రంపచోడవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): వ్యవసాయ పరిశోధనలు రైతులకు అండగా నిలుస్తున్నాయని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐసీఏఆర్) శాస్త్రవేత్త డాక్టర్ కె.క్రాంతి అన్నారు. పంటల్లో నెమటోడ్స్(నులిపురుగులు) నివారణపై పరిశోధనలు చేస్తున్న ఆమె.. ఆలిండియా కోఆర్డినేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రంపచోడవరం మండలం పెదపాడులో డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ రీసెర్చ్ స్టేషన్–కొవ్వూరు నిర్వహించిన ‘ఉద్యాన పంటలను ఆశించే నులిపురుగుల నివారణ అవగాహన’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
అనంతరం గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. దేశంలోని ఒకటి, రెండు రాష్ట్రాల్లో మినహా మిగతా అన్ని చోట్లా నెమటోడ్స్‌పై పరిశోధన సెంటర్లు ఉన్నాయని చెప్పారు. 1977 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో సర్వే చేసి హాట్‌స్పాట్‌లను గుర్తించి.. వాటి నివారణకు కృషి చేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు పంటలను పట్టిపీడిస్తున్న నెమటోడ్స్ నివారణకు 200 రకాల విధానాలను ఆవిష్కరించినట్లు వెల్లడించారు.
నెమటోడ్స్‌తో భారీగా నష్టం..
నెమటోడ్స్ మొక్కల వేర్లపై బుడిపెలుగా వస్తాయని.. ఇవి మొక్క పై భాగానికి నీరు వెళ్లకుండా అడ్డుకుంటాయని వివరించారు. దీంతో మొక్కలు ఎండిపోతాయని తెలిపారు. ఉద్యాన పంటల్లో రూట్ నెమటోడ్స్ ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పాలీహౌస్, షెడ్ నెట్‌లలో పెంచే కూరగాయ పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లుతోందని చెప్పారు.
పంజాబ్, హరియాణా, జమ్మూ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో రైతులు రూ.కోట్లు నష్టపోయారని తెలిపారు. ఉత్తర భారతదేశంలో నెమటోడ్స్ వల్ల 90 శాతం పంట నష్టం జరుగుతుండగా.. ఏపీ, తెలంగాణలో నష్టం 10 శాతంగా ఉందని చెప్పారు. వీటిని నివారించాలంటే.. ఉత్తర భారతదేశంలో అయితే మే, జూన్ నెలల్లో, దక్షిణ భారతదేశంలో ఏప్రిల్, మే నెలల్లో పాలీహౌస్‌లలో కొద్దిగా తడి ఉండేలా 25 మైక్రాన్ మందం కలిగిన పాలిథిన్ కవర్లు పరచాలని సూచించారు.
రెండు కేజీల బయో ఏజెంట్, పది గ్రాముల ఎఫ్‌ఐఎం పిచికారీ చేసి పాలీహౌస్‌ను మూసివేయాలన్నారు. క్రాప్‌కు ముందు రెండు నెలలపాటు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పంట మారి్పడి, కూరగాయల పంట మధ్యలో పూల మొక్కలు నాటడం ద్వారా కూడా వీటిని అడ్డుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment