నిర్మల్, న్యూస్‌లైన్ : జిల్లాలో గత ఖరీఫ్‌లో అధిక వర్షాలు కురవడంతో నిర్మల్, సారంగాపూర్ మండలాల్లోని సాగు భూములకు నీరందించే స్వర్ణ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లను అనేకసార్లు ఎత్తి మిగులు జలాలను స్వర్ణ నదిలోకి వదిలారు. ఆనాటి ప్రవాహంతో స్వర్ణనదిలో ఎప్పుడూ లేనంతగా సన్నని మేలైన ఇసుక వచ్చి చేరింది. దీనిని గ్రహించిన ఇసుక అక్రమార్కులు దానిపై కన్నేశారు.
రేయింబవళ్లు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా నది పరీవాహక ప్రాంతాలైన నిర్మల్ మండలం వెంగ్వాపేట్, చిట్యాల్, మంజులాపూర్, కౌట్ల(కె), కడ్తాల్, గంజాల్, జాఫ్రాపూర్, మాదాపూర్, సారంగాపూర్ మండలం ఆలూర్, తాండ్ర, వంజర్, బీరవెల్లి తదితర ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఇప్పటికే పెద్దమొత్తంలోనే ఇసుకను తరలించారు.
బహిరంగంగానే అయినా..
ఇసుక అక్రమ రవాణా బహిరంగంగానే జరుగుతోంది. నిర్మల్-భైంసా రహదారిపై చిట్యాల బ్రిడ్జి సమీపంలో రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. ఈ తంతు రోజూ జరుగుతున్నా ఆ రోడ్డు వెంట వెళ్లే అధికారులకు మాత్రం కనిపించకపోవడం శోచనీయం. ఈ ఒక్క చోటే కాకుండా అన్నిచోట్ల రేయింబవళ్లు బహిరంగంగానే ఈ తంతు సాగుతోంది. ఇసుకను నదిలో నుంచి తీసుకెళ్లడమే కాకుండా ఆయా చోట్ల పెద్ద ఎత్తున డంపింగ్ చేస్తూ సన్నని ఇసుకను అధిక ధరకు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రస్తుతం స్వర్ణ నదిలో లభిస్తున్న ఇసుక సన్నరకం కావడంతో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2వేలకు పైగా, టిప్పర్‌కు రూ.6వేలపైనే ధర పలుకుతోంది. నది పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో సదరు ఇసుకకు అనధికారిక వేలం నిర్వహించడం, ఆ వేలంపాటలు రూ.2 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు పలుకుతున్నాయంటే ఇసుక అక్రమ రవాణాలో ఎంతటి లాభం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కొన్నిచోట్ల సదరు ట్రాక్టర్ల యజమానులే వేలంపాట దక్కించుకోగా.. మరికొన్ని చోట్ల కొందరు వ్యక్తులు కలిసికట్టుగా లేదా ఒక్కరే వేలంపాట దక్కించుకొని ట్రిప్పుకు రూ.300 నుంచి రూ.500 వరకు అనధికారికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
భూగర్భ జలాలకు పెనుముప్పు...
నదులు, వాగులు తదితర వాటి నుంచి ఇసుకను తరలించడం ద్వారా భూగర్భజలాలకు ముప్పు వాటిల్లుతోందని చాలా చోట్ల వేలంపాటలు రద్దు చేశారు. అయితే ఇసుక అక్రమ రవాణాదారులు దీనిని ఆసరాగా చేసుకొని పెద్దఎత్తున ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నదిలో పెద్ద పెద్ద గోతులు తీస్తూ, నీళ్ల మధ్యలో నుంచి ఇసుక తీస్తుండడంతో భూగర్భజలాలు పడిపోయి సమీపంలోని పంటపొలాల్లో ఉన్న బోరుబావులు ఎండిపోయే పరిస్థితి తలెత్తుతోంది. గతంలో నిర్మల్ మండలం చిట్యాల్, మంజులాపూర్ శివారులో ఉన్న పంటపొలాల్లోని బోరుబావులు ఎండిపోవడంతో సంబంధిత రైతులు తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
జోరుగా ఇసుక రవాణా
Published Thu, May 1 2014 2:28 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement