నారు.. కన్నీరు..
నారు.. కన్నీరు..
Published Sat, Jul 1 2017 11:22 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
- నీరివ్వడంలో జాప్యం
- ఆలస్యమైన నారుమళ్లు
- ఇప్పుడు వర్షాలతో శివారున నీట మునక
- రోజుల తరబడి ముంపులోనే..
- పంట విరామానికి సిద్ధమవుతున్న రైతులు
అమలాపురం / అల్లవరం (అమలాపురం) : అనుకున్నంతా అయ్యింది. ముందుగా సాగునీరు ఇస్తున్నామని.. కోట్ల రూపాయలతో ముంపునీరు దిగేందుకు ఆధునికీకరణ పనులు చేశామని ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రచారమంతా డొల్లేనని తేలిపోయింది. కొద్దిపాటి వర్షం పడిందో లేదో.. శివారు పొలాల్లో నారుమళ్లు నీట మునగడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. నారుమళ్ల నుంచి రోజుల తరబడి ముంపునీరు దిగకపోవడం చూసి కోనసీమ శివారు రైతుల గుండె చెరువవుతోంది. దీంతో మరోసారి ఖరీఫ్ పంట విరామానికి సిద్ధమవుతున్నారు.
గడచిన రెండు రోజులుగా కురిసిన వర్షాలకు అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలోని కాట్రేనికోన, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లో వరి నారుమళ్లు నీట మునిగాయి. అసలే ఇక్కడ సాగు ఆలస్యమైందని, కొద్దిమంది రైతులు మాత్రమే నారుమడులు వేశారు. అవి కూడా నీట మునగడం చూసి వారు దిగులు చెందుతున్నారు. ఈ ఐదు మండలాల్లో సుమారు 6 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో రెండు వేల ఎకరాల్లో నారుమడులు పడ్డాయని అంచనా. దీనిలో సగం నారుమళ్లు వర్షాలకు నీట మునిగాయి. ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన మండలాల్లోని నారుమళ్లు రోజుల తరబడి ముంపులోనే ఉన్నాయి. నారును కాపాడుకొనేందుకు రైతులు మోటార్లు, నత్తగుల్లలతో నీరు తోడుతున్నా.. మళ్లీ వర్షం కురవడం, ముంపు బారిన పడడం జరుగుతోంది. ఇటీవల ఈ మండలాల పరిధిలో ఉన్న డ్రైన్లలో ఆధునికీకరణ, నీరు-చెట్టు పనుల ద్వారా పూడిక తీశారు. అయితే ప్రధాన డ్రైన్లలో పూడికలు తొలగించకపోవడం, మీడియం, రెవెన్యూ డ్రైన్లలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆక్రమణలు తొలగించకపోవడంతో ముంపు నీరు దిగడం లేదు.
దీంతో విసుగు చెందుతున్న రైతులు ఖరీఫ్ సాగుకు దూరంగా ఉంటే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. అల్లవరం సొసైటీ కార్యాలయంలో రైతు నాయకుడు బొక్కా శ్రీనివాస్ ఆధ్వర్యాన శనివారం సమావేశమైన పలు గ్రామాల రైతులు ఖరీఫ్‌కు పంట విరామం ప్రకటించాలని నిర్ణయించారు. పలువురు రైతులు మాట్లాడుతూ, కాలువలకు సాగునీరు ఆలస్యం కావడంతో నారుమళ్లు వేయలేకపోయామని, పోసిన నారు వర్షాలకు నీట మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన మండలాలకు చెందిన రైతులు సహితం పంట విరామం ప్రకటించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే తీరప్రాంత మండలాల్లో ముంపునకు భయపడి సుమారు మూడు వేల ఎకరాల్లో రైతులు ఏటా ఖరీఫ్ సాగు చేయడం లేదు. ఖరీఫ్ సాగంటేనే తీరప్రాంత రైతులు భయపడుతున్న తరుణంలో.. ఆరంభంలోనే ఆకుమడులు మునిగిపోవడం చూసి మరింతమంది సాగుకు దూరంగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది.
Advertisement