సాగుబడి
ఈ వారం వ్యవసాయ సూచనలు
ధాన్యం నిల్వలో మెలకువలు
మన రాష్ట్రంలో పండించే ఆహార ధాన్యాల లో 12-16 మిలియన్ టన్నుల ధాన్యాన్ని పంట కోసిన తర్వాత నష్టపోతున్నాం.వరి ధాన్యాన్ని నిల్వ చేసే ముందు గింజలో తేమ శాతం 14% ఉండే విధంగా చూసుకోవాలి. వేరుశనగ గింజల్లో తేమ 7% కన్నా తక్కువ ఉండేలా ఆరబెట్టాలి. నిల్వ ఉన్న పాత ధాన్యాన్ని కొత్త ధాన్యంతో కలపరాదు.గోదాముల్లో గతేడాది పంట తాలూకు మిగిలిన ధాన్యాన్ని తీసివేసి శుభ్రపరచుకోవాలి. ఒక లీటరు మలాథియాన్ మందును 100 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని గోదామంతా తడిచేలా పిచికారీ చేయాలి.పాత సంచులను వాడేటప్పుడు పాత ధాన్యం, క్రిమికీటకాలు లేకుండా వాటిని శుభ్రపరచి ఎండబెట్టాలి. వీలైనంత వరకు కొత్త సంచుల్లో ధాన్యం నిల్వ చేయాలి.ధాన్యం నింపిన బస్తాలను నేలకు, గోడలకు తగలకుండా, తేమలేని పొడి ప్రదేశంలో చెక్క బల్లల మీద నిల్వ చేయాలి.
100 కిలోల ధాన్యానికి, 2 కిలోల వేపగింజల పొడిని కలిపితే బియ్యపు చిలక తదితర పురుగులు ఆశించవు.గోదాములలోనికి తేమ చొరబడకుండా జాగ్రత్త వహించాలి.గోదాము నేలలు, గోడలు, పైకప్పులపై బీటలు లేకుండా చూడాలి.అపరాలను జనపనార సంచుల్లో గాని లేక పాలిథిన్ అమర్చిన గోనె సంచుల్లో గాని, నైలాన్ సంచుల్లో గాని నిలువ చేయాలి.గోదాముల్లో ఎలుక బోనులను ఉంచాలి. సంచుల్లోని గింజ వేడెక్కుతున్నదా, రంగు మారుతున్నదా, ముక్కవాసన వస్తున్నదా, బూజు పడుతున్నదా, అనే వివరాలను ప్రతి 15 రోజులకోసారి పరిశీలించి తగు చర్యలు చేపట్టాలి.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్