ప్రకృతి సేద్య పితామహుడు సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్య పాఠాలతో స్ఫూర్తి పొంది, రసాయన మందుల వాడకానికి పూర్తిగా స్వస్తి పలికి, గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మామిడి రైతు మూల్పురి నాగవల్లేశ్వరరావు కృషి చక్కని ఫలితాన్నిస్తోంది. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కొర్లగుంటలోని తమ కుటుంబానికి చెందిన 100 ఎకరాల్లోని మామిడి, పామాయిల్‌తో పాటు అరటి తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీక్షగా చేస్తున్న ప్రకృతి సేద్యంతో పచ్చగా అలరారుతున్న మామిడి తోటలను స్వయంగా చూసి, వివరాలు తెలుసుకునేందుకు కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి. ప్రసాద్, రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షులు టి. విజయకుమార్ తదితర అధికారులతో కూడిన బృందం రైతు నాగవల్లేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించటం విశేషం.
నరికేద్దాం అనుకున్న తోట తిప్పుకుంది
నాలుగేళ్ల క్రితం ఈయనకున్న 10 ఎకరాల మామిడి తోటలోని చెట్లకు కొమ్మ ఎండు తెగులు ఆశించింది. తోటలో 35 ఏళ్ల వయస్సున్న కలెక్టర్ (తోతాపురి) రకం చెట్లు 165 ఉండగా, అందులో 90 చెట్లు వరకు కొమ్మల చివరి నుంచి ఎండుపోవడాన్ని రైతు గమనించారు. పరిసర ప్రాంతాల్లో అప్పటికే 200 ఎకరాల్లో మామిడి తోటలు ఎండుతెగులు కారణంగా తీసేశారు. దీంతో తాము కూడా దెబ్బతిన్న చెట్లన్నీ నరికేసి వేరే పంట వేసుకోవాలనుకున్నారు నాగవల్లేశ్వరరావు. అదే సమయంలో పాలేకర్ ప్రకృతి సేద్యం వీడియోలు చూసి ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేశారు.
చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!
అప్పటికే రైతుకు 30 ఆవులుండటంతో జీవామృతం, ఘన జీవామృతం, పశువుల ఎరువు, వేప పిండి, కొబ్బరి చెక్క తదితర వాటిని ఎండు తెగులు సోకిన మామిడి తోటకు ఉపయోగిస్తున్నారు. నాగవల్లేశ్వరరావు తన తోటలో ప్రతి మామిడి చెట్టుకు ఏడాదికి రెండు సార్లు (తొలకరి, పూత దశ) 30–40 కిలోల ఘనజీవామృతం వేస్తున్నారు. డిసెంబర్–జనవరి మధ్య చెట్టుకు 8 లీటర్ల చొప్పున 6 సార్లు ఇస్తున్నారు. దీంతో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండానే తెగులు తగ్గిపోయి చెట్లు బాగున్నాయి. రెండేళ్లలో పూర్తిగా కోలుకొని పుంజుకున్నాయి. వర్షాకాలంలో ఎలా ఉంటాయో, మండు వేసవిలో కూడా అదే విధంగా పచ్చగా ఉంటున్నాయి.
పర్యావరణానికి హాని చేయని సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూతాపోన్నతిని తగ్గించేందుకు కృషి చేస్తామని గ్లాస్కో వాతావరణ శిఖరాగ్ర సదస్సులో 45 దేశాల ప్రభుత్వాలు ప్రతిజ్ఞ చేశాయి. వ్యవసాయం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా విధానాలు మార్చుకుంటామని 26 దేశాలు విస్పష్టంగా సరికొత్త వాగ్దానాలు చేశాయి. ఈ దేశాల్లో భారత్ సహా కొలంబియా, వియత్నాం, జర్మనీ, ఘన, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇందుకు సహకరిస్తామని 95 కంపెనీలు కూడా ప్రకటించడం విశేషం.
ప్రతి ఏటా కాపు
ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాయకపోవడం మామిడి తోటల ప్రధాన లక్షణం. అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటంతో ప్రతి ఏటా కాపు వస్తుండటం గమనార్హం. ప్రతి ఏటా దాదాపు 100 టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. కాయలు కూడా ఎంతో నాణ్యతతో ఉంటున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేయక ముందు మామిడి తోట ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాసేది కాదు. అంతేగాకుండా కోతలు పూర్తయిన తరువాత చెట్లన్నీ చేవ కోల్పోయిన వాటిలాగా తయారయ్యేవి. దీంతో వాటికి పెద్ద మొత్తంలో రసాయన ఎరువులు వేయాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన తరువాత వర్షాకాలంలో ఎలా ఉండేవో, వేసవిలో కూడా అంతే పచ్చగా ఉంటున్నాయి.
– ఉమ్మా రవీంద్రకుమార్ రెడ్డి,
సాక్షి, నూజివీడు, కృష్ణా జిల్లా.
ఎండు తెగులు మటుమాయం
ప్రకృతి వ్యవసాయం వల్ల ఎంతో మేలు ఉంది. రెండేళ్లలో ఒక్క రసాయన పురుగు మందు పిచికారీ చేయకుండానే ఎండుతెగులు మటుమాయమైంది. మామిడి చెట్ల జీవిత కాలం సైతం పెరుగుతుంది. భూమిలో సారం కూడా పెరిగింది. మామిడిలో చేసిన ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు రావడంతో మా అన్నదమ్ములకున్న వంద ఎకరాల్లోని పామాయిల్, అరటితో పాటు ఇతర పంటల్లో సైతం ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతూ ఆచరిస్తే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. రెండు ఆవులుంటే ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు.
– మూల్పూరి నాగవల్లేశ్వరరావు
(నాని– 94916 99369),
మామిడి రైతు, కొర్లగుంట,
ముసునూరు మం.,
కృష్ణా జిల్లా.
ప్రకృతి వ్యవసాయం స్ఫూర్తిదాయకం
వేపను ఆశిస్తున్న డైబ్యాక్ డిసీజ్‌కు.. మామిడిలో ఎండు పుల్ల తెగులుకు సంబంధం లేదు. నీరు నిల్వ ఉండటం, ఇన్ఫెక్షన్‌కు గురవ్వటం వల్ల మామిడి తోటలకు ఈ సమస్య వస్తోంది. శ్రద్ధగా చర్యలు తీసుకుంటే మామిడి తోటలకు ముప్పు ఉండదు. నాగవల్లేశ్వరరావు చాలా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తోటను రక్షించుకోవటం రైతాంగానికి స్ఫూర్తిదాయకం. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలున్నాయి.
రైతులు మామిడికి పూత మొదలైన దగ్గర నుంచి పిందె ఏర్పడే వరకు దాదాపు 6 నుంచి 10 సార్లు రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల కాయలో రసాయన మందుల అవశేషాలుండటంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి పనికిరావడం లేదు. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదు. ఈ కాయలను తిన్న ప్రజలు దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రకృతి సేద్యం చేసినట్లయితే కాయల నాణ్యత బాగుండటంతోపాటు రుచి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రైతులను ప్రకృతి సేద్యం సాగు వైపు దృష్టిసారించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– చొప్పర శ్రీనివాసులు (79950 86773),
ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు, నూజివీడు.
సేంద్రియ సేద్యంలో సస్యరక్షణపై సర్టిఫికెట్ కోర్సు
రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు, చీడపీడల నియంత్రణపై రైతులు, వృత్తి నిపుణుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని (కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ అనుబంధ సంస్థ) జాతీయ పంటమొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం.) ‘సేంద్రియ సేద్యంలో సస్యరక్షణపై సర్టిఫికెట్ కోర్సు’ను ప్రారంభించింది. గ్రామీణ యువతకు సేంద్రియ వ్యవసాయంలో నైపుణ్యాలను పెంపొందిండం, గ్రామస్థాయిలో రైతులను పెద్ద సంఖ్యలో సేంద్రియ సేద్యంపై శిక్షణ ఇప్పించేందుకు మాస్టర్ ట్రైనర్లను తయారు చేయటం, సేంద్రియ రైతులు, సేంద్రియ ఉత్పత్తుల విక్రేతల్లో సేంద్రియ సర్టిఫికేషన్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ ఆర్ధిక విషయాల విశ్లేషణలో నైపుణ్యాలను పెంపొందించడమే ఈ సర్టిఫికెట్ కోర్సు లక్ష్యమని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. డైరెక్టర్ జనరల్ డా. సాగర్ హనుమాన్ సింగ్ తెలిపారు.
ఈ సంవత్సరం డిసెంబర్ 6 నుంచి 91 రోజుల పాటు మూడు విడతలుగా సర్టిఫికెట్ కోర్సు తరగతులను నిర్వహిస్తారు. మొదటి 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో రెసిడెన్షియల్ కార్యక్రమంలో సేంద్రియ సేద్యంలో ప్రాధమిక అంశాలపై తరగతులు నిర్వహిస్తారు. తర్వాత 60 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మక ప్రాజెక్టు ద్వారా సేంద్రియ పంటలు సాగు చేయిస్తూ శిక్షణ ఇస్తారు. చివరి 10 రోజులు ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో సింహావలోకనం, తుది శిక్షణ వచ్చే ఏడాది మార్చి 23 వరకు వుంటుంది. 25 మందికి ప్రవేశం. ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి తర్వాత వ్యవసాయంలో డిప్లొమా పూర్తి చేసిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఫీజు రూ. 6 వేలు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో వసతి ఉచితం. భోజన ఖర్చులను అభ్యర్థులే భరించాలి. మీరట్‌లోని ఐఐఎఫ్‌ఎస్‌ఆర్, ఘజియాబాద్‌లోని ఎన్‌సిఓఎఫ్, మేనేజ్ తదితర జాతీయ సంస్థల నుంచి వచ్చే నిపుణులు శిక్షణ ఇస్తారు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. వెబ్‌సైట్‌లో నిర్దేశించిన ఫార్మట్‌లో దరఖాస్తును పూర్తి చేసి ఈ అడ్రస్‌కు మెయిల్ చెయ్యాలి.. dirphmniphm-ap@nic.in
ఇతర వివరాలకు..
కోర్సు కోఆర్డినేటర్ డా. శ్రీలత – 90103 27879,
అసోసియేట్ కోర్సు కోఆర్డినేటర్ డా. దామోదరాచారి – 95426 38020.
అనంతపురం జిల్లాలో 14, 15 తేదీల్లో డా. ఖాదర్ సభలు
‘సిరిధాన్య సాగు – రైతు బాగు’ సిరీస్‌లో భాగంగా అనంతపురం జిల్లాలో ఈ నెల 14, 15 తేదీల్లో ప్రముఖ స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి అనంత ఆదరణ మిల్లెట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగే పలు సభల్లో ప్రసంగించనున్నారు. ప్రవేశం ఉచితం. 14వ (ఆదివారం) తేదీ ఉ. 10 గం.కు అనంతపురం జిల్లా నల్లమాడలోని ఆర్.డి.టి. కార్యాలయంలో మహిళాభివృద్ధి సొసైటీ నిర్వహణలో ‘కంపెనీ వ్యవసాయానికి స్వస్తి–సహకార వ్యవసాయానికి పంక్తి’ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 94408 00632. 14వ (ఆదివారం) తేదీ సా. 5 గం.కు అనంతపురం లలిత కళా పరిషత్‌లో అనంత నగరాభివృద్ధి వేదిక, అనంత ఆదరణ ఎఫ్.పి.ఓ. ఆధ్వర్యంలో జరిగే సభలో ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 94405 21709.
15వ (సోమవారం) తేదీ ఉ. 10 గం.కు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఎ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 91001 02809.15వ (సోమవారం) సా. 4 గం.కు అనంతపురం రాయల్ నగర్‌లోని ఈడిగ భవనంలో ‘సెర’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యలలో ‘ఈత వనం సాగు – గీత కార్మికుడి బాగు’ అనే అంశంపై అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 92464 77103. అందరూ ఆహ్వానితులే.
చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment