన్‌టీజే-1 : 95-110 రోజుల్లో పంట కోతకు వస్తుంది.
సీఎస్‌వీ-216వీ : ఎక్కువ గింజలు, నాణ్యమైన చొప్ప దిగుబడినిచ్చే రకం. గింజలు ముత్యాల మాదిరిగా ఉంటాయి.
ఎన్‌టీజే-2647 : ఇది తెలుపు గింజ రకం. 90-100 రోజుల పంట కాలం. ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వ స్తుంది.
యాజమాన్య పద్ధతులు
సాధారణంగా జొన్నను లోతైన నల్లరేగడి భూముల్లో సాగు చేస్తారు. ఈ నేలల్లో పోషాకాలు నిల్వ చేసుకునే శక్తి అధికంగా ఉంటుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండో వారంలోపు విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తుకుంటే పంట చివరి దశలో బెట్టకు వ స్తుంది. దానివల్ల దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.
విత్తన మోతాదు : ఎకరాకు 3-4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఎకరాకు 72,000 మొక్కలు ఉండేలా విత్తుకోవాలి. అంటే వరసల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 15 సెం.మీ దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తే ముందు ఒక కిలో విత్తనాలను 2-5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్‌తో శుద్ధి చేస్తే మొవ్వను చంపే ఈగ బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు.
ఎరువుల యాజమాన్యం
ఎకరాకు 50 కిలోల డీఏపీ, 20 కిలోల యూరియా, 25 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తిన 42 గంటల్లోపు ఎకరాకు 400 గ్రాముల అట్రాజిన్ పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. ఇలా చేస్తే 35 రోజుల వరకు కలుపు సమస్య ఉండదు.
ఎకరాకు రూ.20 వేల వరకు ఆదాయం
పంట రకాలను బట్టి ఎకరాకు 25-35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటా రూ.1,500 నుంచి రూ.1,700 వరకు రేటు పలుకుతోంది. అంటే సాగు ఖర్చు, కౌలు ఖర్చు పోను ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం పొందవచ్చు.
నీటి ఎద్దడిని తట్టుకునే మాఘీ జొన్న
Published Thu, Sep 11 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement
Advertisement