మెచ్చారు... | Soups special story | Sakshi
Sakshi News home page

మెచ్చారు...

Published Sat, Dec 8 2018 12:15 AM | Last Updated on Sat, Dec 8 2018 12:15 AM

Soups special story - Sakshi

చారు అంటే మంచి అని అర్థం. మన చారు తమిళనాట రసమైంది.  ఆ రసమే ఊరూరూ తిరిగి మళ్లీ మన దగ్గరకొచ్చింది.షడ్రుచులూ పుణికిపుచ్చుకుంది... నవరసాలూరింది.అందుకే కాబోలు...ఘుమఘుమలాడే చారు వాసన తగిలితే చాలు అన్నం ఆవురావురంటుంది. అన్నట్టు ఈ చలికాలంలో ఎవరైనా అతిథి వస్తే ఏం చేయాలా అని తడుముకోవద్దు. ఇక్కడ మేమిచ్చిన రకరకాల చారుల్లో ఓ చారు కాచండి. ఆ చారుతో  కడుపు కాచుకుంటూనే వాళ్లు మిమ్మల్ని మెచ్చుతారు చూడండి...

కొబ్బరిపాల చారు
కావలసినవి:చింతపండు రసం కోసంచింతపండు – ఒక టేబుల్‌ స్పూను; వేడి నీళ్లు – అర కప్పుచారు కోసంనీళ్లు – ఒకటిన్నర కప్పులు; పసుపు – పావు టీ స్పూను; చారు పొడి – ఒక టేబుల్‌ స్పూనుచిక్కటి కొబ్బరి పాలు – ఒక కప్పు; ఉప్పు – తగినంతపోపు కోసంకొబ్బరి నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; పైన చల్లడానికి కొత్తిమీర – రెండు టేబుల్‌ స్పూన్లు

తయారీ:అర కప్పు వేడినీళ్లలో చింతపండును సుమారు అర గంటసేపు నానబెట్టాలి ∙చింతపండును గట్టిగా పిండి తీసేసి, రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేయాలి ∙పసుపు, చారు పొడి వేసి బాగా కలియబెట్టి స్టౌ మీద సన్నటి మంట మీద ఉంచి మరిగించాలి ∙బాగా మరిగిన తరవాత మంట ఆర్పేసి, కొబ్బరి పాలు జత చేసి బాగా కలపాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి ∙చిన్న బాణలిని స్టౌ మీద ఉంచి వేడి చేశాక, కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి దింపేయాలి ∙వేయించిన పోపును కొబ్బరి పాల చారులో వేసి కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ∙చివరగా కొత్తిమీర జత చేసి అన్నంలో వడ్డించాలి.

నిమ్మరసం – కొత్తిమీర చారు
కావలసినవి:నిమ్మ చెక్కలు – 2; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లుపోపు కోసం ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – రెండు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను

తయారీ:కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద పెద్ద పాత్ర ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరసగా వేసి దోరగా వేయించాలి ∙మూడు కప్పుల నీళ్లు, ఉప్పు, ఇంగువ, పసుపు, నిమ్మ చెక్కలు, కొత్తిమీర ముద్ద వేసి కలియబెట్టాలి ∙బాగా మరిగాక కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి.

పైనాపిల్‌ చారు
కావలసినవి:కందిపప్పు – పావు కప్పు; నీళ్లు – ముప్పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; పైనాపిల్‌ రసం కోసంపైనాపిల్‌ తురుము – ఒక కప్పు; తరిగిన టమాటా – 1; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; చారు పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత

పొడి చేయడానికి కావలసినవి: నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; ఎండుమిర్చి – 3; కరివేపాకు – మూడు రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను, మిరియాలు – 4, వెల్లుల్లి రేకలు – 2

 తయారీ:కందిపప్పును శుభ్రంగా కడిగి, ముప్పావు కప్పు నీళ్లు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి ∙చల్లారాక మెత్తగా మెదపాలి ∙జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రేకలను మిక్సీలో వేసి తిప్పాలి (మరీ మెత్తగా చేయకూడదు) ∙పైనాపిల్‌ ను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి (ఒక కప్పుడు పైనాపిల్‌ ముక్కలు ఉండాలి) ∙సగం ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙అదే మిక్సీ జార్‌లో ఒక టమాటా వేసి కొద్దిగా ముక్కలుగా ఉండేలా తిప్పాలి (చేతితో గట్టిగా చిదిమినా సరిపోతుంది) ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙జీలకర్ర + మిరియాల మిశ్రమం జత చేసి బాగా కలపాలి ∙కరివేపాకు, ఇంగువ వేసి మరోమారు కలపాలి ∙చిదిమిన టమాటా గుజ్జు జత చేసి రెండు మూడు నిమిషాలు కలపాలి ∙పైనాపిల్‌ గుజ్జు జత చేసి మరో రెండు నిమిషాలు బాగా కలియబెట్టాక, మెదిపిన పప్పు జత చేసి బాగా కలపాలి ∙పైనాపిల్‌ ముక్కలు, నీళ్లు జత చేసి మరిగించాలి ∙రెండు టీ స్పూన్ల చారు పొడి వేసి కలియబెట్టాలి ∙మంట బాగా తగ్గించి సుమారు పది నిమిషాలు మరిగించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వేడి అన్నంలో వడ్డించాలి ∙ఈ చారు బాగా ఆకలి పుట్టిస్తుంది.

బీట్‌రూట్‌ చారు
కావలసినవి:సన్నగా తరిగిన బీట్‌రూట్‌ ముక్కలు – అర కప్పు; నీళ్లు – తగినన్ని

పొడి చేయడానికి:జీలకర్ర – ఒక టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; ధనియాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి)బీట్‌రూట్‌ రసం కోసం...చింతపండు – ఒక టేబుల్‌ స్పూను; నువ్వుల నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – అర టీ స్పూనుఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూనుపసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంతకొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ:కుకర్‌లో బీట్‌రూట్‌ ముక్కలకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఆరు విజిల్స్‌ వచ్చేవరకు ఉంచి ఉడికించాలి ∙మిక్సీలో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండు మిర్చి వేసి కొంచెం రవ్వలా ఉండేలా పొడి చేసి తీసి పక్కన ఉంచాలి ∙అదే జార్‌లో ఉడికించిన నీళ్లతో కలిపిన బీట్‌రూట్‌ను నీళ్లతో మిక్సీ పట్టాలి ∙ చింతపండు జత చేసి మరోమారు మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ జత చేసి దోరగా వేగేవరకు మరోమారు కలియబెట్టాలి ∙మసాలా పొడి జతచేసి కలపాలి. బీట్‌రూట్‌ + చింతపండు గుజ్జు జత చేసి మరోమారు కలపాలి ∙రెండు కప్పుల నీళ్లు, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙(ఎక్కువ మరిగించకూడదు)వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.

మైసూర్‌ చారు
కావలసినవి:చారు పొడి కోసంనెయ్యి – 2 టీ  స్పూన్లు; ధనియాలు – ఒక టేబుల్‌ స్పూను; పచ్చి శనగ పప్పు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు
ఉడికించడానికికందిపప్పు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – ఒకటిన్నర కప్పులుచింతపండు గుజ్జు కోసంచింతపండు – నిమ్మకాయంత; వేడి నీళ్లు – అర కప్పు (చింతపండు నానబెట్టడానికి)మరిన్ని వస్తువులుపసుపు – పావు టీ స్పూను; టమాటా – 1 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); నీళ్లు – 2 కప్పులుఉప్పు – తగినంతపోపు కోసంనెయ్యి – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ:ముందుగా కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాక, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌ లో ఉంచి ఏడెనిమిది విజిల్స్‌ వచ్చాక దింపేయాలి ∙కొద్దిసేపయ్యాక మూత తీసి, పప్పును మెత్తగా మెదపాలి ∙చింతపండును వేడినీళ్లలో సుమారు అర గంట సేపు నానబెట్టాక, చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙పచ్చి శనగ పప్పు వేసి వేయించాలి ∙ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాక ఇంగువ, కరివేపాకు వేసి పదార్థాలన్నీ దోరగా వేగేవరకు కలపాలి ∙పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు బాగా వేయించి, దింపేయాలి ∙బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి (నీళ్లు కలపకూడదు). ఒక పాత్రలో చింతపండు రసం, రెండు కప్పుల నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙తరిగిన టమాటాలు జత చేయాలి ∙పసుపు వేసి బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టాలి ∙టమాటాలు బాగా మెత్తపడ్డాక, మైసూర్‌ మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టి, మరిగించాలి ∙స్టౌ మీద చిన్న బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙కరివేపాకు, ఎండుమిర్చి ఇంగువ వేసి దోరగా వేయించి తీసేసి, మరుగుతున్న చారులో వేసి కలియబెట్టి దింపేయాలి ∙చివరగా కొత్తిమీర వేసి కలపాలి ∙వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.

వెల్లుల్లి చారు
కావలసినవి:మిరియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి – మూడు రెబ్బలు; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)చింతపండు గుజ్జు కోసంనీళ్లు – అర కప్పు; చింతపండు – ఒక టేబుల్‌ స్పూనునువ్వుల నూనె – ఒక టేబుల్‌ స్పూనుఆవాలు – అర టీ స్పూనుమినప్పప్పు – అర టీ స్పూనుకరివేపాకు – రెండు రెమ్మలుఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)వెల్లుల్లి రెబ్బలు – 10 (చేతితో మెదపాలి)తరిగిన టమాటా – 1పసుపు – పావు టీ స్పూనుఇంగువ – పావు టీ స్పూనునీళ్లు – రెండు కప్పులుఉప్పు – తగినంతకొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ:చింతపండును తగినన్ని నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టి చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి ∙మిక్సీ జార్‌లో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి వేసి మిక్సీ పట్టి (మరీ మెత్తగా ఉండకూడదు) పక్కన ఉంచాలి ∙10 వెల్లుల్లి రేకలను తొక్క తీయకుండా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి ∙టమాటాలను సన్నగా తరిగి ఉంచుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ∙కరివేపాకు, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా తొక్కిన వెల్లుల్లి వరసగా వేసి వెల్లుల్లి గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి ∙టమాటా తరుగు, పసుపు, ఇంగువ జత చేసి, టమాటాలు మెత్తగా ఉడికేవరకు కలియబెట్టాలి ∙మిక్సీ పట్టిన రసం పొడి జత చేసి బాగా కలపాలి ∙చింతపండు రసం, రెండు కప్పుల నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి సుమారు ఆరు నిమిషాలు మరిగించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వేడివేడి అన్నంలో వడ్డించాలి ∙సూప్‌లా కూడా తీసుకోవచ్చు. 
సేకరణ: వైజయంతి పురాణపండ     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement