అరటి సాగుకు ’పనామా తెగులు’ గొడ్డలిపెట్టుగా మారింది. మట్టి ద్వారా వ్యాపించే ఈ శిలీంధ్రపు తెగులు అరటి పంటను ప్రపంచవ్యాప్తంగా తుడిచి పెట్టేస్తోంది. పనామా తెగులులో ఒక రకం (టిఆర్1) మన అమృతపాణి అరటి రకాన్ని ఇప్పటికే తుడిచి పెట్టేసింది. ఇప్పుడు గ్రాండ్ నైన్ (జీ9) వంతు వచ్చింది. మూడేళ్ళుగా బీహార్, మరో మూడు రాష్ట్రాల్లో పనామా తెగులు మరో రకం (టిఆర్4) జీ9 అరటి తోటలను తీవ్రంగా నష్టపరుస్తోంది. ఇటీవలే శాస్త్రవేత్తలు జీవ శిలీంధ్రనాశినిని తయారు చేశారు. అయినప్పటికీ మన రాష్ట్రాల్లోకి ఇది రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, బీహార్ నుంచి కంద పిలకలు తెచ్చుకోవటం మానుకోవాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది.
ప్రాచీన కాలం నుంచి మన దేశంలో విరివిగా పండిస్తున్న సాంప్రదాయ పరంగా ప్రాముఖ్యత కలిగిన పండ్లతోట అరటి. అరటిని పండించే దేశాల్లో మన దేశం ముందుండడమే కాకుండా ఇంచుమించు 30 శాతం ప్రపంచ అరటి ఉత్పత్తిని కలిగి ఉంటుంది. మన దేశ అరటి సుమారు 884 వేల హెక్టార్లలో సాగు చేయబడుతూ, 30 మిలియన్ టన్నుల దిగుబడిని కలిగి ఉంటుంది. దేశంలో అరటిని సాగుచేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనది. మన రాష్ట్రంలో సుమారు లక్ష హెక్టార్లలో సాగు చేయబడుతూ, 5 మిలియన్ మెట్రిక్ టన్నుల దిగుబడిని కలిగి ఉంది. ఉభయ గోదావరి, ఇతర కోస్తా జిల్లాలతో పాటు, ఆధునిక సేద్య విధానంతో ఈ మధ్య కాలంలో రాయలసీమలోని కడప, అనంతపురం జిల్లాల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేసి అధిక దిగుబడులను రైతులు సాధిస్తున్నారు. భారతదేశంలో సుమారు 20 అరటి రకాలు సాగులో ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రధానంగా సాగులో ఉన్న అరటి రకాలు కావెండిష్ (గ్రాండ్‌నైన్), అమృతపాణి, తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, సుగంధాలు, కూర రకాలైన కొవ్వూరు బొంత.
అరటిలో దిగుబడులు తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం అరటిని ఆశిస్తున్న తెగుళ్లు. వీటిలో ముఖ్యమైనది పనామా/ ఫ్యుజేరియం తెగులు (రేస్–1). ఈ తెగులును ఫ్యుజేరియం ఆక్సీస్పోరమ్ ఫార్మాస్పీసిస్ కుబెన్స్ అనే నేలలో నివసించే శిలీంధ్రం కలుగజేస్తుంది. ఈ రేస్–1 పనామా తెగులు వల్ల మన రాష్ట్ర రైతులు ఇష్టంగా సాగుచేసే అమృతపాణి రకం తుడిచిపెట్టుకుపోయింది/ సాగులో లేకుండా పోయింది. రైతులు ఇతర రకాలైన గ్రాండ్‌నైన్, తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, మార్టమాన్ వంటి రకాలను సాగుచేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో దేశంలోని అరటి పంటను నష్టపరుస్తున్న సమస్య: ట్రోపికల్ రేస్ 4 (టీఆర్ 4) వల్ల కలిగే పనామా/ ఫ్యుజేరియం తెగులు. ఈ తెగులు గ్రాండ్‌నైన్ రకాన్ని ఎక్కువగా ఆశించి నష్టపరచడమే కాకుండా ఇతర రకాలైన అమృతపాణి, కూర అరటిని కూడా ఆశిస్తుంది. పనామా తెగులును కలిగించే ఫ్యుజేరియం శిలీంధ్రంలో నాలుగు రకాల రేస్‌లు ఉన్నాయి. ఇందులో మూడు రకాలు అరటిని ఆశించి నష్టపరుస్తాయి. రేస్–1 అనేది అమృతపాణి వంటి అరటి రకాలను ఆశిస్తుంది. రేస్–2 కూర అరటిని ఆశిస్తుంది. రేస్–3 హెలికోనియా పుష్పాలను ఆశిస్తుంది.
రేస్–4 గ్రాండ్‌నైన్ రకాలతో పాటు పైన వివరించిన అమృతపాణి, కూర రకాలను కూడా ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. దేశవ్యాప్తంగా పండించే అరటి రకాల్లో ఈ గ్రాండ్‌నైన్ రకం 55 నుంచి 60 శాతం సాగుచేస్తున్నారు. కాబట్టి ఈ తెగులు ఉనికి ప్రమాదకరంగా పరిణమించింది. టీఆర్–4 అనే ఈ పనామా తెగులు ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో గమనించడం జరిగింది. 2016–17 సంవత్సరాల్లో బిహార్‌లోని పూర్ణియ, కటిహార్ జిల్లాల్లో మొదటగా గుర్తించారు. దీనిని టీఆర్–4గా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా (ఎన్‌ఆర్‌సీబీ) తిరుచ్చిరాపల్లి శాస్త్రవేత్తలు దృవీకరించడం జరిగింది. క్రమంగా ఈ సమస్యను బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో గమనించారు.
అయితే మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ టీఆర్–4 పనామా తెగులు ఉనికిని గమనించలేదు. డా. వైఎస్‌ఆర్‌హెచ్‌ఓ, హెచ్‌ఆర్‌ఎస్, కొవ్వూరు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఈ తెగులు గురించి సర్వేలను చేపడుతున్నారు. రైతులు ఈ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, సమస్యపైన సరైన అవగాహన ఏర్పర్చుకోవాలి. హెచ్‌ఆర్‌ఎస్, కొవ్వూరు శాస్త్రవేత్తలు వివిధ కార్యక్రమాల్లో, రైతు దినోత్సవాల్లో ఈ సమస్య ప్రాముఖ్యతను రైతుల దృష్టికి తీసుకువస్తున్నారు. గౌరవనీయులు ఉపకులపతి డా. టి జానకీరామ్, డా. వైబీఆర్‌హెచ్‌ఓ, డా. ఆర్‌వీఎస్‌కే రెడ్డి, పరిశోధనా సంచాలకులు, డా. వైఎస్‌ఆర్‌హెచ్‌ఓ అధ్యక్షతన ఈ సమస్యపై అవగాహన కోసం యూనివర్సిటీ శాస్త్రవేత్తలకు, రైతులకు వెబినార్‌ను జూలై 25వ తేదీన చేపట్టారు. దేశంలో నిష్ణాతులైన డా. కృష్ణకుమార్, Ex DDG (Hort). డా. ఎస్. ఉమ, డైరక్టర్ ఎన్‌ఆర్‌సీబీ, తిరుచ్చిరాపల్లి, డా. దామోదరన్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ ఐసీఏఆర్–సీఎస్‌ఎస్‌సీఐ లక్నో వారి ద్వారా ఈ సమస్యపై జరుగుతున్న పరిశోధనలపై అవగాహన ఏర్పరిచారు. ఫ్యుజేరియం అనే ఈ శిలీంధ్రం నేలలో నివాసం ఏర్పరుచుకొని, వేర్లను ఆశించి మొక్కలోపలికి ప్రవేశిస్తుంది. మొక్కలోని నాళికా కణజాలాన్ని ఆశించి నీరు, పోషక రవాణాను అడ్డుకొని మొక్క చనిపోవడానికి దారితీస్తుంది.
దేశవ్యాప్తంగా ఈ టీఆర్–4 పనామా తెగులుపై జరుగుతున్న పరిశోధనల్లో ఐసీఏఆర్– సీఎస్‌ఎస్‌ఆర్‌ఐ, లక్నో, ఐసీఏఆర్–ఎన్‌ఆర్‌సీబీ, ట్రీచీ, ఐసీఏఆర్–సీఐఎస్‌హెచ్ లక్నో ముందున్నాయి. అఖిల భారత సాయిల్ సెలినిటీ (ఐసీఏఆర్–సీఎస్‌ఎస్‌ఆర్‌ఐ, లక్నో) వారు చేపట్టిన పరిశోధనల్లో ICAR-FUSICONT అనే జీవ శిలీంధ్రనాశిని ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గ్రాండ్‌నైన్ రకాన్ని ఆశించిన ఈ టీఆర్–4 పనామా తెగులును సమర్థవంతంగా అరికడుతున్నట్టు గమనించారు. చాలా మంది రైతులు పొలాల్లో ఈ మందును వాడి తెగులు తీవ్రతను తగ్గించడం జరిగింది. ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో కూడా ఈ ICAR-FUSICONT సామార్థ్యం గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న రేస్–1 పనామా తెగులుపై ఈICAR-FUSICONTను ఉపయోగించి పరిశోధనలు చేపట్టడం జరిగింది. మొదటి దశలో ఉన్న ప్రయోగాల్లో ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
టిఆర్–1 పనామా తెగులు నివారణ చర్యలు
1. తెగులు ఉన్న ప్రాంతాల్లో అమృతపాణి రకాన్ని సాగుచేయకూడదు. తెగులు తట్టుకోగలిగిన ఇతర రకాలను ఎంపిక చేసుకోవాలి.
2. తెగులు ఉన్న తోటల్లో ఉపయోగించిన సామాగ్రిని శుభ్రపరుచుకోవాలి. కాళ్లను కూడా నీటితో శుభ్రపరుచుకోవాలి.
3. తెగులు ఉన్న తోటల్లో నీరు పారించకూడదు. డ్రిప్ పద్ధతిని పాటించాలి.
4. టిష్యూకల్చర్ మొక్కలను ఎంచుకోవాలి.
టీఆర్–4 పనామా తెగులు నివారణ చర్యలు
1. భూమిలో నివాసం ఉండి వేర్ల ద్వారా మొక్కను ఆశించే ఈ శిళీంధ్రం, మన రాష్ట్రంలోని అరటి నేలల్లోకి రాకుండా చూసుకోవాలి. రైతులు వేరే రాష్ట్రాల నుంచి పిలకల ద్వారా అరటి మొక్కలను తెచ్చుకోకూడదు. పిలకలను అంటిపెట్టుకున్న మట్టి ద్వారా శిలీంధ్రం మన నేలల్లోకి ప్రవేశించవచ్చు.
2. ఉభయ గోదావరి జిల్లా రైతులు అరటిలో కందను అంతరపంటగా వేసేటప్పుడు బిహార్ నుంచి కంద పిలకలను తెస్తున్నారు. బిహార్‌లోని ఈ టీఆర్–4 ఉనికిని గమనించడం జరిగింది కాబట్టి ఆ పిలకల ద్వారా, మట్టిద్వారా టీఆర్–4 శిలీంధ్రం మన రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చు కాబట్టి రైతులు బిహార్ కంద పిలకలను తెచ్చుకోకూడదు.
3. గ్రాండ్‌నైన్ అరటి రకాల్లో ఈ తెగులు లక్షణాలు ఎప్పటికప్పుడు గమనించుకోవాలి.
4. రైతులందరూ ఈ సమస్యపై అవగాహన ఏర్పరుచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment