కర్నూలు (హాస్పిటల్): కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఓ అభ్యర్థి రాబోయే ఓటమిని జీర్ణించుకోలేక తెల్ల ఆవాలను పోలింగ్ కేంద్రాల్లో చల్లుతూ వెళ్లడం వివాదాస్పదమైంది. సాధారణంగా ఎవరిపైనైనా కోపంతో ఉన్నా, వారి నాశనాన్ని కోరుకున్నా మంత్రించిన తెల్ల ఆవాలను ప్రత్యర్థులు నివసించే ప్రాంతాలు, సంచరించే ప్రాంతాల్లో చల్లుతారని బ్రాహ్మణులు చెబుతారు. ఇలాంటి వాటిని బాగా నమ్మకున్న అధికార పార్టీకి చెందిన ఓ అభ్యర్థి ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. అతని తండ్రి ప్రస్తుత ప్రభుత్వంలో కీలక భూమిక కూడా పోషించారు. ఇప్పుడు ఆయన కుమారుడితో పాటు తమ్ముడు కూడా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గురువారం నిర్వహించిన పోలింగ్‌లో ప్రత్యర్థికి భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని ఆయనకు సంకేతాలు వచ్చాయి.
దీంతో ముందుగానే మంత్రించి తెచ్చుకున్న తెల్ల ఆవాలను జేబులో వేసుకుని ప్రతి పోలింగ్ కేంద్రంలో చల్లుకుంటూ వెళ్లాడు. ఇది చూసి ఓటర్లతో పాటు పోలింగ్ సిబ్బంది విస్తుపోయారు. ఈ విషయమై అవగాహన ఉన్న ఓ పోలింగ్ అధికారి అడ్డుకుని మందలించాడు. నీవు ఎవ్వరితైనేమి ఇలాంటి పనులు చేయకూడదు. ముందు బయటకు వెళ్లు అంటూ చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు అధికార పార్టీకి చెందిన అభ్యర్థి. ఈ విషయం ఆ నోటా...ఈ నోటా పాకి బాగా వైరల్ అయ్యింది. ఇలాంటి మూఢనమ్మకాలపై ఆధారపడుతూ పశ్చిమ ప్రాంతాన్ని మరింత వెనుకబాటుతనానికి గురిచేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment