తేలిక నేలల్లో వర్షాధారంగా పత్తి, సోయా వద్దు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. పూర్తిస్థాయి రుతుపవనాలు రాష్ర్ట్రంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి.రుతుపవనాలు ప్రవేశించే ముందు ప్రస్తుతం కురుస్తున్న స్వల్ప వర్షాలను ఉపయోగించి వర్షాధార పంటలను విత్తుకోకూడదు.వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సేకరించుకోవాలి.
వర్షాధారపు పంటలైన పత్తి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, సోయాచిక్కుడు తదితర పంటలను నేల పూర్తిగా తడిసిన తర్వాత అంటే.. వారం వ్యవధిలో 50-75 మి.మీ. వర్షపాతం నమోదైన తర్వాత లేదా 15 సెం. మీ. లోతు నేల తడిసిన తర్వాతనే విత్తుకోవాలి. పత్తి, సోయాచిక్కుడు పంటలను తేలిక నేలల్లో వర్షాధార పంటగా సాగు చేయకూడదు.
సోయాబీన్: ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జూన్ 15 నుంచి జూలై 15 వరకు సోయాబీన్ విత్తుకోవడానికి చాలా అనుకూలం.జె. ఎస్-335, జె.ఎస్-9305, బాసర, బీమ్ రకాలు సాగు చేసుకోవడాని కి అనువైనవి. ఎకరానికి 25-30 కిలోల విత్తనం అవసరమవుతుంద సోయాబీన్ విత్తనం తగిన మొలక శాతం ఉండడానికి గత ఖరీఫ్ లేదా రబీలో పండించిన విత్తనాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి.విత్తన నిల్వ, రవాణా సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. బస్తాలను ఎత్తుకునేటప్పుడు, దించుకునేటప్పుడు విత్తనంపై ఎటువంటి ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడాలి. రవాణా, నిల్వ సమయంలో బస్తాపైన బస్తా పెడితే అడుగు బస్తాలోని విత్తనం మొలక శాతం దెబ్బతింటుంది.
కొత్తగా సోయాబీన్ సాగు చేసే రైతులు తప్పనిసరిగా ప్రతి 8-10 కిలోల విత్తనానికి 200 గ్రా. రైజోబియం జపానికం కల్చరును కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవడం ద్వారా గాలిలోని నత్రజనిని భూమి స్థిరీకరించడమే కాకుండా దిగుబడి పెంచుకోవచ్చు.నల్లరేగడి భూముల్లో 45్ఠ5 సెం.మీ. దూరంలో చదరపు మీటరుకు 40 మొక్కల చొప్పున ఎకరాకు 1.6 లక్షల మొక్కలు ఉండేలా విత్తుకోవాలి.ఎకరాకు 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ చివరి దుక్కిలో వేయాలి. పైపాటుగా ఎకరానికి 20 కిలోల నత్రజనిని విత్తిన 30 రోజులకు అదనంగా వేయాలి.
విత్తే ముందు ఫ్లుక్లోరాలిన్ 45% ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి లేదా విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పెండిమిథాలిన్ 30% 1.4 లీ. పిచికారీ చేయాలి.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్