![Siddipetta district resident got first Rank in ICAR National Exam - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/28/ICAR-RANKER.jpg.webp?itok=vjwl0oxb)
పోషాద్రి
సాక్షి, హైదరాబాద్: జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) నిర్వహించిన నేషనల్ పీహెచ్‌డీ పుడ్ టెక్నాలజీ ప్రవేశ పరీక్షలో సిద్దిపేట్ జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్‌కు చెందిన అచ్చిన పోషాద్రి (34) మొదటి ర్యాంకు సాధించాడు. దీంతో పాటు జాతీయ డైరీ పరిశోధన సంస్థ నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలోనూ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పోషాద్రి జాతీయ పరీక్షలకు సిద్ధమవుతూ రెండు ప్రవేశ పరీక్షల్లోనూ దేశంలోనే ర్యాంకు సాధించారు.
ర్యాంకుల రారాజు పోషాద్రి...
2007లో ఐకార్ నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షలో కూడా పోషాద్రి మొదటి ర్యాంకు సాధించాడు. 2013లో ఐకార్‌లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. దేశంలో ఫుడ్ టెక్నాలజీ విభాగంలో నిర్వహించిన వివిధ పోటీ పరీక్షలలో మొదటి ర్యాంకు సాధించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పదేళ్లుగా వివిధ పరిశోధనలు చేశారు. పరిశోధన ఫలితాలు అంతర్జాతీయ జర్నల్స్‌లోనూ ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు 25 రీసెర్చ్ పేపర్స్, 2 పుస్తకాలు రాశారు. పోషాద్రి రాసిన హ్యాండ్ బుక్ ఫర్ పుడ్ టెక్నాలజీ పుస్తకం ఫుడ్ టెక్నాలజీ రంగంలో దేశంలోనే ఎక్కువగా విక్రయం జరిగింది. ఫుడ్ సైంటిస్ట్‌గా 15 కొత్తరకమైన ఆహార పదార్థాలను తయారుచేశాడు. గతంలో ఇక్రిశాట్‌లో శాస్త్రవేత్తగా పనిచేసినప్పుడు అక్కడ ఆహార పరిశోధన ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. చిరు ధాన్యాలు, జొన్నల నుంచి వివిధ రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేశారు.
ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న పోషాద్రి, గిరిజన ప్రాంతాలలో సుమారు 10 బహుళార్ధక ప్రయోజనాలున్న చిన్న సైజు మిల్లులు నెలకొల్పి గిరిజన కుటుంబాలకు నాణ్యమైన పోషక విలువలు గల ఆహార పదార్థాలను వారు పండించే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేసుకునే విధంగా తోడ్పాటు అందిస్తున్నారు. రాష్ట్రంలోని రైతులు, ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో స్టార్టప్స్ నెలకొల్పానుకునేవారికి పోషాద్రి సాంకేతిక సలహాలు ఇస్తున్నారు. ప్రైవేట్ రంగంలో పేరుమోసిన ఆహార సంస్థలైన నెస్లే, ఐటీసీ, ఎంటీఆర్ పుడ్స్, బాంబినో, బ్రిటానియా, ఓలం వంటి ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా ఆసక్తి చూపలేదు.
Comments
Please login to add a commentAdd a comment