పారిశ్రామికవేత్తలుగా ఎదగండి
Published Fri, Sep 30 2016 9:38 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
తాడేపల్లిగూడెం :
ఉద్యాన కోర్సులు పూర్తిచేసిన అనంతరం ఉద్యోగాల కోసం వెతుకులాడకుండా పరిశ్రమలు స్థాపించే దిశగా విద్యార్థులు ఆలోచన చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ( ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్రో సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మహాపాత్రో మాట్లాడుతూ ఉద్యాన రైతులు ఉద్యాన విభాగం నుంచి చాలా ఆశిస్తున్నారని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు ఎలా సాధించాలో వారికి చెప్పాలని అన్నారు. ఉద్యాన పంటల సాగులో యంత్రాల వినియోగం పెరిగిందని, జన్యుపరమైన రూపాంతరాలు అనేకం వచ్చాయని చెప్పారు. రైతులు ఉద్యాన పంటలను విస్తారంగా పండించడంతో పాటు మార్కెటింగ్, ఎగుమతులు చేయడం, మార్కెట్ బాగా లేనప్పుడు నిల్వ చేసుకోవడానికి వీలుగా ఐసీఏఆర్ నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నామన్నారు. ఉద్యాన డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలు పూర్తి చేసిన వారికి పట్టాలను ప్రదానం చేశారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ బీఎంసీ రెడ్డి వర్సిటీ ప్రగతిని వివరించారు.
Advertisement