రవ్వంత సాయానికీ జాప్యమే
రైతు నష్టమంటే పాలకులు పరాచికాలు ఆడుతుంటారు. ఏటా ఉండేదేలే అన్నట్లు లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారు. కొండంత పంట నష్టాన్ని, ప్రభుత్వం చేసే గోరంత సాయం ఏమాత్రం పూడ్చలేనిది. అయినా సరే ఆ సాయం చేస్తేనే పొంగిపోతాడు. అదే ఊపుతో మళ్లీ మేడి పడతాడు. రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. పంట పండిస్తాడు. కానీ ఆ రవ్వంత సాయం చేయాలన్నా సంవత్సరాలు తిరగబడాల్సిందే. గత ఏడాది అక్టోబర్ నెలలో మార్టూరు, యద్దనపూడి మండలాల్లో కురిసిన కుంభవృష్టికి వేల ఎకరాల్లో పంట మునకేసి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ప్రభుత్వం నుంచి నేటికీ సాయం అందలేదు.
మార్టూరు, యద్దనపూడి : గతేడాది అక్టోబర్ నెలలో అధిక వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. మూడు రోజుల పాటు కుండపోత వ ర్షానికి వాగులు, వంకలు పొంగాయి. చేల మీదకు, ఊళ్ల మీదకు మళ్లాయి. అప్పటికే పత్తి కాయ మీద ఉన్న చేలు నీటిలో నాని కుళ్లిపోయాయి. మిగిలిన పంటలూ ఉరకెత్తాయి. చేలకు చేలే కొట్టుకుపోయాయి. ఆ వర్షాలకు జిల్లాలో అత్యధికంగా నష్టపోయింది యద్దనపూడి మండలమే. కోట్ల రూపాయల పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా నేటికీ తమకు ఎలాంటి సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు.
యద్దనపూడి మండలంలో 12 వేల ఎకరాలు, మార్టూరు మండలంలో 2 వేల ఎకరాల్లో పత్తి, 200 ఎకరాల్లో మొక్కజొన్న, 1000 ఎకరాల్లో కూరగాయలు, 500 ఎకరాల్లో మిర్చి పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. ఎకరాకు పది క్వింటాళ్ల వరకు వస్తుందనుకున్న పత్తి నీటిపాలు అవడంతో రైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వ సాయంతోనైనా కొంత వెసులుబాటు కలుగుతుందనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. 8 నెలలు గడుస్తున్నా అధికారులు రాసిన నష్టపరిహారం అంకెలు అలానే ఉన్నాయి. మళ్లీ సాగు సమయం ఆసన్నమైనా పరిహారం మాత్రం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా తమకు సాయం అందించాలని కోరుతున్నారు.