
సాక్షి, న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర నిర్ణయించే అవకాశం రాష్ట్రాలకే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన 91వ కేంద్ర వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) పాలకమండలి సమావేశానికి హాజరై ఆయన ప్రసంగించారు. 2022 వరకు రైతుల ఆదాయం రెండింతలు చేయాలంటే ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆయా రాష్ట్రాల్లో ఉండే భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తి వ్యయంలో మార్పులుంటాయని, అందువల్ల రాష్ట్రాలకే కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారం ఇవ్వాలని కోరారు. ఆరేళ్లలో ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అనుకూల చర్యల ద్వారా ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఏడాది గతేడాదికన్నా 40.8% పెరుగుదలతో ఆహార ధాన్యాల ఉత్పత్తి 130 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనుందని వివరించారు.