Rot
-
ఎండు తెగులుతో దెబ్బతిన్న మామిడి తోటను ప్రకృతి సేద్యంతో రక్షించాడిలా..!
ప్రకృతి సేద్య పితామహుడు సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్య పాఠాలతో స్ఫూర్తి పొంది, రసాయన మందుల వాడకానికి పూర్తిగా స్వస్తి పలికి, గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మామిడి రైతు మూల్పురి నాగవల్లేశ్వరరావు కృషి చక్కని ఫలితాన్నిస్తోంది. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కొర్లగుంటలోని తమ కుటుంబానికి చెందిన 100 ఎకరాల్లోని మామిడి, పామాయిల్‌తో పాటు అరటి తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీక్షగా చేస్తున్న ప్రకృతి సేద్యంతో పచ్చగా అలరారుతున్న మామిడి తోటలను స్వయంగా చూసి, వివరాలు తెలుసుకునేందుకు కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి. ప్రసాద్, రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షులు టి. విజయకుమార్ తదితర అధికారులతో కూడిన బృందం రైతు నాగవల్లేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించటం విశేషం. నరికేద్దాం అనుకున్న తోట తిప్పుకుంది నాలుగేళ్ల క్రితం ఈయనకున్న 10 ఎకరాల మామిడి తోటలోని చెట్లకు కొమ్మ ఎండు తెగులు ఆశించింది. తోటలో 35 ఏళ్ల వయస్సున్న కలెక్టర్ (తోతాపురి) రకం చెట్లు 165 ఉండగా, అందులో 90 చెట్లు వరకు కొమ్మల చివరి నుంచి ఎండుపోవడాన్ని రైతు గమనించారు. పరిసర ప్రాంతాల్లో అప్పటికే 200 ఎకరాల్లో మామిడి తోటలు ఎండుతెగులు కారణంగా తీసేశారు. దీంతో తాము కూడా దెబ్బతిన్న చెట్లన్నీ నరికేసి వేరే పంట వేసుకోవాలనుకున్నారు నాగవల్లేశ్వరరావు. అదే సమయంలో పాలేకర్ ప్రకృతి సేద్యం వీడియోలు చూసి ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేశారు. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! అప్పటికే రైతుకు 30 ఆవులుండటంతో జీవామృతం, ఘన జీవామృతం, పశువుల ఎరువు, వేప పిండి, కొబ్బరి చెక్క తదితర వాటిని ఎండు తెగులు సోకిన మామిడి తోటకు ఉపయోగిస్తున్నారు. నాగవల్లేశ్వరరావు తన తోటలో ప్రతి మామిడి చెట్టుకు ఏడాదికి రెండు సార్లు (తొలకరి, పూత దశ) 30–40 కిలోల ఘనజీవామృతం వేస్తున్నారు. డిసెంబర్–జనవరి మధ్య చెట్టుకు 8 లీటర్ల చొప్పున 6 సార్లు ఇస్తున్నారు. దీంతో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండానే తెగులు తగ్గిపోయి చెట్లు బాగున్నాయి. రెండేళ్లలో పూర్తిగా కోలుకొని పుంజుకున్నాయి. వర్షాకాలంలో ఎలా ఉంటాయో, మండు వేసవిలో కూడా అదే విధంగా పచ్చగా ఉంటున్నాయి. పర్యావరణానికి హాని చేయని సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూతాపోన్నతిని తగ్గించేందుకు కృషి చేస్తామని గ్లాస్కో వాతావరణ శిఖరాగ్ర సదస్సులో 45 దేశాల ప్రభుత్వాలు ప్రతిజ్ఞ చేశాయి. వ్యవసాయం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా విధానాలు మార్చుకుంటామని 26 దేశాలు విస్పష్టంగా సరికొత్త వాగ్దానాలు చేశాయి. ఈ దేశాల్లో భారత్ సహా కొలంబియా, వియత్నాం, జర్మనీ, ఘన, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇందుకు సహకరిస్తామని 95 కంపెనీలు కూడా ప్రకటించడం విశేషం. ప్రతి ఏటా కాపు ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాయకపోవడం మామిడి తోటల ప్రధాన లక్షణం. అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటంతో ప్రతి ఏటా కాపు వస్తుండటం గమనార్హం. ప్రతి ఏటా దాదాపు 100 టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. కాయలు కూడా ఎంతో నాణ్యతతో ఉంటున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేయక ముందు మామిడి తోట ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాసేది కాదు. అంతేగాకుండా కోతలు పూర్తయిన తరువాత చెట్లన్నీ చేవ కోల్పోయిన వాటిలాగా తయారయ్యేవి. దీంతో వాటికి పెద్ద మొత్తంలో రసాయన ఎరువులు వేయాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన తరువాత వర్షాకాలంలో ఎలా ఉండేవో, వేసవిలో కూడా అంతే పచ్చగా ఉంటున్నాయి. – ఉమ్మా రవీంద్రకుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు, కృష్ణా జిల్లా. ఎండు తెగులు మటుమాయం ప్రకృతి వ్యవసాయం వల్ల ఎంతో మేలు ఉంది. రెండేళ్లలో ఒక్క రసాయన పురుగు మందు పిచికారీ చేయకుండానే ఎండుతెగులు మటుమాయమైంది. మామిడి చెట్ల జీవిత కాలం సైతం పెరుగుతుంది. భూమిలో సారం కూడా పెరిగింది. మామిడిలో చేసిన ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు రావడంతో మా అన్నదమ్ములకున్న వంద ఎకరాల్లోని పామాయిల్, అరటితో పాటు ఇతర పంటల్లో సైతం ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతూ ఆచరిస్తే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. రెండు ఆవులుంటే ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. – మూల్పూరి నాగవల్లేశ్వరరావు (నాని– 94916 99369), మామిడి రైతు, కొర్లగుంట, ముసునూరు మం., కృష్ణా జిల్లా. ప్రకృతి వ్యవసాయం స్ఫూర్తిదాయకం వేపను ఆశిస్తున్న డైబ్యాక్ డిసీజ్‌కు.. మామిడిలో ఎండు పుల్ల తెగులుకు సంబంధం లేదు. నీరు నిల్వ ఉండటం, ఇన్ఫెక్షన్కు గురవ్వటం వల్ల మామిడి తోటలకు ఈ సమస్య వస్తోంది. శ్రద్ధగా చర్యలు తీసుకుంటే మామిడి తోటలకు ముప్పు ఉండదు. నాగవల్లేశ్వరరావు చాలా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తోటను రక్షించుకోవటం రైతాంగానికి స్ఫూర్తిదాయకం. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలున్నాయి. రైతులు మామిడికి పూత మొదలైన దగ్గర నుంచి పిందె ఏర్పడే వరకు దాదాపు 6 నుంచి 10 సార్లు రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల కాయలో రసాయన మందుల అవశేషాలుండటంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి పనికిరావడం లేదు. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదు. ఈ కాయలను తిన్న ప్రజలు దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రకృతి సేద్యం చేసినట్లయితే కాయల నాణ్యత బాగుండటంతోపాటు రుచి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రైతులను ప్రకృతి సేద్యం సాగు వైపు దృష్టిసారించేలా చర్యలు తీసుకుంటున్నాం. – చొప్పర శ్రీనివాసులు (79950 86773), ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు, నూజివీడు. సేంద్రియ సేద్యంలో సస్యరక్షణపై సర్టిఫికెట్ కోర్సు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు, చీడపీడల నియంత్రణపై రైతులు, వృత్తి నిపుణుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని (కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ అనుబంధ సంస్థ) జాతీయ పంటమొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం.) ‘సేంద్రియ సేద్యంలో సస్యరక్షణపై సర్టిఫికెట్ కోర్సు’ను ప్రారంభించింది. గ్రామీణ యువతకు సేంద్రియ వ్యవసాయంలో నైపుణ్యాలను పెంపొందిండం, గ్రామస్థాయిలో రైతులను పెద్ద సంఖ్యలో సేంద్రియ సేద్యంపై శిక్షణ ఇప్పించేందుకు మాస్టర్ ట్రైనర్లను తయారు చేయటం, సేంద్రియ రైతులు, సేంద్రియ ఉత్పత్తుల విక్రేతల్లో సేంద్రియ సర్టిఫికేషన్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ ఆర్ధిక విషయాల విశ్లేషణలో నైపుణ్యాలను పెంపొందించడమే ఈ సర్టిఫికెట్ కోర్సు లక్ష్యమని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. డైరెక్టర్ జనరల్ డా. సాగర్ హనుమాన్ సింగ్ తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 6 నుంచి 91 రోజుల పాటు మూడు విడతలుగా సర్టిఫికెట్ కోర్సు తరగతులను నిర్వహిస్తారు. మొదటి 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో రెసిడెన్షియల్ కార్యక్రమంలో సేంద్రియ సేద్యంలో ప్రాధమిక అంశాలపై తరగతులు నిర్వహిస్తారు. తర్వాత 60 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మక ప్రాజెక్టు ద్వారా సేంద్రియ పంటలు సాగు చేయిస్తూ శిక్షణ ఇస్తారు. చివరి 10 రోజులు ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో సింహావలోకనం, తుది శిక్షణ వచ్చే ఏడాది మార్చి 23 వరకు వుంటుంది. 25 మందికి ప్రవేశం. ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి తర్వాత వ్యవసాయంలో డిప్లొమా పూర్తి చేసిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఫీజు రూ. 6 వేలు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో వసతి ఉచితం. భోజన ఖర్చులను అభ్యర్థులే భరించాలి. మీరట్‌లోని ఐఐఎఫ్‌ఎస్‌ఆర్, ఘజియాబాద్‌లోని ఎన్సిఓఎఫ్, మేనేజ్ తదితర జాతీయ సంస్థల నుంచి వచ్చే నిపుణులు శిక్షణ ఇస్తారు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. వెబ్సైట్లో నిర్దేశించిన ఫార్మట్‌లో దరఖాస్తును పూర్తి చేసి ఈ అడ్రస్‌కు మెయిల్ చెయ్యాలి.. dirphmniphm-ap@nic.in ఇతర వివరాలకు.. కోర్సు కోఆర్డినేటర్ డా. శ్రీలత – 90103 27879, అసోసియేట్ కోర్సు కోఆర్డినేటర్ డా. దామోదరాచారి – 95426 38020. అనంతపురం జిల్లాలో 14, 15 తేదీల్లో డా. ఖాదర్ సభలు ‘సిరిధాన్య సాగు – రైతు బాగు’ సిరీస్‌లో భాగంగా అనంతపురం జిల్లాలో ఈ నెల 14, 15 తేదీల్లో ప్రముఖ స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి అనంత ఆదరణ మిల్లెట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగే పలు సభల్లో ప్రసంగించనున్నారు. ప్రవేశం ఉచితం. 14వ (ఆదివారం) తేదీ ఉ. 10 గం.కు అనంతపురం జిల్లా నల్లమాడలోని ఆర్.డి.టి. కార్యాలయంలో మహిళాభివృద్ధి సొసైటీ నిర్వహణలో ‘కంపెనీ వ్యవసాయానికి స్వస్తి–సహకార వ్యవసాయానికి పంక్తి’ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 94408 00632. 14వ (ఆదివారం) తేదీ సా. 5 గం.కు అనంతపురం లలిత కళా పరిషత్‌లో అనంత నగరాభివృద్ధి వేదిక, అనంత ఆదరణ ఎఫ్.పి.ఓ. ఆధ్వర్యంలో జరిగే సభలో ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 94405 21709. 15వ (సోమవారం) తేదీ ఉ. 10 గం.కు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఎ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 91001 02809.15వ (సోమవారం) సా. 4 గం.కు అనంతపురం రాయల్ నగర్‌లోని ఈడిగ భవనంలో ‘సెర’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యలలో ‘ఈత వనం సాగు – గీత కార్మికుడి బాగు’ అనే అంశంపై అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 92464 77103. అందరూ ఆహ్వానితులే. చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే.. -
జీ9 అరటికి ‘పనామా’ముప్పు!
అరటి సాగుకు ’పనామా తెగులు’ గొడ్డలిపెట్టుగా మారింది. మట్టి ద్వారా వ్యాపించే ఈ శిలీంధ్రపు తెగులు అరటి పంటను ప్రపంచవ్యాప్తంగా తుడిచి పెట్టేస్తోంది. పనామా తెగులులో ఒక రకం (టిఆర్1) మన అమృతపాణి అరటి రకాన్ని ఇప్పటికే తుడిచి పెట్టేసింది. ఇప్పుడు గ్రాండ్ నైన్ (జీ9) వంతు వచ్చింది. మూడేళ్ళుగా బీహార్, మరో మూడు రాష్ట్రాల్లో పనామా తెగులు మరో రకం (టిఆర్4) జీ9 అరటి తోటలను తీవ్రంగా నష్టపరుస్తోంది. ఇటీవలే శాస్త్రవేత్తలు జీవ శిలీంధ్రనాశినిని తయారు చేశారు. అయినప్పటికీ మన రాష్ట్రాల్లోకి ఇది రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, బీహార్ నుంచి కంద పిలకలు తెచ్చుకోవటం మానుకోవాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది. ప్రాచీన కాలం నుంచి మన దేశంలో విరివిగా పండిస్తున్న సాంప్రదాయ పరంగా ప్రాముఖ్యత కలిగిన పండ్లతోట అరటి. అరటిని పండించే దేశాల్లో మన దేశం ముందుండడమే కాకుండా ఇంచుమించు 30 శాతం ప్రపంచ అరటి ఉత్పత్తిని కలిగి ఉంటుంది. మన దేశ అరటి సుమారు 884 వేల హెక్టార్లలో సాగు చేయబడుతూ, 30 మిలియన్ టన్నుల దిగుబడిని కలిగి ఉంటుంది. దేశంలో అరటిని సాగుచేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనది. మన రాష్ట్రంలో సుమారు లక్ష హెక్టార్లలో సాగు చేయబడుతూ, 5 మిలియన్ మెట్రిక్ టన్నుల దిగుబడిని కలిగి ఉంది. ఉభయ గోదావరి, ఇతర కోస్తా జిల్లాలతో పాటు, ఆధునిక సేద్య విధానంతో ఈ మధ్య కాలంలో రాయలసీమలోని కడప, అనంతపురం జిల్లాల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేసి అధిక దిగుబడులను రైతులు సాధిస్తున్నారు. భారతదేశంలో సుమారు 20 అరటి రకాలు సాగులో ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రధానంగా సాగులో ఉన్న అరటి రకాలు కావెండిష్ (గ్రాండ్నైన్), అమృతపాణి, తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, సుగంధాలు, కూర రకాలైన కొవ్వూరు బొంత. అరటిలో దిగుబడులు తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం అరటిని ఆశిస్తున్న తెగుళ్లు. వీటిలో ముఖ్యమైనది పనామా/ ఫ్యుజేరియం తెగులు (రేస్–1). ఈ తెగులును ఫ్యుజేరియం ఆక్సీస్పోరమ్ ఫార్మాస్పీసిస్ కుబెన్స్ అనే నేలలో నివసించే శిలీంధ్రం కలుగజేస్తుంది. ఈ రేస్–1 పనామా తెగులు వల్ల మన రాష్ట్ర రైతులు ఇష్టంగా సాగుచేసే అమృతపాణి రకం తుడిచిపెట్టుకుపోయింది/ సాగులో లేకుండా పోయింది. రైతులు ఇతర రకాలైన గ్రాండ్నైన్, తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, మార్టమాన్ వంటి రకాలను సాగుచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో దేశంలోని అరటి పంటను నష్టపరుస్తున్న సమస్య: ట్రోపికల్ రేస్ 4 (టీఆర్ 4) వల్ల కలిగే పనామా/ ఫ్యుజేరియం తెగులు. ఈ తెగులు గ్రాండ్నైన్ రకాన్ని ఎక్కువగా ఆశించి నష్టపరచడమే కాకుండా ఇతర రకాలైన అమృతపాణి, కూర అరటిని కూడా ఆశిస్తుంది. పనామా తెగులును కలిగించే ఫ్యుజేరియం శిలీంధ్రంలో నాలుగు రకాల రేస్‌లు ఉన్నాయి. ఇందులో మూడు రకాలు అరటిని ఆశించి నష్టపరుస్తాయి. రేస్–1 అనేది అమృతపాణి వంటి అరటి రకాలను ఆశిస్తుంది. రేస్–2 కూర అరటిని ఆశిస్తుంది. రేస్–3 హెలికోనియా పుష్పాలను ఆశిస్తుంది. రేస్–4 గ్రాండ్నైన్ రకాలతో పాటు పైన వివరించిన అమృతపాణి, కూర రకాలను కూడా ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. దేశవ్యాప్తంగా పండించే అరటి రకాల్లో ఈ గ్రాండ్నైన్ రకం 55 నుంచి 60 శాతం సాగుచేస్తున్నారు. కాబట్టి ఈ తెగులు ఉనికి ప్రమాదకరంగా పరిణమించింది. టీఆర్–4 అనే ఈ పనామా తెగులు ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో గమనించడం జరిగింది. 2016–17 సంవత్సరాల్లో బిహార్‌లోని పూర్ణియ, కటిహార్ జిల్లాల్లో మొదటగా గుర్తించారు. దీనిని టీఆర్–4గా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా (ఎన్ఆర్సీబీ) తిరుచ్చిరాపల్లి శాస్త్రవేత్తలు దృవీకరించడం జరిగింది. క్రమంగా ఈ సమస్యను బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో గమనించారు. అయితే మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ టీఆర్–4 పనామా తెగులు ఉనికిని గమనించలేదు. డా. వైఎస్ఆర్హెచ్ఓ, హెచ్ఆర్ఎస్, కొవ్వూరు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఈ తెగులు గురించి సర్వేలను చేపడుతున్నారు. రైతులు ఈ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, సమస్యపైన సరైన అవగాహన ఏర్పర్చుకోవాలి. హెచ్ఆర్ఎస్, కొవ్వూరు శాస్త్రవేత్తలు వివిధ కార్యక్రమాల్లో, రైతు దినోత్సవాల్లో ఈ సమస్య ప్రాముఖ్యతను రైతుల దృష్టికి తీసుకువస్తున్నారు. గౌరవనీయులు ఉపకులపతి డా. టి జానకీరామ్, డా. వైబీఆర్హెచ్ఓ, డా. ఆర్వీఎస్కే రెడ్డి, పరిశోధనా సంచాలకులు, డా. వైఎస్ఆర్హెచ్ఓ అధ్యక్షతన ఈ సమస్యపై అవగాహన కోసం యూనివర్సిటీ శాస్త్రవేత్తలకు, రైతులకు వెబినార్‌ను జూలై 25వ తేదీన చేపట్టారు. దేశంలో నిష్ణాతులైన డా. కృష్ణకుమార్, Ex DDG (Hort). డా. ఎస్. ఉమ, డైరక్టర్ ఎన్ఆర్సీబీ, తిరుచ్చిరాపల్లి, డా. దామోదరన్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ ఐసీఏఆర్–సీఎస్ఎస్సీఐ లక్నో వారి ద్వారా ఈ సమస్యపై జరుగుతున్న పరిశోధనలపై అవగాహన ఏర్పరిచారు. ఫ్యుజేరియం అనే ఈ శిలీంధ్రం నేలలో నివాసం ఏర్పరుచుకొని, వేర్లను ఆశించి మొక్కలోపలికి ప్రవేశిస్తుంది. మొక్కలోని నాళికా కణజాలాన్ని ఆశించి నీరు, పోషక రవాణాను అడ్డుకొని మొక్క చనిపోవడానికి దారితీస్తుంది. దేశవ్యాప్తంగా ఈ టీఆర్–4 పనామా తెగులుపై జరుగుతున్న పరిశోధనల్లో ఐసీఏఆర్– సీఎస్ఎస్ఆర్ఐ, లక్నో, ఐసీఏఆర్–ఎన్ఆర్సీబీ, ట్రీచీ, ఐసీఏఆర్–సీఐఎస్హెచ్ లక్నో ముందున్నాయి. అఖిల భారత సాయిల్ సెలినిటీ (ఐసీఏఆర్–సీఎస్ఎస్ఆర్ఐ, లక్నో) వారు చేపట్టిన పరిశోధనల్లో ICAR-FUSICONT అనే జీవ శిలీంధ్రనాశిని ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గ్రాండ్నైన్ రకాన్ని ఆశించిన ఈ టీఆర్–4 పనామా తెగులును సమర్థవంతంగా అరికడుతున్నట్టు గమనించారు. చాలా మంది రైతులు పొలాల్లో ఈ మందును వాడి తెగులు తీవ్రతను తగ్గించడం జరిగింది. ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో కూడా ఈ ICAR-FUSICONT సామార్థ్యం గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న రేస్–1 పనామా తెగులుపై ఈICAR-FUSICONTను ఉపయోగించి పరిశోధనలు చేపట్టడం జరిగింది. మొదటి దశలో ఉన్న ప్రయోగాల్లో ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. టిఆర్–1 పనామా తెగులు నివారణ చర్యలు 1. తెగులు ఉన్న ప్రాంతాల్లో అమృతపాణి రకాన్ని సాగుచేయకూడదు. తెగులు తట్టుకోగలిగిన ఇతర రకాలను ఎంపిక చేసుకోవాలి. 2. తెగులు ఉన్న తోటల్లో ఉపయోగించిన సామాగ్రిని శుభ్రపరుచుకోవాలి. కాళ్లను కూడా నీటితో శుభ్రపరుచుకోవాలి. 3. తెగులు ఉన్న తోటల్లో నీరు పారించకూడదు. డ్రిప్ పద్ధతిని పాటించాలి. 4. టిష్యూకల్చర్ మొక్కలను ఎంచుకోవాలి. టీఆర్–4 పనామా తెగులు నివారణ చర్యలు 1. భూమిలో నివాసం ఉండి వేర్ల ద్వారా మొక్కను ఆశించే ఈ శిళీంధ్రం, మన రాష్ట్రంలోని అరటి నేలల్లోకి రాకుండా చూసుకోవాలి. రైతులు వేరే రాష్ట్రాల నుంచి పిలకల ద్వారా అరటి మొక్కలను తెచ్చుకోకూడదు. పిలకలను అంటిపెట్టుకున్న మట్టి ద్వారా శిలీంధ్రం మన నేలల్లోకి ప్రవేశించవచ్చు. 2. ఉభయ గోదావరి జిల్లా రైతులు అరటిలో కందను అంతరపంటగా వేసేటప్పుడు బిహార్ నుంచి కంద పిలకలను తెస్తున్నారు. బిహార్‌లోని ఈ టీఆర్–4 ఉనికిని గమనించడం జరిగింది కాబట్టి ఆ పిలకల ద్వారా, మట్టిద్వారా టీఆర్–4 శిలీంధ్రం మన రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చు కాబట్టి రైతులు బిహార్ కంద పిలకలను తెచ్చుకోకూడదు. 3. గ్రాండ్నైన్ అరటి రకాల్లో ఈ తెగులు లక్షణాలు ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. 4. రైతులందరూ ఈ సమస్యపై అవగాహన ఏర్పరుచుకోవాలి. -
10 లోగా ఆర్వోటీలు ఏర్పాటు చేసుకోవాలి
కరీంనగర్‌ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ, కస్తూరిబా, రెసిడెన్షియల్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈనెల 10వ తేదీలోగా రేడియో ఓరియంటేషన్ ట్రాన్స్మిషన్(ఆర్‌ఓటీ)ను ఏర్పాటు చేసుకోవాలని డీఈఓ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో సూచించారు. ఆర్‌ఓటీలు కలిగి ఉన్న పాఠశాలల్లో సెటాప్ బాక్స్‌లు అమర్చుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసుకునే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆర్‌ఎంఎస్‌ఏ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. -
పొగనారుకు తెగులు
మాగుడు, నల్లకాడ తెగులు ఇది మట్టి ద్వారా పెరిగే బూజు. మాగుడు తెగులు అత్యంత ప్రమాదకరమైనది. తేమ ఎక్కువైతే నారుమడి మొత్తం వ్యాపిస్తుంది. నారు మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. తెగులు సోకిన నారుపై తెల్లబూజు ఏర్పడుతుంది. నల్లకాడ తెగులు సోకితే పొగనారు వేర్లు, కాండం నల్లగా మారి మొక్కలు చనిపోతాయి. నివారణ చర్యలు 4 గ్రా. మైలుతుత్తం, 4 గ్రా. సున్నాన్ని లీటరు నీటికి కలిపితే బోర్డో మిశ్రమం తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని విత్తడానికి ముందు మడులను తడిపితే మాగుడు, నల్లకాడ తెగులు రాకుండా చేయొచ్చు. 2 గ్రా. బ్లైటాక్స్ మందును లీటరు నీటికి కలిపి పొగ నారు మొలకెత్తిన 2 వారాల తర్వాత మడులపై చల్లితే మాగుడు, నల్లకాడ తెగులును అరికట్టవచ్చు. మెటలాక్సిల్, మాంకోజబ్ రసాయనాలు 2 గ్రాములను లీటరు నీటికి కలిపితే రిడోమిల్ మిశ్రమం తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని విత్తనం మొలకెత్తిన 21 రోజులకు మడులపై పిచికారీ చేయాలి. రిడోమిల్ గోల్డ్ 2 గ్రా. మందును లీటరు నీటికి కలిపి 20-30 రోజుల నారుమళ్లపై రెండుసార్లు పిచికారీ చేయాలి. సినామిడన్ 10 శాతం, మాంకోజబ్ 3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి నారుమళ్లపై పిచికారీ చేసినా ఫలితం ఉంటుంది. అజోక్సీస్ట్రోబిన్ 1 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి నారుమళ్లపై పిచికారీ చేస్తే మాగుడు, నల్లకాడ తెగుళ్లను అరికట్టవచ్చు చుక్క, కప్పకన్ను తెగులు తెల్ల చుక్క తెగులు ఏ దశలోనైనా సోకుతుంది. ఆకులపై చిన్న చిన్న చుక్కలు, వాటి మధ్య భాగంలో గుంటల మాదిరిగా ఏర్పడి తెల్లగా అవుతాయి. కప్పకన్ను తెగులు 4-5 వారాల నారులో కనిపిస్తుంది. ఇవి తెల్ల చుక్కల కంటే పెద్దవి. అధిక వర్షాలకు ఈ తెగులు ఉధృతి పెరుగుతుంది. ఇటీవల పర్చూరు, కందుకూరు, కనిగిరి, అద్దంకి తదితర ప్రాంతాల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురిశాయి. కాబట్టి నారుమళ్ల రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఆకు చుక్క, కప్పకన్ను తెగులు నివారణకు 0.5 గ్రా బావిస్టిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగులను నివారిస్తేనే పంట దక్కేది పొగాకు లద్దె పురుగును సమర్థంగా నివారించకపోతే నారు మొత్తం కోల్పోయే ప్రమాదముంది. లద్దె పురుగులను గుర్తిస్తే.. 5 గ్రా. ఇమామెక్టిన్బెంజోయేట్ మందును 10 లీటర్ల నీటికి, స్పైనోసోడ్ 3 గ్రా. మందును 10 లీటర్ల నీటికి, ఫ్లూ బెంజోయేట్ 2.5 మి.లీ మందును 10 లీటర్ల నీటికి కలిపి నారుమళ్లపై చల్లితే లద్దె పురుగును అరికట్టవచ్చు. కాండం తొలుచు పురుగు ఉండే చోట బుడగ లాగా ఉబ్బి ఉంటుంది. పురుగు ఆశించిన మొక్క పెరుగుదల క్షీణించి వెర్రి తలలు వేస్తుంది. ఇది ముందుగా నారుమళ్లను ఆశించి, ఆ తర్వాత తోటలకు విస్తరిస్తుంది. నివారణకు ప్లూబెండయమైడ్ 0.25 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే కాండం తొలిచే పరుగును నివారించవచ్చు. తెల్ల దోమలు ఆకు అడుగు భాగంలో కనిపించే తెల్లని చిన్న కీటకాలు. ఆకు కదపగానే ఇవి ఎగిరిపోతాయి. ఇవి ఆకుల నుంచి రసాన్ని పీల్చి ఆకులు ముడత పడేలా చేస్తాయి. నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ మందును లీటరు నీటికి, థయోమిథాక్సమ్ మందు 0.3 గ్రా. మందును లీటరు నీటితో కలిపి నారుమళ్లపై పిచికారీ చేయాలి. మిడతలు ఆకులను తిని నష్టం కలి గిస్తాయి. నారు మడి స్థలాన్ని, గట్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు గడ్డి, కలుపు జాతి మొక్కలను నివారించాలి. ఇలా చేస్తే మిడతలను పంట నుంచి దూరం చేయొచ్చు. -
పత్తి రైతులూ జాగ్రత్త
ఖమ్మం వ్యవసాయం: ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.వెంకట్రాములు, డాక్టర్ ఆర్. శ్రీనివాస్‌లు ఇటీవల చింతకాని మండలం పాతర్లపాడు, కోమట్లగూడెం గ్రామాల్లోని పత్తి చేలను పరిశీలించారు. వారికి కాండం మచ్చ తెగులు సోకిన పైర్లు కనిపించాయి. రెండేళ్లుగా ఈ తెగులు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడా కనిపించిందని, ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోనూ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు ఈ తెగులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఈ తెగులు ప్రభావం ఉందని వారు చెబుతున్నారు. ఈ తెగులుపై వరంగల్, గుంటూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారని చెప్పారు. వాతావరణంలో మార్పుల వల్లే ఇది వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. ఈ తెగులుతో పాటు ఆకుమచ్చ, పిండినల్లి, తామరపురుగుల ఉధృతి కూడా ఉందని అన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. కాండం మచ్చ తెగులు: ఈ తెగులు ఆశించినప్పుడు ప్రధాన కాండం చివర లేత చిగురు ఎండిపోయి విరిగి పోతుంది. తరువాత ముదురు కొమ్మలు, బెరడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. కొమ్మలు, కాండం పైనుంచి కిందకు ఎండుతాయి. ఈ తెగులు తెరపలు తెరపలుగా మొక్కల మీద ఆశించటం వలన అవి ఎండిపోతాయి. ఈ తె గులు ఆశించిన మొక్కల నుంచి పక్క మొక్కలకు వలయాకారంలో వ్యాప్తి చెందుతుంది. రైతులు ఈ లక్షణాలను గమనించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. లీటర్ నీటిలో ప్రొపికొనజోల్ 1 మి.లీ కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు వాతావరణం మబ్బులుపట్టి, ముసురు వర్షాలు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాములు, ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి పిండిపురుగు పిల్ల, తల్లి పురుగులు కొమ్మలు, కాండం, మొగ్గలు, పువ్వులు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్కలు ఎదగక గిడసబారి పోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉంది. ఈ పిండినల్లి కలుపు మొక్కలు అయిన వయ్యారిబామ (పార్థీనియం), తుత్తురబెండ వంటి వాటి మీద ఉంటుంది. కాబట్టి ఈ మొక్కలను తీసివేసి నాశనం చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ప్రొఫేన్ఫాస్ లేదా మిథైల్ పెరాథియాన్ 3 మి.లీ లేదా ఎసిఫేట్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులతో పాటు ట్యాంక్‌కు 10 గ్రాములు డిటర్జెంట్ సర్ఫ్‌ను కలిపి వాడాలి. తామరపురుగులు ఈ పురుగులు ఆకుల అడగు భాగాన చేరి రసం పీల్చటం వలన ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. దీని నివారణకు పిప్రోనిల్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి. -
నిమ్మను హరించే తెగుళ్లు
బంక తెగులు ఈ తెగులు వల్ల మొక్క పూర్తిగా ఎండిపోతుంది. తెగులు ఉధృతి పెరిగితే చెట్టు వేర్లు బలహీన పడతాయి. కాండం పైన, మొదలు వద్ద పుట్ట గొడుగుల లాంటి చారలు ఏర్పడతాయి. కాండం పగిలి దాని నుంచి బంక కారుతుంది. చివరకు చెట్టు చనిపోతుంది. మురుగు నీరు బయటకు వెళ్లే వసతి గల నేలల్లో నిమ్మ సాగు చేయాలి. సాగు నీరు చెట్టు మొదలుకు తగలకుండా తల్లి పాదు, పిల్ల పాదు ఏర్పాటు చేయాలి. ఏడాదికి ఒకసారి చెట్టు మొదలు నుంచి 65 సెం.మీ ఎత్తు వరకు బోర్డ్ పేస్ట్ రాయాలి. చాకుతో తెగులు భాగాన్ని తీసేసి మెర్క్యురిక్ క్లోరైడ్‌తో శుభ్రపరిచి బోర్డ్ పేస్ట్ పూయాలి. వేరుకుళ్లు తెగులు ఈ తెగులు సోకి తే పూత, పిందె విపరీతంగా వచ్చి క్రమేణా ఆకులు రాలిపోతాయి. చెట్టుపై కాయలు మాత్రమే మిగులుతాయి. చెట్టు ఎండు ముఖం పట్టి చనిపోతుంది. వేర్లపై ఉండే బెరడు తేలికగా ఊడి వస్తూ వేర్ల నుంచి దుర్వాసన వ స్తుంది. ఈ లక్షణాలు గమనించిన వెంటనే 100 లీటర్ల నీటికి కిలో మైలుతుత్తం(కాపర్ ఆక్సీ క్లోరైడ్), కిలో సున్నం కలిపి ఆ మిశ్రమాన్ని వ్యాధి సోకిన మొక్కకు, దాని చుట్టు పక్కల నాలుగు మొక్కల పాదుల్లో వేర్లు పూర్తిగా తడిచే లా 20-25 లీటర్లు పోయాలి. 100 కేజీల పశువుల ఎరువును కేజీ ట్రైకోడెర్మావిరిడీతో కలిపి గొనె సంచులను కప్పి ఉదయం సాయంత్రం నీళ్లు చల్లితే 15-20 రోజుల్లో ట్రైకోడెర్మావిరిడీ కల్చర్ తయారవుతుంది. దీనిని 10 నుంచి 15 కేజీల చొప్పున వ్యాధి సోకిన చెట్టు పాదుల్లో వేసి పాదంతా కలియబెట్టాలి. -
పంటచేలో వరద చిచ్చు.. రైతులూ మేల్కోండి
పత్తి సాధ్యమైనంత వరకు పొలంలో నీరు నిల్వకుండా చూడాలి. నీరు నిల్వ ఉంటే మురుగు కాల్వలు ఏర్పాటు చేసి బయటకు పంపించాలి. వీలైనంత త్వరగా అంతర కృషి (పాటు) చేయాలి. దీనివల్ల భూమిలో తేమ తగ్గడం , వేర్లకు గాలి, పోషకాలు అందడంతో మొక్కలు త్వరగా సాధారణ స్తితికి వస్తాయి. నీరు బయటకు పంపిన తరువాత ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్‌ను మొక్కకు 5-6 సెం.మీ దూరంలో గుంతలు తీసి వేయాలి. లేదా అంతరకృషి చేయాలి. పొలంలో తేమ అధికంగా ఉన్నప్పుడు వేర్లు పోషకాలు, నీటిని తీసుకోలేక ఆకులు లేత ఆ కుపచ్చ రంగులోకి మారుతాయి. దీనివల్ల పె రుగుదల తగ్గుతుంది. కాబట్టి పైరుపై 20 గ్రా ముల యూరియా లేదా పది గ్రాముల పొటాషియం నైట్రేట్‌ను లీటర్ నీటిలో కలిపి ఐదు రో జుల వ్యవధిలో రెండుమూడు సార్లు పిచికారీ చేస్తే మొక్కలు త్వరగా కోలుకుంటాయి. భూమి, వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు పత్తిని ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు పది లీటర్ల నీటిలో కాపర్ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ను కలిపి పిచికారీ చేయాలి. భూమిలో అధిక తేమ ఉన్నప్పుడు వేరుకుళ్లు తెగులు ఆశించి మొక్కలు చనిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లేదా కార్బండిజమ్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్క మొదళ్లలో పోయాలి. వరి వరి ప్రస్తుతం దుబ్బు చేసే దశలో ఉంది. వీలైనంత త్వరగా నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించాలి. తరువాత ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేయాలి. ముంపు పాలైన వరి పొలాల్లో తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది. ఆకుముడత పురుగు: ఈ పురుగు ఆకుముడతలో ఉండి పత్రహరతాన్ని హరించటం వల్ల ఆకులు తెల్లపడతాయి. దీని నివారణకు పిలక దశలో చేనుకు అడ్డంగా తాడుతో 2-3 సార్లు లాగితే పురుగులు కిందబడిపోతాయి. క్లోరిఫైరీఫాస్ 2.5 మి.లీ లేదా కార్టాప్‌హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు లేదా క్లోరాన్ట్నిలిప్రోల్ 0.4 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 20 డబ్ల్యూడీజీ 0.25 గ్రాములు లేదా 48 ఎన్సీ 0.1మి.లీ లీటర్ నీటిలో కలిపి వాడాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు ఎకరాకు ఎనిమిది కిలోలు వేయాలి. తాటాకు తెగులు: హిస్పాపిల్లా పెద్దపురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తినివేయటం వల్ల తెల్లటి చారలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా క్లోరిఫైరీఫాస్ 2.5 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొడతెగులు: దుబ్బు చేసే దశ నుంచి ఆకులపై మచ్చలు పెద్దగై పాము పొడ మచ్చలుగా ఏర్పడుతాయి. మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి. దీని నివారణకు హెక్సాకొనజోల్ రెండు మి.లీ లేదా వాలిడా మైసిన్ రెండు మి.లీ లేదా ప్రోపికొనజోల్ మి.లీ లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ + టెబ్యుకొనజోల్ 75 డబ్ల్యూజీ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి 15 రోజులకు ఒకసారి చొప్పున రెండు సార్లు పిచికారీ చేయాలి. అగ్గితెగులు: అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోధయొలేన్ 1.5 మి.లీ లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మిరప అధిక వర్షాలు, అధిక తేమ వల్ల మిరపలో ఆకుమచ్చ తెగులు, వేరుకుళ్లు, కాండం కుళ్లు, కొనోఫెరా కొమ్ముకుళ్లు, లద్దెపురుగు ఆశించే అవకాశం ఉంది. ఆకుమచ్చ తెగులు: ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్లు తెగులు: మొక్కలు వడలిపోయి ఎండిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి వడలిపోయిన చెట్ల మొదళ్లు, చుట్టుపక్కల తడపాలి. కాండంకుళ్లు: దీని నివారణకు 1.5 గ్రాముల థయోఫానెట్ మిథైల్‌ను లీటర్ నీటిలో కలిపి మొక్క కాండం అంతా తడిసేటట్లు పిచికారీ చేయాలి. కానోఫోరా కొమ్మకుళ్లు తెగులు: ఈ తెగులు సోకిన లేత చిగుళ్లు మాడిపోయి కణుపుల వద్ద కొమ్మలు కుళ్లి విరిగి పోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. లద్దె పురుగు: మిరపలో లద్దెపురుగు సోకే అవకాశం ఉంది. దీని నివారణకు థయోడికార్బ్ గ్రాము లేదా క్లోర్ఫిన్ఫైర్ రెండు మి.లీ లేదా స్ప్రైనోసాడ్ 0.38 మి.లీ లేదా క్లోరీఫైరీఫాస్ 2.5మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.