ఆరోగ్య సిరులు.. పోషకాహార లోపాన్ని నివారించే చిరుధాన్యాలు Establishment of millet missions in seven states including Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సిరులు.. పోషకాహార లోపాన్ని నివారించే చిరుధాన్యాలు

Published Tue, Feb 28 2023 2:36 AM

Establishment of millet missions in seven states including Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్యాన్ని పెంపొందించే చిరు ధాన్యాల (మిల్లెట్స్‌)ఉత్పత్తి పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలో ఏడు రాష్ట్రాలు మిల్లెట్‌ మిషన్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, అస్సోం, ఛత్తీస్‌గఢ్, కర్ణా­టక, తమిళనాడు ప్రభుత్వాలు మిల్లెట్‌ మిషన్లు ఏర్పాటు చేశాయని వివరించింది.

ఈ ఏడాది అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా జరుపు­కుం­టున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు చిరుధాన్యాల ఉత్పత్తిని, స్థానిక వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించినట్లు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చిరుధాన్యాల ఉత్పత్తి, డిమాండ్‌ను పెంచేందుకు రాష్ట్రాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపింది.

దేశంలో 170.67 లక్షల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో 4.64 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలో అత్యధికంగా చిరుధాన్యాలు పండించేంది భారతదేశంలోనే. భారతదేశంలోనే 41 శాతం చిరుధాన్యాలు పండిస్తున్నారు.

దేశవ్యాప్తంగా చిరు ధాన్యాల వేడుకలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంవత్సరం అంతా చిరుధాన్యాల వేడుకలను నిర్వహిస్తున్నాయి. 2023–24లో దేశాన్ని చిరుధాన్యాలకు గ్లోబల్‌ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాయి. మిల్లెట్స్‌ ఉత్పత్తి, డిమాండ్‌ పెంచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఉత్పాదకతను పెంచడం, వినియోగం, ఎగుమతి, విలువను బలోపేతం చేయడం, బ్రాండింగ్, సృష్టించడం వంటి వాటిపై దృష్టి పెట్టాయి. వీటి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెలవారీ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నాయి.

చిరుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన సాంకేతికత, మెరుగైన వ్యవసాయ పనిముట్లు, వనరులు, సీడ్‌ హబ్‌ల ఏర్పాటులో విషయంలో కేంద్రం రాష్ట్రాలకు సహకారం అందిస్తోంది. 2023–24 సంవత్సరమంతా కేంద్ర మంత్రిత్వ శాఖలు చిరుధాన్యాలతో కూడిన తినుబండారాలనే అందించనున్నాయి.

విమానాలు, రైళ్లలో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించనున్నారు. అన్ని బహిరంగ ప్రదేశాల్లో మిల్లెట్‌ వెండింగ్‌ మెషీన్లు ఏర్పాటు చేస్తారు. డిఫెన్స్‌ ఫుడ్‌ అండ్‌ రీసెర్చ్‌ ల్యాబ్, పోలీస్‌ ఫోర్స్‌ క్యాంటీన్లలోనూ చిరుధాన్యాల ఆహారాన్ని అందించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలు
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా మిల్లెట్‌ మిషన్‌ ఏర్పాటు చేసింది. చిరుధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. పోషకాహార లోపం నివారణకు చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది.

జగనన్న గోరుముద్దలో భాగంగా పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి మార్చి 2 నుంచి రాగి జావ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాదంతా చిరుధాన్యాల వేడుకలను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement