High rainfall
-
నిండుకుండల్లా.. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నదులు, ఉప నదులు, వాగులు, వంకలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో దశాబ్దాలుగా జలకళకు నోచుకోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలతో ఆదివారం నాటికి సగటున 539 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 27.9 శాతం అధికంగా అంటే.. 689.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర మినహా మిగిలిన పది జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం చోటు చేసుకుంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 28.1 శాతం తక్కువ వర్షం కురిసింది. ► ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది సాధారణం కంటే 45.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గుండ్లకమ్మ ప్రాజెక్టులో 3.86 టీఎంసీలకుగానూ 3.50 టీఎంసీలను నిల్వ చేసి.. వరద కొనసాగుతుండటంతో 22,311 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కంభం చెరువు నిండుకుండలా మారింది. ► రెయిన్‌షాడో ప్రాంతమైన పెన్నా బేసిన్లో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో పెన్నా, చెయ్యేరు, పాపాఘ్ని, కుందూ ఉరకలెత్తుతున్నాయి. చెయ్యేరు ఉధృతితో వైఎస్సార్ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు నిండిపోయింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు కాగా ఇప్పుడు 2.20 టీఎంసీల నీరు ఉంది. పాపాఘ్ని పరవళ్లతో వెలిగల్లు ప్రాజెక్టులో నీటి నిల్వ 4.64 టీఎంసీలకుగానూ 2.43 టీఎంసీలకు చేరుకుంది. ► అనంతపురం జిల్లాలో సాధారణం కంటే 67 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పెన్నా పరవళ్లుతో చాగల్లు, పెండేకళ్లు రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. ► కర్నూలు జిల్లాలో హంద్రీ నది ఉప్పొంగుతోంది. దశాబ్దాలుగా నిండని గాజులదిన్నె ప్రాజెక్టుకు ఈ ఏడాది మూడు దఫాలుగా వరద రావడంతో గేట్లు ఎత్తేయాల్సి వచ్చింది. ► పెన్నా ఉధృతికి నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు నిండిపోయింది. కండలేరు నిండుకుండలా మారింది. కనిగిరి రిజర్వాయర్‌లోకి 3.45 టీఎంసీలకుగానూ 1.59, సర్వేపల్లి రిజర్వాయర్‌లోకి 1.74 టీఎంసీలకుగానూ 1.04 టీఎంసీలు చేరాయి. ► తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్‌లో 24.1 టీఎంసీలకుగానూ 22.72 టీఎంసీలను నిల్వ చేశారు. ప్రాజెక్టులోకి 8,540 క్యూసెక్కులు చేరుతుండటంతో గేట్లు ఎత్తి 9,060 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ► విశాఖ జిల్లాలో తాండవ, వరాహ నదులు ఉరకలెత్తుతున్నాయి. తాండవ ప్రాజెక్టు నిండిపోయింది. రైవాడ రిజర్వాయర్‌లో 3.60 టీఎంసీలకుగానూ నీటి నిల్వ 3.02 టీఎంసీలకు చేరింది. వరాహ, కోనం తదితర ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ► నాగావళి పరవళ్లతో విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు గేట్లను జూన్ 11న ఎత్తేశారు. ఆ రోజు నుంచి గేట్లను దించలేదు. పెద్దగెడ్డ, వెంగళ్రాయసాగరం ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. ► శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, సువర్ణముఖి తదితర నదులు ఉరకలెత్తుతున్నాయి. -
దేశంలో సాధారణం కంటే 6 % అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే 6 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం ప్రకటించింది. కానీ, ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే లోటు వర్షపాతమే కొనసాగుతోందని పేర్కొంది. దక్షిణ, మధ్య, ఈశాన్య, తూర్పు భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షం కురిసిందని తెలియజేసింది. వాయవ్య భారతదేశంలో 19 శాతం లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. మరో రెండు నెలలపాటు వర్షాలు కురుస్తాయి కాబట్టి వాయవ్య భారతంలోనూ పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రా చెప్పారు. దక్షిణాదిలో సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం రికార్డు అయ్యిందని ఐఎండీ స్పష్టం చేసింది. -
బంగ్లాదేశ్‌లో ‘ఫొని’ బీభత్సం
ఢాకా/భువనేశ్వర్: భారత్‌లోని ఒడిశా రాష్ట్రాన్ని వణికించిన పెను తుపాన్ ‘ఫొని’ శనివారం బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు తోడుగా వాగులు, వంకలన్నీ ఉప్పొంగడంతో బంగ్లాదేశ్‌లో ఒక్కరోజే 14 మంది ప్రాణాలు కోల్పోగా, 63 మంది గాయపడ్డారు. కుండపోత వర్షాలతో నదులు పొంగడంతో 36 గ్రామాలు నీటమునిగాయి. 16 లక్షల మంది ప్రజలను బంగ్లా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బలమైన ఈదురు గాలులకు 8 తీరప్రాంత జిల్లాల్లో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒడిశాలో 16కు చేరుకున్న మృతులు ఒడిశాలో ‘ఫొని’ పెను తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 16కు చేరుకుంది. ఫొని ప్రభావంతో శుక్రవారం నాటికి 8 మంది చనిపోగా, ఈ సంఖ్య తాజాగా 16కు పెరిగింది. కాగా, ఫొని భారత తీరానికి దూరంగా వెళ్లిపోవడంతో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో కుప్పకూలిన 10,000 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరిస్తున్నామని వెల్లడించారు. ప్రధాని మోదీ ‘ఫొని’ ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నట్లు ఒడిశా సీఎం కార్యాలయం తెలిపింది. -
నెలలోపే 95% వర్షపాతం
వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల ప్రభావం ఈ ఏడాది వర్షాలపైనా పడింది. సీజన్ మొత్తంలో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతంలో 95% మూడు నుంచి 27 రోజుల్లోనే నమోదైంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్ల ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో వరదలు వచ్చి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఏటా జూన్ 1న ప్రారంభమై సెప్టెంబరు 30 వరకు ఉంటాయి. ఈ నాలుగు నెలలు కురిసే వానలను బట్టి సగటు వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈసారి తక్కువ రోజులే వర్షాలు కురిశాయి. కురిసిన రోజుల్లో మాత్రం కుండపోతగా పడ్డాయి. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. దేశంలోని 22 ప్రధాన పట్టణాల్లో గంటల వ్యవధిలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది. గత మూడు నెలల్లో సాధారణ వర్షపాతంలో 95% మూడు నుంచి 27 రోజుల్లోనే నమోదైంది. ఉదాహరణకు ఢిల్లీలో 99 గంటల్లోనే 95% వర్షపాతం నమోదైంది. సరాసరి 33 గంటల్లో 50% వర్షం కురిసింది. ముంబైలో మొత్తం సగటు వర్షపాతంలో 50 శాతం 134 గంటల్లోనే నమోదైంది. అహ్మదాబాద్‌లో 46 గంటల్లో 66.3 సెం.మీ. వాన కురిసింది. ఆరు రోజుల్లో సుమారు 95 శాతం వర్షపాతం నమోదైంది. వాతావరణంలో అనూహ్య మార్పులు పట్టణ యంత్రాంగాల ప్రణాళికలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే పట్టణ ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
నాలుగోవంతు లోటు వర్షపాతమే!
న్యూఢిల్లీ: భారత్‌లోని 25 శాతం భూభాగంలో ఈసారి లోటు వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఈ జాబితాలో 48 శాతం లోటు వర్షపాతంతో బిహార్ తొలిస్థానంలో, ఉత్తరప్రదేశ్(46 శాతం), జార్ఖండ్(42 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా సగటు లోటు వర్షపాతం 3 శాతానికి తగ్గిపోయినట్లు తేలింది. వీటిలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా 34% తక్కువ వర్షపాతం నమోదయింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో సాధారణం కంటే 9 %తక్కువ వర్షపాతం రికార్డయింది. వీటితో పోల్చుకుంటే మధ్య భారతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 16 శాతం అధిక వర్షపాతం నమోదయింది. -
తడిసి ముద్దయింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాలు పుంజుకోవడంతో గత వారం పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 32 శాతం అధిక వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ ఒకటో తేదీ నుంచి ఆదివారం వరకు ఈ నెలన్నర రోజుల్లో సాధారణంగా 240 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటికే 318 ఎంఎంలు నమోదైంది. ఆదిలాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఏకంగా 71 శాతం చొప్పున అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో 62 శాతం చొప్పున అధిక వర్షపాతం నమోదైంది. కొమురం భీం జిల్లాలో 56 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో మాత్రం 19 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం ఆ జిల్లా వాసుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. రాష్ట్రంలో నైరుతి సీజన్ సాధారణ వర్షపాతం 755 ఎంఎంలు కాగా, ఈ సారి 97 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ఆ ప్రకారం ఈ సారి 732 ఎంఎంలు కురిసే అవకాశముంది. అంటే సీజన్ సాధారణ వర్షపాతంలో దాదాపు సగం వరకు ఇప్పటికే రికార్డు కావడం గమనార్హం. మరో రెండ్రోజులు వర్షాలు.. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది . వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు.. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. పాల్వంచ, చండ్రుగొండల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అశ్వారావుపేటలో 8, ముల్కలపల్లి, భద్రాచలం, బూర్గుంపాడు, కొత్తగూడెంలలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
100 మండలాల్లో అధిక వర్షపాతం
నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ నుంచి ఇప్పటివరకు వంద మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపి నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ సీజన్ మధ్యలో డ్రైస్పెల్ కారణంగా 174 మండలాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతం, 310 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణంగా సరాసరి 56.8 సెం.మీ. వర్ష పాతానికి 52.1సెం.మీ. నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో 47 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఏకంగా 40 శాతం లోటు రికార్డయింది. ఈ నెలలో ఇప్పటివరకు 6 శాతం లోటు నమోదైంది. నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు స్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. గడిచిన 24 గంటల్లో దామరగిద్దలో అత్యధికంగా 7 సెం.మీ. వర్షం కురిసింది. కోయిదా, జడ్చెర్ల, మహబూబ్‌నగర్‌లలో 6 సెం.మీ., మక్తల్, రుద్రూరు, మద్నూరు, నారాయణపేట్‌లలో 5సెం.మీ., ఎల్లారెడ్డి, అశ్వారావుపేట, పినపాక, మొగుళ్లపల్లి, గండీడ్ 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
13 జిల్లాల్లో అధిక వర్షపాతం
♦ 15 జిల్లాల్లో సాధారణంగా నమోదు ♦ నిజామాబాద్, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో మాత్రం లోటు ♦ రాష్ట్రవ్యాప్తంగా సగటున 10 శాతం అధిక వర్షపాతం ♦ 56.67 లక్షల ఎకరాల్లో మొదలైన పంటల సాగు ♦ భారీగా పెరుగుతున్న పత్తి.. ఇంకా ఊపందుకోని వరి నాట్లు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాధా రణానికి మించి అధిక వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. మరో 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా.. నిజామాబాద్, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో మా త్రం లోటు వర్షపాతం నమోదైందని బుధవా రం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే పది శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. పది శాతం అధికంగా.. రాష్ట్రంలో జూన్ ఒకటో తేదీ నుంచి జూలై 12వ తేదీ మధ్య కురవాల్సిన సాధారణ వర్షపాతం 210 మిల్లీమీటర్లుకాగా.. ఈ ఏడాది 231.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇది సాధారణం కంటే 10 శాతం అధికం కావడం గమనార్హం. అయితే ఈ నెల తొలి 12 రోజుల్లో మాత్రం 38.8 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా జూలై 1 నుంచి 12 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 81.7 మిల్లీమీటర్లుకాగా.. ఈసారి 42.9 మిల్లీమీటర్లే కురిసింది. అయితే ప్రస్తుతం భారీ వర్షాలు కురవకపోవడం పంటలకు మేలు చేసేదేనని, వర్షాలు కురిస్తే మొక్కలు కుళ్లిపోతాయని వ్యవ సాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ నాలుగైదు రోజుల తర్వాత గానీ వర్షాలు ప్రారంభం కాకపోతే ఎండిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఊపందుకున్న సాగు రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలుకాగా.. బుధవారం నాటికి 56.67 లక్షల (52%) ఎకరాల్లో పంటల సాగు ప్రారంభమైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇందులో పత్తి పంట ఏకంగా 35.12 లక్షల ఎకరాల్లో సాగుకావడం గమనార్హం. పత్తి సాధారణ సాగుతో పోలిస్తే ఇప్పటికే 84 శాతంగా నమోదైంది. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు 10.55 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 5.8 లక్షల (55%) ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. గతేడాది ఇదే సమయానికి సాధారణం కంటే అధికంగా.. ఏకంగా 14.07 లక్షల ఎకరాల్లో సాగు కావడం గమనార్హం. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.20 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 6.8 లక్షల (52%) ఎకరాల్లో సాగైంది. వరి సాధారణ సాగు 23.35 లక్షల ఎకరాలుకాగా.. 2.32 లక్షల (10%) ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. నాట్లు వేయడానికి ఇంకా సమయం ఉన్నందున ఆగస్టులో వరిసాగు పుంజుకునే అవకాశముంది. జిల్లాల వారీగా చూస్తే... ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 90 శాతం సాగు మొదలుకాగా.. వనపర్తి జిల్లాలో అత్యంత తక్కువగా 25 శాతం విస్తీర్ణంలోనే పంటలు వేశారు. నాలుగు రోజులు సాధారణ వర్షాలు వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నాలుగు రోజులపాటు ఎక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొంది. -
ఖరీఫ్ సుభిక్షమేనా!
* 45 మండలాల్లోనే దుర్భిక్షమంటూ రెవెన్యూ శాఖ లెక్కలు * అంతకుమించే ఉంటుందంటోన్న వ్యవసాయాధికారులు * మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో కురవని వాన * రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోనూ వర్షాభావమే * తప్పుడు లెక్కలు చూపుతోన్న అధికార యంత్రాంగం సాక్షి, హైదరాబాద్ : రాష్ర్టంలో ఈ నెల 1 వ తేదీ నుంచి ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైంది.. పంటల సాగూ గణనీయంగా పెరిగింది.. అని పేర్కొంటూ అధికారులు నివేదికల మీద నివేదికలు విడుదల చేశారు. కానీ, వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు అసలే కురియలేదు. రుతుపవనాలు సకాలంలో వచ్చినా కొన్ని మండలాల్లో అసలు వర్షాలే పడలేదు. అయితే ప్రభుత్వం మాత్రం అధిక వర్షపాతం మండలాలను ఎక్కువ చేసి చూపిస్తూ... వర్షాభావ మండలాల సంఖ్యను తక్కువ చూపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ప్రకారమే జిల్లాల నుంచి రెవెన్యూ యంత్రాంగం తప్పుడు లెక్కలు చూపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. 45 మండలాలకే పరిమితం.. వ్యవసాయ సీజన్ మొదలైన జూన్ 1వ తేదీ నుంచి 308 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. 106 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయని, కేవలం 40 మండలాల్లో లోటు వర్షపాతం, ఐదు మండలాల్లో తీవ్ర లోటు పరిస్థితులు నెలకొన్నాయని ఆ శాఖ తాజా నివేదికలో పేర్కొంది. మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 64 మండలాల్లో 21, మెదక్ జిల్లాలోని 46 మండలాలకు గాను 11 మండలాల్లో లోటు, తీవ్ర లోటు మండలాలున్నాయని వెల్లడించింది. విచిత్రమేంటంటే నల్లగొండ జిల్లాల్లో 59 మండలాలుంటే కేవలం ఒక్క యాదగిరిగుట్ట మండలంలోనే లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. కానీ, ఆ జిల్లాలో కనీసం 15 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోనూ 6 మండలాల్లో లోటు వర్షపాతం ఉందని పేర్కొంటే... 10 మండలాల్లో చుక్క వర్షం కురియలేదు. మరో విచిత్రమేంటంటే మహబూబ్‌నగర్ జిల్లాలో జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు జరగాల్సిన సాధారణ సాగులో ఏకంగా 85 శాతం జరిగినట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో 248 శాతం, నల్లగొండ జిల్లాలో 351 శాతం, రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 479 శాతం సాగు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ లెక్కల ప్రకటనపై వ్యవసాయ అధికారులు నోరెళ్లబెడుతున్నారు. తప్పుడు కొలమానాలు.. వర్షపాతం అంచనా వేయడానికి సరైన కొలమానాలు, వాతావరణ నిపుణులు లేకపోవడంతో లెక్కల్లో శాస్త్రీయత లోపిస్తోందన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో కేంద్ర వాతావరణ శాఖ (ఐఎండీ)కు చెందిన అబ్జర్వేటరీలు కేవలం నిజామాబాద్, రామగుండం, హైదరాబాద్‌లలో మాత్రమే ఉన్నాయి. ఈ మూడుచోట్ల మాత్రం ఐఎండీ నిపుణులు పూర్తి శాస్త్రీయ పద్ధతిలో వర్షపాతాన్ని లెక్కిస్తారు. ఇక మిగతా చోట్ల అంటే దాదాపు ప్రతి మండలంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అబ్జర్వేటరీలు ఉన్నాయి. ఇవి రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. ఈ అబ్జర్వేటరీల నాణ్యత, వీటి నుంచి విడుదల చేసే వాతావరణ లెక్కల శాస్త్రీయత సందేహాస్పదమే. ఐఎండీ అధికారుల్లోనూ దీనిపై అనుమానాలు ఉన్నాయి. అయితే పరిస్థితి అంతా బాగుందన్న విధానంపైనే అధికారులు దృష్టి సారిస్తుండడంతో.. దీనిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలు కరువు, దుర్భర పరిస్థితులను తక్కువ చేసి చూపించాలని కొందరు అధికారులు కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. -
రవ్వంత సాయానికీ జాప్యమే
రైతు నష్టమంటే పాలకులు పరాచికాలు ఆడుతుంటారు. ఏటా ఉండేదేలే అన్నట్లు లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారు. కొండంత పంట నష్టాన్ని, ప్రభుత్వం చేసే గోరంత సాయం ఏమాత్రం పూడ్చలేనిది. అయినా సరే ఆ సాయం చేస్తేనే పొంగిపోతాడు. అదే ఊపుతో మళ్లీ మేడి పడతాడు. రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. పంట పండిస్తాడు. కానీ ఆ రవ్వంత సాయం చేయాలన్నా సంవత్సరాలు తిరగబడాల్సిందే. గత ఏడాది అక్టోబర్ నెలలో మార్టూరు, యద్దనపూడి మండలాల్లో కురిసిన కుంభవృష్టికి వేల ఎకరాల్లో పంట మునకేసి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ప్రభుత్వం నుంచి నేటికీ సాయం అందలేదు. మార్టూరు, యద్దనపూడి : గతేడాది అక్టోబర్ నెలలో అధిక వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. మూడు రోజుల పాటు కుండపోత వ ర్షానికి వాగులు, వంకలు పొంగాయి. చేల మీదకు, ఊళ్ల మీదకు మళ్లాయి. అప్పటికే పత్తి కాయ మీద ఉన్న చేలు నీటిలో నాని కుళ్లిపోయాయి. మిగిలిన పంటలూ ఉరకెత్తాయి. చేలకు చేలే కొట్టుకుపోయాయి. ఆ వర్షాలకు జిల్లాలో అత్యధికంగా నష్టపోయింది యద్దనపూడి మండలమే. కోట్ల రూపాయల పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా నేటికీ తమకు ఎలాంటి సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు. యద్దనపూడి మండలంలో 12 వేల ఎకరాలు, మార్టూరు మండలంలో 2 వేల ఎకరాల్లో పత్తి, 200 ఎకరాల్లో మొక్కజొన్న, 1000 ఎకరాల్లో కూరగాయలు, 500 ఎకరాల్లో మిర్చి పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. ఎకరాకు పది క్వింటాళ్ల వరకు వస్తుందనుకున్న పత్తి నీటిపాలు అవడంతో రైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వ సాయంతోనైనా కొంత వెసులుబాటు కలుగుతుందనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. 8 నెలలు గడుస్తున్నా అధికారులు రాసిన నష్టపరిహారం అంకెలు అలానే ఉన్నాయి. మళ్లీ సాగు సమయం ఆసన్నమైనా పరిహారం మాత్రం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా తమకు సాయం అందించాలని కోరుతున్నారు. -
అకాల వర్షాలతో నష్టం రూ 99 లక్షలు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: అకాల వర్షాలు అన్నదాతను ఆవేదనకు గురి చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. జిల్లాలోని చాలా చోట్ల ఇప్పటికే వరి కోతలు పూర్తి అయ్యాయి. కళ్లాల లో ధాన్యం కుప్పలుగా పోసి ఉంది. కొ నుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యానికి కూడా రక్షణ లేకుండా పోయింది. అకాల వర్షాలతో వేలాది బస్తాల ధాన్యం తడిసి ముద్దగా మారింది. వందలాది ఎకరాలలో పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో 289 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రైతులు కళ్లాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న తరు ణంలోనే వర్షం కురియడం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. జిల్లాలో 60 వేల క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దీని నష్టం రూ. 80.70 లక్షల వరకు ఉంటుందని అంచనా. వడ్ల గింజలు రాలిపోయి పొ లంలోనే మొలకెత్తుతున్నాయి. ఇప్పటికే 183 హెక్టార్లలో వరి పంట నీటి పాలైంది. దీని నష్టం రూ. 18.30 లక్షలుగా ఉంటుందని వ్యవసాయశాఖ ధికారులు పే ర్కొంటున్నారు. నష్టం విలువ రూ.99 లక్షల వరకు ఉంటుందని అంచనాకు వచ్చారు. నివేదికను అతి త్వరలోనే ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో, మార్కెట్ యార్డులలో అధికారులు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతుల కళ్లముందే ధాన్యం నీళ్ల పాలైంది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో వ్యాపారులకు చెందిన ఐదు వేల బస్తాలు, రైతులకు చెందిన 1100 బస్తాలు నీటి పాలయ్యాయి. రంగుమారిన ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారని వారు ఆవేదన చెందుతున్నారు. సిరికొండలో అధిక వర్షపాతం జిల్లాలోని అత్యధికంగా సిరికొండలో వర్షపాతం న మోదైంది. ఇక్కడ 12.8 మి.మీటర్ల వర్షం కురిసింది. నాగిరెడ్డిపేటలో 7.2 మి.మీటర్లు, ఎల్లారెడ్డిలో 6.0 మి. మీ, సదాశివనగర్‌లో 5.0 మి.మీ, ధర్పల్లిలో 4.2 మి. మీ, ఆర్మూర్‌లో 3.0 మి.మీ, కామారెడ్డిలో 4.8 మి. మీ, తాడ్వాయిలో 5.0మి.మీ. వర్షపాతం నమోదైంది. -
జోరుగా ఇసుక రవాణా
నిర్మల్, న్యూస్‌లైన్ : జిల్లాలో గత ఖరీఫ్‌లో అధిక వర్షాలు కురవడంతో నిర్మల్, సారంగాపూర్ మండలాల్లోని సాగు భూములకు నీరందించే స్వర్ణ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లను అనేకసార్లు ఎత్తి మిగులు జలాలను స్వర్ణ నదిలోకి వదిలారు. ఆనాటి ప్రవాహంతో స్వర్ణనదిలో ఎప్పుడూ లేనంతగా సన్నని మేలైన ఇసుక వచ్చి చేరింది. దీనిని గ్రహించిన ఇసుక అక్రమార్కులు దానిపై కన్నేశారు. రేయింబవళ్లు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా నది పరీవాహక ప్రాంతాలైన నిర్మల్ మండలం వెంగ్వాపేట్, చిట్యాల్, మంజులాపూర్, కౌట్ల(కె), కడ్తాల్, గంజాల్, జాఫ్రాపూర్, మాదాపూర్, సారంగాపూర్ మండలం ఆలూర్, తాండ్ర, వంజర్, బీరవెల్లి తదితర ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఇప్పటికే పెద్దమొత్తంలోనే ఇసుకను తరలించారు. బహిరంగంగానే అయినా.. ఇసుక అక్రమ రవాణా బహిరంగంగానే జరుగుతోంది. నిర్మల్-భైంసా రహదారిపై చిట్యాల బ్రిడ్జి సమీపంలో రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. ఈ తంతు రోజూ జరుగుతున్నా ఆ రోడ్డు వెంట వెళ్లే అధికారులకు మాత్రం కనిపించకపోవడం శోచనీయం. ఈ ఒక్క చోటే కాకుండా అన్నిచోట్ల రేయింబవళ్లు బహిరంగంగానే ఈ తంతు సాగుతోంది. ఇసుకను నదిలో నుంచి తీసుకెళ్లడమే కాకుండా ఆయా చోట్ల పెద్ద ఎత్తున డంపింగ్ చేస్తూ సన్నని ఇసుకను అధిక ధరకు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం స్వర్ణ నదిలో లభిస్తున్న ఇసుక సన్నరకం కావడంతో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2వేలకు పైగా, టిప్పర్‌కు రూ.6వేలపైనే ధర పలుకుతోంది. నది పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో సదరు ఇసుకకు అనధికారిక వేలం నిర్వహించడం, ఆ వేలంపాటలు రూ.2 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు పలుకుతున్నాయంటే ఇసుక అక్రమ రవాణాలో ఎంతటి లాభం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కొన్నిచోట్ల సదరు ట్రాక్టర్ల యజమానులే వేలంపాట దక్కించుకోగా.. మరికొన్ని చోట్ల కొందరు వ్యక్తులు కలిసికట్టుగా లేదా ఒక్కరే వేలంపాట దక్కించుకొని ట్రిప్పుకు రూ.300 నుంచి రూ.500 వరకు అనధికారికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భూగర్భ జలాలకు పెనుముప్పు... నదులు, వాగులు తదితర వాటి నుంచి ఇసుకను తరలించడం ద్వారా భూగర్భజలాలకు ముప్పు వాటిల్లుతోందని చాలా చోట్ల వేలంపాటలు రద్దు చేశారు. అయితే ఇసుక అక్రమ రవాణాదారులు దీనిని ఆసరాగా చేసుకొని పెద్దఎత్తున ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నదిలో పెద్ద పెద్ద గోతులు తీస్తూ, నీళ్ల మధ్యలో నుంచి ఇసుక తీస్తుండడంతో భూగర్భజలాలు పడిపోయి సమీపంలోని పంటపొలాల్లో ఉన్న బోరుబావులు ఎండిపోయే పరిస్థితి తలెత్తుతోంది. గతంలో నిర్మల్ మండలం చిట్యాల్, మంజులాపూర్ శివారులో ఉన్న పంటపొలాల్లోని బోరుబావులు ఎండిపోవడంతో సంబంధిత రైతులు తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.