పత్తిలోని సూక్ష్మక్రిముల కారణంగా చర్మంపై వచ్చిన దద్దుర్లు
సాక్షి, హైదరాబాద్: రైతు కుటుంబాలను పత్తి వేధిస్తోంది. నిల్వ చేసిన పత్తి రోగాలకు కారణమవుతోంది. ఇళ్లలో నిల్వ చేసిన పత్తి చర్మ సమస్యలకు కారణమవుతోంది. పత్తి సాగు చేసే ప్రతి ఊరిలోనూ ఇప్పుడు ఈ సమస్య తీవ్రంగా ఉంది. నిల్వ పత్తిలో ఉండే సూక్ష్మక్రిములు గ్రామస్తులను అనారోగ్యంపాలు చేస్తున్నాయి. ఎండ తీవ్రత పెరిగి పొడిగాలి ఉండటంతో అలర్జీ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యుల దగ్గర పత్తి బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. అలర్జీ కారణంగా పిల్లలు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది పత్తి రైతులు ఉన్నారు. ప్రతి ఏటా సగటున 47 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. ఎక్కువమంది రైతులు పత్తి నిల్వవిషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలేదు. గతంలో పత్తిని బస్తాల్లో నింపి నిల్వ చేసేవారు. ప్రత్యేక గదుల్లో పెట్టేవారు. ఇప్పుడు ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ నిల్వ చేస్తున్నారు. నిల్వచేసిన పత్తిలో ఉండే సూక్ష్మ క్రిములు బయటికి రాకుండా చర్యలు తీసుకోవడంలేదు. దీంతో సూక్ష్మక్రిములు గాలిలో వ్యాపించి మనుషులను తాకుతున్నాయి. ఫలితంగా చర్మరోగాలు పెరుగుతున్నాయి. పత్తిలోని సూక్ష్మక్రిముల వల్ల అలర్జీ వస్తుందనే అవగాహన లేకపోవడంతో కొందరు వైద్యుల దగ్గరికి వెళ్లడంలేదు. మందులు వాడడంలేదు. చర్మవ్యాధులు తీవ్రమైతే ఆస్తమాకు దారి తీస్తుంది. పిల్లలలో శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు.
అనారోగ్య కారకం...
పత్తి పురుగులతో అలర్జీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితులు రోజూ పదుల సంఖ్యలో ఆస్పత్రికి వస్తున్నారు. పత్తిలో అలర్జీ కారక ఆనవాళ్లు ఉన్నాయి. పత్తిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం వల్ల అందులోని సూక్ష్మక్రిములు గాలిలో వ్యాపిస్తున్నాయి. సూక్ష్మక్రిములతో చర్మం ఎర్రబారడం, దురద, మంట వంటివి వస్తాయి. చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దురద వచ్చిన వెంటనే మందులు వాడాలి. లేకుంటే ఇతరులకు వ్యాపిస్తుంది.
– డాక్టర్ రాంచందర్ ధరక్, చర్మవ్యాధి నిపుణులు,కాకతీయ వైద్య కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment