సగానికే పరిమితమైన సోయా సాగు
12.39 లక్షల ఎకరాల లక్ష్యంలో 6.86 లక్షల ఎకరాల్లోనే సాగు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం పిలుపునిచ్చిన విధంగా ఈ సారి రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ అందుకు ప్రత్యామ్నాయంగా సోయాబీన్ సాగు వైపు వెళ్లాలని చేసిన సూచనలను రైతులు పట్టించుకోలేదు. పత్తి సాగు విస్తీర్ణం ఈసారి 26.28 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇప్పటివరకు 25.49 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అంటే ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు స్పందించినట్లు అర్థమవుతోంది. ఇక ఈ ఖరీఫ్‌లో 12.39 లక్షల ఎకరాల్లో సోయాను పండించాలని వ్యవసాయశాఖ రైతులకు సూచించింది.
కానీ తాజా నివేదిక ప్రకారం సోయా సాగు విస్తీర్ణం 6.86 లక్షల ఎకరాలకే పరిమితమైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వ లక్ష్యంలో సోయా సాగు సుమారు సగానికే పరిమితమైంది. మరోవైపు ఈ ఏడాది 17.46 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలను సాగు చేయాలని సర్కారు నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కేవలం 11.78 లక్షల ఎకరాల్లోనే పప్పుధాన్యాల సాగు జరిగిందని నివేదిక తెలిపింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.35 ల క్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 2.59 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. మొత్తంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.07 కోట్ల ఎకరాలు కాగా... ఇప్పటివరకు 59.40 లక్షల (55%) ఎకరాల్లోనే సాగయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా 85% పంటలు సాగయ్యా యి. అత్యంత తక్కువగా కరీంనగర్ జిల్లాలో 34% విస్తీర్ణంలోనే పంటలు వేశారు.
మూడు జిల్లాల్లో అధిక వర్షపాతం...
రాష్ట్రంలో ఈ సీజన్‌లో 16 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా... మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో 52 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 44 శాతం అధిక వర్షపాతం నమోదైంది.