వానల్లేవు.. మరేం చేద్దాం!
ప్రత్యామ్నాయ చర్యలపై వ్యవసాయ శాఖ దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై వ్యవసాయ శాఖ ఆందోళన చెందుతోంది. నెల రోజులుగా లోటు వర్షపాతం నమోదు కావడంతో పంటలు వాడిపోతున్న పరిస్థితి నెలకొందని అంచనా వేసింది. ఇదే పరిస్థితి మరో వారం పది రోజులుంటే పంటల దిగుబడి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగితే ఖరీఫ్ పంటలు చేతికందడం కష్టమేనని అధికారులు భయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో పంటల పరిస్థితిని అంచనా వేసి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు జిల్లా వ్యవసాయాధికారులతో అత్యవసర సమావే శానికి వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఈ నెల 7న అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి ‘సాక్షి’కి తెలిపారు. అన్ని పంటల పరిస్థితి, ఎంతెంత వాడిపో తుంది, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. వ్యవసాయ వర్సిటీ శాస్త్రవే త్తలతో మేధోమ«థనం చేస్తున్నామన్నారు.
ఇదీ పంటల పరిస్థితి...
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రుతుప వనాలు మొదట్లో ఊరించాయి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే జూన్‌లో 47 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్ పంటలు భారీగా సాగయ్యాయి. కానీ జూలై నాటికి పరిస్థితి అడ్డం తిరిగింది. గత నెలలో ఏకంగా 40శాతం లోటు వర్షపాతం నమోదైం ది. అంతేకాదు రాష్ట్రంలోని 9 జిల్లాల్లో లోటు, 19 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. వర్షపాతం లోటు డ్రైస్పెల్స్ రావడంతో మొలక దశలోని పంటలకు అవసరమైన నీరు అందలేదు. వర్షాధార పంటలపై తీవ్ర ప్రభావం పడింది.
ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో పంటలు వాడిపోయే దశలో ఉన్నాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది.పత్తి, సోయాబీన్ పంటలు ప్రధానంగా నష్ట పోతున్నామని అధికారులు చెబుతున్నారు. అనేక జిల్లాల్లో పత్తి పరిస్థితీ ఘోరంగా మారింది. 20లక్షల ఎకరాల్లో పత్తి వాడి పోతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు 23.35 లక్షల ఎకరాలకు గానూ 37 శాతం విస్తీర్ణంలోనే వరి నాట్లు పడ్డాయి.
ప్రత్యామ్నాయ ప్రణాళికకు సన్నాహాలు..
ఈ క్రమంలో వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించింది. కరువు పరిస్థి తులుంటే మూడు విడతలుగా ప్రత్యామ్నా య ప్రణాళికను అమలు చేస్తారు. జూలై 15 వరకు వర్షాలు రాకుంటే మొదటి విడత ప్రణాళిక, జూలై 31 నాటికి వర్షాలు రాకుంటే రెండో విడత, ఆగస్టు 15 నాటికి వర్షాలు రాకుంటే మూడో విడత ప్రణాళిక అమలు చేయాలి. అయితే జూన్‌లో విస్త్రృతంగా వర్షా లు కురిశాయి. వర్షాధార పంటలు వేశారు. అందువల్ల ప్రస్తుత పంటల పరిస్థితిని అంచనా వేసి ప్రత్యామ్నాయం కోసం ప్రత్యేక ప్రణాళిక రచిస్తామని వ్యవసాయా ధికారులు చెబుతున్నారు. దీనిపై ఏడో తేదీన నిర్ణయం తీసుకుంటామని పార్థసారధి తెలిపారు.