Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం.. | Millet Snacks Startup Know About Details Here | Sakshi
Sakshi News home page

Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం..

Published Tue, Nov 2 2021 11:36 AM | Last Updated on Tue, Nov 2 2021 5:35 PM

Millet Snacks Startup Know About Details Here - Sakshi

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4 ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు పిల్లల్లో 38% మందిలో పౌష్టికాహార లోపం వల్ల పెరుగుదల లోపించింది. 59% పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పిల్లలతో పాటు పెద్దల్లోనూ పౌష్టికాహార లోపం తీవ్రంగానే ఉంది. రోజువారీగా తినే ప్రధాన ఆహార పదార్థాలతోపాటు పౌష్టిక విలువలు లోపించిన చిరుతిళ్లు కూడా వీరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే చిరుతిళ్ల కన్నా మార్కెట్‌లో దొరికే ఆరోగ్యపరంగా నష్టదాయకమైన(జంక్‌) చిరుతిళ్లనే పిల్లలు.. ఆ మాటకొస్తే పెద్దలూ అంతే. 

జంక్‌ ఫుడ్‌కు చక్కని ప్రత్యామ్నాయం చిరుధాన్యాలతో తయారైన చిరుతిళ్లే అనటంలో సందేహం లేదు. ‘పౌష్టిక ధాన్యాలు’ (న్యూట్రి–సీరియల్స్‌)గా ప్రభుత్వం గుర్తించిన చిరుధాన్యాలలో ఖనిజ లవణాలు, బీకాంప్లెక్స్‌ విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం. 

హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌ అనుబంధ కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్‌) ప్రజలకు పౌష్టికాహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కృషి చేస్తోంది. ఐదేళ్ల క్రితం అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఐఐఎంఆర్‌ దేశంలోనే తొలి ‘న్యూట్రిహబ్‌’ను నెలకొల్పింది. చిరుధాన్యాలతో రుచికరమైన వందలాది వంటకాలు, చిరుతిళ్లను అత్యాధునిక పద్ధతుల్లో తయారు చేయటంపై ‘న్యూట్రిహబ్‌’ ఔత్సాహిక స్టార్టప్‌ సంస్థలకు శిక్షణతోపాటు సాంకేతికత విజ్ఞానాన్ని, ఆర్థిక తోడ్పాటును సైతం అందించి ప్రోత్సహిస్తున్నట్లు ఐఐఎంఆర్‌ డైరెక్టర్‌ డా. విలాస్‌ ఎ తొనపి తెలిపారు. 

న్యూట్రిహబ్‌ ద్వారా ఇప్పటికి మిల్లెట్స్‌తో రకరకాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయించటంపై 175 స్టార్టప్‌ సంస్థలకు మార్గదర్శనం చేసినట్లు న్యూట్రిహబ్‌ సీఈవో, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి. దయాకర్‌రావు చెప్పారు. వినూత్న ఉత్పత్తులతో ముందుకొచ్చి మార్కెట్‌లో దూసుకెళ్తున్న స్టార్టప్‌లలో కొన్నిటికి మహిళలే సారధులుగా ఉన్నారు. వీరిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఇటీవల ఐఐఎంఆర్‌ నిర్వహించిన న్యూట్రి–సీరియల్స్‌ భాగస్వాముల జాతీయ మెగా సమ్మేళనంలో అవార్డులు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలైన మిల్లెట్‌ మహిళల విజయగాథలు.. 

చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్‌ మైనింగ్‌! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట!

నెల రోజులు తింటే తేడా తెలుస్తుంది!
వరి, గోధుమలకు బదులు చిరుధాన్యాలను రోజుకు ఒక భోజనం చేస్తూ.. చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు (స్నాక్స్‌) తింటే జీవన శైలి జబ్బులతో బాధపడేవారు నెల రోజుల్లో ఆరోగ్యంలో మంచి మార్పును గమనించవచ్చు అని హైదరాబాద్‌ నివాసి అయిన డాక్టర్‌మందరపు సౌమ్య అంటున్నారు. ఆహార శుద్ధి రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి, ఆహార సాంకేతిక నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం కలిగిన ఆమె 120 రకాల ఆహారోత్పత్తుల ఫార్ములాలను రూపొందించారు. మూడేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ‘మిల్లెనోవా ఫుడ్స్‌’ పేరిట స్టార్టప్‌ సంస్థను నెలకొల్పారు. ఐఐఎంఆర్‌లోని న్యూట్రిహబ్‌ ద్వారా ఇంక్యుబేషన్‌ సేవలు పొందారు. 

పిల్లలు, పెద్దలు, వృద్ధులు తినదగిన ఆరోగ్యదాయకమైన చిరుధాన్య చిరుతిళ్ల ఫార్ములేషన్లకు రూపకల్పన చేశారు. చిరుధాన్యాలు, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలను కలిపి శాస్త్రీయ సమతులాహార ఫార్ములేషన్స్‌తో ప్రొటీన్‌ బార్, బ్రేక్‌ఫాస్ట్‌ బార్, ఇమ్యుటినిటీ బూస్టర్‌ బార్, స్పోర్ట్స్‌ ఎనర్జీ బార్‌లను రూపొందించారు. రైతుల నుంచి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి.. పోషకాలు సులువుగా జీర్ణమయ్యేందుకు ఎక్స్‌ట్రూజన్‌ టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నామని డా. సౌమ్య తెలిపారు. రూ. 1.41 కోట్ల పెట్టుబడి పెట్టారు. 

చదవండి: Wemmer Pan Killer: అతనో నరరూప రాక్షసుడు.. ఏ శిక్ష వేసినా తక్కువే..!

పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మూడో ఏడాదిలో రూ. 1.27 కోట్ల నికర లాభాన్ని ఆర్జించారు. ఐఐఎంఆర్‌ నుంచి ఉత్తమ మహిళా స్టార్టప్‌ అవార్డును అందుకున్నారు. సిఎఫ్‌టిఆర్‌ఐ నుంచి తొలి బెస్ట్‌ స్టార్టప్‌ అవార్డును, ఇక్రిశాట్‌ నుంచి స్మార్ట్‌ ఫుడ్‌ ఎంటర్‌ప్రైజ్‌ అవార్డుతో పాటు ఐఎస్‌బి–యాక్షన్‌ ఫర్‌ ఇండియా బెస్ట్‌ సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ టీ–హబ్‌లో ఎం.ఎస్‌.ఎం.ఈ. అసోసియేట్‌ గ్రోత్‌ సెక్రెటరీగా ఎంపికైన డా. సౌమ్య ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలదే భవిష్యత్తు అంటున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు డా.సౌమ్య. (79895 86619). https://millennova.com/

మహిళలకోసం ప్రత్యేక ఆహారోత్పత్తులు
బెంగళూరుకు చెందిన రుచిక భువాల్క వృత్తి రీత్యా సోషల్‌ టీచర్‌. కుటుంబం కోసం వరి, గోధుమలు లేని ఆరోగ్యదాయకమైన ఆహారం తయారు చేసే క్రమంలో ఆమె చిరుధాన్యాలపై దృష్టి సారించారు. చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకోవటంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించడంలో ప్రజలకు దోహపడాలన్న తపనతో ‘అర్బన్‌ మాంక్‌’ పేరిట స్టార్టప్‌ను నాలుగేళ్ల క్రితం నెలకొల్పారు. 

ఐఐఎంఆర్‌ న్యూట్రిహబ్‌ తోడ్పాటుతో చిరుధాన్యాల బియ్యం, పిండితోపాటు ఇడ్లీ /దోసెల పిండి, బిస్కెట్లు వంటి రోజువారీ అవసరమయ్యే 40 ఉత్పత్తులను అందిస్తూ పట్టణ ప్రాంత గృహిణుల మనసు చూరగొనటంలో రుచిక విజయం సాధించారు.  సేంద్రియ చిరుధాన్యాలతో 30–60 ఏళ్ల మధ్య మహిళల కోసం ప్రత్యేక ఆహారోత్పత్తులను అందిస్తూ మిల్లెట్‌ అమ్మగా ప్రసిద్ధి పొందారు. 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ కామర్స్‌ సైట్స్‌ ద్వారా విక్రయిస్తూ రూ. 2 కోట్ల వార్షిక టర్నోవర్‌ సాధించిన రుచిక.. ఐఐఎంఆర్‌ నుంచి బెస్ట్‌ ఎమర్జింగ్‌ స్టార్టప్‌ అవార్డును అందుకున్నారు. https://milletamma.com/

చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!!

ఆరోగ్యకరమైన చిరుతిళ్లు
పౌష్టిక విలువలు లేని జంక్‌ స్నాక్స్‌ నుంచి పిల్లలను రక్షించుకోవడం కోసం చిరుధాన్యాలతో చిరుతిళ్లను తయారు చేయటం ప్రారంభించారు హైదరాబాద్‌కు చెందిన డి.మాధవి, బి. దివ్యజ్యోతి. ప్రగతినగర్‌లోని ఎలీప్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో చిరుధాన్యాలతో రెడీ టు ఈట్‌ చిరుతిళ్ల ఉత్పత్తి కోసం చిరు పరిశ్రమను స్థాపించారు. రాగి కుకీస్, జోవార్‌ ఫ్లేక్స్‌ తయారీ కోసం ఐఐఎంఆర్‌ నుంచి టెక్నాలజీ తీసుకున్నారు. రాగి చోకో బాల్స్‌ తదితర ఉత్పత్తులను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. 

రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి గిట్టుబాటు ధర చెల్లించి చిరుధాన్యాలను నేరుగా కొనుగోలు చేస్తున్నారు. రూ. 1.04 కోట్ల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి మూడేళ్లలో 80% తిరిగి రాబట్టుకోగలిగారు. 9 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2017లోనే ఐఐఎంఆర్‌ నుంచి ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తల అవార్డును మాధవి, దివ్యజ్యోతి స్వీకరించారు. తాజాగా ఐఐఎంఆర్‌ కన్సొలేషన్‌ అవార్డును అందుకున్నారు. https://rigdamfoods.com/

చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే..

మిల్లెట్‌ మీల్‌ బాక్స్‌
హైదరాబాద్‌కు చెందిన వేముల అరుణ ఐదేళ్ల క్రితం శిక్షణ పొంది జొన్న లడ్డు, ఇడ్లీ, దోసెలు వంటి వంటకాలను విక్రయించడం ప్రారంభించారు. వివిధ సంస్థల్లో మధ్యాహ్న భోజనం (మీల్‌ బాక్స్‌) అందిస్తున్నారు. ప్రస్తుతానికి 8 రకాల చిరుధాన్య వంటకాలను అందిస్తున్నారు. ఐఐఎంఆర్‌ న్యూట్రిహబ్‌ తోడ్పాటుతో మరికొన్ని ఉత్పత్తులను జోడించబోతున్నామని అరుణ తెలిపారు. 

స్విగ్గి, జొమాటో తదితర ఆన్‌లైన్‌ పార్టనర్స్‌ ద్వారా రుచికరమైన చిరుధాన్య వంటకాలను కోరిందే తడవుగా ప్రజల ముంగిటకు అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె తెలిపారు. రూ. 2.5 లక్షల పెట్టుబడితో అరుణ చిరుధాన్యాల వంటశాలను  ప్రారంభించారు. ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు. రూ. 2.8 లక్షల ఆదాయం గడించారు. తాజాగా ఐఐఎంఆర్‌ నుంచి కన్సొలేషన్‌ అవార్డును అందుకున్నారు అరుణ.  vemulaaruna81@gmail.com

చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!

6న వేరుశనగ, కంది, ఉల్లిగడ్డ సాగుపై శిక్షణ
ప్రకృతి వ్యవసాయంలో వేరుశనగ, కంది, ఉల్లిగడ్డ సాగుపై ఈనెల 6 (శనివారం)న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతి పేట దగ్గర తన వ్యవసాయ క్షేత్రంలో ప్రముఖ రైతు శాస్త్రవేత్త గుడివాడ నాగరత్నం నాయుడుతోపాటు తాండూరు రైతు నారాయణ, నాగర్‌కర్నూలు రైతు రాజు రైతులకు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన వారు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. 
వివరాలకు.. 95538 25532.

7న బొప్పాయి, మునగ, అరటి సాగుపై శిక్షణ
గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్‌ రైతు శిక్షణా శిబిరంలో ఈ నెల 7 (ఆదివారం)న బొప్పాయి, మునగ, అరటి సాగుపై నందివెలుగు రైతు మీసాల రామకృష్ణ, ఉద్యాన సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి రైతులకు శిక్షణ ఇస్తారు. 
వివరాలకు.. 97053 83666.

60% రైతులు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా వ్యవసాయం చేస్తున్నారు. పంటలు సాగయ్యే విస్తీర్ణంలో 55% వర్షాధార ప్రాంతాల్లోనే ఉంది. భూతాపోన్నతి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్న రైతులు వీరు. అయితే, దేశ వ్యవసాయ బడ్జెట్‌లో 10% మాత్రమే ఈ ప్రాంతాలపై ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. ఫసల్‌ బీమా యోజన ఒక్కటే మెట్ట రైతును రక్షించలేదు. పంటల జీవవైవిధ్యం పెంపొందించాలి. 

– డాక్టర్‌ సబ్యసాచి దాస్, రీవైటలైజింగ్‌ రెయిన్‌ఫెడ్‌ అగ్రికల్చర్‌ నెట్‌వర్క్‌  

చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement