ఖరీఫ్ సుభిక్షమేనా!
* 45 మండలాల్లోనే దుర్భిక్షమంటూ రెవెన్యూ శాఖ లెక్కలు
* అంతకుమించే ఉంటుందంటోన్న వ్యవసాయాధికారులు
* మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో కురవని వాన
* రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోనూ వర్షాభావమే
* తప్పుడు లెక్కలు చూపుతోన్న అధికార యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్ : రాష్ర్టంలో ఈ నెల 1 వ తేదీ నుంచి ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైంది..
పంటల సాగూ గణనీయంగా పెరిగింది.. అని పేర్కొంటూ అధికారులు నివేదికల మీద నివేదికలు విడుదల చేశారు. కానీ, వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు అసలే కురియలేదు. రుతుపవనాలు సకాలంలో వచ్చినా కొన్ని మండలాల్లో అసలు వర్షాలే పడలేదు. అయితే ప్రభుత్వం మాత్రం అధిక వర్షపాతం మండలాలను ఎక్కువ చేసి చూపిస్తూ... వర్షాభావ మండలాల సంఖ్యను తక్కువ చూపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ప్రకారమే జిల్లాల నుంచి రెవెన్యూ యంత్రాంగం తప్పుడు లెక్కలు చూపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
45 మండలాలకే పరిమితం..
వ్యవసాయ సీజన్ మొదలైన జూన్ 1వ తేదీ నుంచి 308 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. 106 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయని, కేవలం 40 మండలాల్లో లోటు వర్షపాతం, ఐదు మండలాల్లో తీవ్ర లోటు పరిస్థితులు నెలకొన్నాయని ఆ శాఖ తాజా నివేదికలో పేర్కొంది. మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 64 మండలాల్లో 21, మెదక్ జిల్లాలోని 46 మండలాలకు గాను 11 మండలాల్లో లోటు, తీవ్ర లోటు మండలాలున్నాయని వెల్లడించింది.
విచిత్రమేంటంటే నల్లగొండ జిల్లాల్లో 59 మండలాలుంటే కేవలం ఒక్క యాదగిరిగుట్ట మండలంలోనే లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. కానీ, ఆ జిల్లాలో కనీసం 15 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోనూ 6 మండలాల్లో లోటు వర్షపాతం ఉందని పేర్కొంటే... 10 మండలాల్లో చుక్క వర్షం కురియలేదు. మరో విచిత్రమేంటంటే మహబూబ్‌నగర్ జిల్లాలో జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు జరగాల్సిన సాధారణ సాగులో ఏకంగా 85 శాతం జరిగినట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో 248 శాతం, నల్లగొండ జిల్లాలో 351 శాతం, రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 479 శాతం సాగు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ లెక్కల ప్రకటనపై వ్యవసాయ అధికారులు నోరెళ్లబెడుతున్నారు.
తప్పుడు కొలమానాలు..
వర్షపాతం అంచనా వేయడానికి సరైన కొలమానాలు, వాతావరణ నిపుణులు లేకపోవడంతో లెక్కల్లో శాస్త్రీయత లోపిస్తోందన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో కేంద్ర వాతావరణ శాఖ (ఐఎండీ)కు చెందిన అబ్జర్వేటరీలు కేవలం నిజామాబాద్, రామగుండం, హైదరాబాద్‌లలో మాత్రమే ఉన్నాయి. ఈ మూడుచోట్ల మాత్రం ఐఎండీ నిపుణులు పూర్తి శాస్త్రీయ పద్ధతిలో వర్షపాతాన్ని లెక్కిస్తారు. ఇక మిగతా చోట్ల అంటే దాదాపు ప్రతి మండలంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అబ్జర్వేటరీలు ఉన్నాయి. ఇవి రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి.
ఈ అబ్జర్వేటరీల నాణ్యత, వీటి నుంచి విడుదల చేసే వాతావరణ లెక్కల శాస్త్రీయత సందేహాస్పదమే. ఐఎండీ అధికారుల్లోనూ దీనిపై అనుమానాలు ఉన్నాయి. అయితే పరిస్థితి అంతా బాగుందన్న విధానంపైనే అధికారులు దృష్టి సారిస్తుండడంతో.. దీనిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలు కరువు, దుర్భర పరిస్థితులను తక్కువ చేసి చూపించాలని కొందరు అధికారులు కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి.