మంచి వ్యవసాయం పద్ధతులే మేలు! | Dr S K Dubey Director Call Good Agricultural Practices | Sakshi
Sakshi News home page

మంచి వ్యవసాయం పద్ధతులే మేలు! ఐసిఎఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ పిలుపు

Published Thu, Nov 16 2023 9:57 AM | Last Updated on Thu, Nov 16 2023 9:57 AM

Dr S K Dubey Director Call Good Agricultural Practices - Sakshi

ప్రసంగిస్తూన్న ఐసిఎఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎస్‌.సి. దూబే

సాక్షి, హైదరాబాద్‌: మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పురుగుమందులను తగుమాత్రంగా వినియోగిచడంతో పాటు పోషక విలువలతో కూడిన అధిక పంట దిగుబడులు తీసేందుకు మంచి వ్యవసాయ పద్ధతుల (గుడ్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీసెస్‌- జిఎపి)ను అనుసరించాల్సిన అవసరం ఉందని, ఇందుకు అనుగుణమైన కొత్త సాంకేతికతలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాలని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (సస్యరక్షణ, జీవభద్రత) డాక్టర్‌ ఎస్‌.సి. దూబే పిలుపునిచ్చారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని పిజెటిఎస్‌ఎయు ఆడిటోరియంలో ‘సస్యరక్షణ యాజమాన్యంలో నవ్యత, సుస్థిరత’ అనే అంశంపై నాలుగు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో డా. దూబే గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

భారతీయ సస్యరక్షణ శాస్త్రవేత్తల సంఘం (పిపిఎఐ) స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ఈ సమావేశంలో డా. దూబే ప్రసంగిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చీడపీడలు, తెగుళ్ల తీరుతెన్నుల్లో కూడా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, పురుగుమందుల వాడకాన్ని కనిష్టస్థాయికి తగ్గించే సరికొత్త సాంకేతికతలపై పరిశోధనలు చేపట్టాలన్నారు. నాణ్యమైన పరిశోధనా పత్రాల ద్వారా శాస్త్రవేత్తలు వ్యవసాయాభివృద్ధికి దోహదం చేయాలన్నారు. పాలకులు విధానాల రూపుకల్పనకు నేరుగా ఉపయోగపడేలా స్పష్టమైన సిఫారసులు అందించే శాస్త్రవేత్తల సదస్సుల వల్ల ప్రయోజనం చేకూరుతుందని డా. దూబే సూచించారు.


జ్యోతిప్రజ్వలనం చేస్తున్న పిజెటిఎస్‌ఎయు ఉపకులపతి ఎం. రఘునందనరావు. చిత్రంలో ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ ఉపకులపతి డా. ఆర్‌. శారద జయలక్ష్మి దేవి తదితరులు.

ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట​‍్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్‌ కులపతి, వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం. రఘునందనరావు ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణలు, సాంకేతికతలు ఏవైనా ఆహార భద్రత విషయంలో రాజీలేని రీతిలో ఉండాలన్నారు. భూసార క్షీణత, నీటికాలుష్యం వంటి సవాళ్లను ఎదుర్కొనేలా ప్రెసిసెషన్‌ అగ్రికల్చర్‌ పద్ధతులపై పరిశోధనలు చేపట్టాలని రఘునందనరావు శాస్త్రవేత్తలను కోరారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌. శారద జయలక్ష్మీ దేవి ప్రసంగిస్తూ వాతావరణ మార్పులకు తోడు రసాయనిక ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల పంటలతోపాటు మానవులు, పర్యావరణ ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోందన్నారు.

సస్యరక్షణలో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే పద్ధతులు, సాంకేతికతల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అవగాహన కొరవడటంతో 50% రైతులు నకిలీ పురుగుమందులను కొనుగోలు చేసి నష్టపోతున్నారని, అధికారులు చట్టబద్ధంగా నకిలీలను అరికట్టడంలో తాత్సారం చేస్తున్నారని ధనూక అగ్రిటెక్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ఆర్‌.జి. అగర్వాల్‌ అన్నారు. ఇంకా ఈ సదస్సులో జాతీయ జీవవైవిధ్య బోర్డు చైర్మన్‌ డా. అచలేంద్ర రెడ్డి, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర​బి. శరత్‌బాబు, శ్రీబయోటెక్‌ ఈస్థటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో డా. కెఆర్‌కె రెడ్డి, పిజెటిఎస్‌ఎయు మాజీ కులపతి డా. ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. పలువురు శాస్త్రవేత్తలకు జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు.

(చదవండి: సహకార స్వర్ణయుగం రానుందా?!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement