'గులాబీ' గుబులు
అనంతపురం అగ్రికల్చర్ : ప్రత్తి పంటకు ఆశించిన గులాబీరంగు కాయతొలుచు పురుగు (పింక్‌బౌల్ వార్మ్) నవంబర్‌లో మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉన్నందున రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించి పంటను కాపాడుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్‌లో శాస్త్రవేత్తలు జరిపిన సర్వేలో ఈ పురుగు నవంబర్‌లో మరింత నష్టం కలిగించే పరిస్థితి ఉందని తేల్చారని తెలిపారు. గతేడాది సాగు చేసిన 78 వేల హెక్టార్ల పంటను ఈ పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరిచిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సారి కూడా ఇప్పటికే అక్కడక్కడా లక్షణాలు కనిపించినందున ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు పురుగు ఉధృతికి దోహదపడే ప్రమాదం ఉందన్నారు.
యాజమాన్య పద్ధతులు :
ఎకరాకు నాలుగు నుంచి ఆరు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. ఎకరా పొలంలో అక్కడక్కడా 50 పువ్వులు, మరో 20 కాయలను కోసి పురుగు ఉనికి, ఉధృతి గమనించాలి. లింగాకర్షక బుట్టల్లో వరుసగా మూడు రోజుల పాటు 8 వరకు రెక్కల పురుగు ఉన్నట్లు గమనించినా, అలాగే పది పూలు, పది కాయల్లో ఒక్కదాంట్లోనైనా గుడ్డిపూలు, గొంగలి పురుగు ఉంటే తక్షణ నివారణ చర్యలు చేపట్టాలి.
నివారణ చర్యలు :
పూత పిందె దశలో 5 శాతం వేపగింజల కషాయం లేదా 5 మి.లీ వేపనూనె ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో గులాబీరంగు పురుగు గ్రుడ్లను ఆశించే ట్రైకోగామా పరాన్న జీవులు ఎకరాకు 60 వేలు వారం రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా వదలాలి. పురుగు ఉధృతి తగ్గకపోతే 2 మి.లీ ప్రొపినోఫాస్ 50 ఈసీ లేదా 1.5 గ్రాములు థయోడికార్బ్ 75 డబుల్‌యపీ లేదా 2.5 మి.లీ క్వినాల్‌ఫాస్ 25 ఈసీ లేదా 2.5 మి.లీ క్లోరోఫైరిఫాస్ 20 ఈసీ ఒక లీటర్ నీటికి కలిపి వారం నుంచి పది రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు మందులను మార్చి పిచికారీ చేసుకుంటే గొంగలి పురుగు కాయలోపలికి వెళ్లకుండా నివారించుకోవచ్చు.