నీటితో కళకళలాడుతున్న అనంతపురం జిల్లాలోని చాగల్లు రిజర్వాయర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నదులు, ఉప నదులు, వాగులు, వంకలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో దశాబ్దాలుగా జలకళకు నోచుకోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలతో ఆదివారం నాటికి సగటున 539 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 27.9 శాతం అధికంగా అంటే.. 689.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర మినహా మిగిలిన పది జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం చోటు చేసుకుంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 28.1 శాతం తక్కువ వర్షం కురిసింది.
► ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది సాధారణం కంటే 45.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గుండ్లకమ్మ ప్రాజెక్టులో 3.86 టీఎంసీలకుగానూ 3.50 టీఎంసీలను నిల్వ చేసి.. వరద కొనసాగుతుండటంతో 22,311 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కంభం చెరువు నిండుకుండలా మారింది.
► రెయిన్‌షాడో ప్రాంతమైన పెన్నా బేసిన్‌లో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో పెన్నా, చెయ్యేరు, పాపాఘ్ని, కుందూ ఉరకలెత్తుతున్నాయి. చెయ్యేరు ఉధృతితో వైఎస్సార్ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు నిండిపోయింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు కాగా ఇప్పుడు 2.20 టీఎంసీల నీరు ఉంది. పాపాఘ్ని పరవళ్లతో వెలిగల్లు ప్రాజెక్టులో నీటి నిల్వ 4.64 టీఎంసీలకుగానూ 2.43 టీఎంసీలకు చేరుకుంది.
► అనంతపురం జిల్లాలో సాధారణం కంటే 67 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పెన్నా పరవళ్లుతో చాగల్లు, పెండేకళ్లు రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి.
► కర్నూలు జిల్లాలో హంద్రీ నది ఉప్పొంగుతోంది. దశాబ్దాలుగా నిండని గాజులదిన్నె ప్రాజెక్టుకు ఈ ఏడాది మూడు దఫాలుగా వరద రావడంతో గేట్లు ఎత్తేయాల్సి వచ్చింది.
► పెన్నా ఉధృతికి నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు నిండిపోయింది. కండలేరు నిండుకుండలా మారింది. కనిగిరి రిజర్వాయర్‌లోకి 3.45 టీఎంసీలకుగానూ 1.59, సర్వేపల్లి రిజర్వాయర్‌లోకి 1.74 టీఎంసీలకుగానూ 1.04 టీఎంసీలు చేరాయి.
► తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్‌లో 24.1 టీఎంసీలకుగానూ 22.72 టీఎంసీలను నిల్వ చేశారు. ప్రాజెక్టులోకి 8,540 క్యూసెక్కులు చేరుతుండటంతో గేట్లు ఎత్తి 9,060 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
► విశాఖ జిల్లాలో తాండవ, వరాహ నదులు ఉరకలెత్తుతున్నాయి. తాండవ ప్రాజెక్టు నిండిపోయింది. రైవాడ రిజర్వాయర్‌లో 3.60 టీఎంసీలకుగానూ నీటి నిల్వ 3.02 టీఎంసీలకు చేరింది. వరాహ, కోనం తదితర ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.
► నాగావళి పరవళ్లతో విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు గేట్లను జూన్ 11న ఎత్తేశారు. ఆ రోజు నుంచి గేట్లను దించలేదు. పెద్దగెడ్డ, వెంగళ్రాయసాగరం ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి.
► శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, సువర్ణముఖి తదితర నదులు ఉరకలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment