banana farm
-
అంతర్జాతీయ బ్రాండ్ కానున్న అనంతపురం
వేరుశనగ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది అనంత. కానీ ఇప్పుడు నాణ్యమైన అరటితోనూ అనంత గుర్తింపు తెచ్చుకుంది. ‘హ్యాపీ బనానా’ పేరుతో ఇప్పటికే గల్ఫ్ లాంటి విదేశాలకు ఎగుమతి అవుతున్న ‘అనంత’ అరటి.. సమీప భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ కానుంది. సాక్షి, అనంతపురం అగ్రికల్చర్: నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) అనంతపురం జిల్లాను బనానా డెవలప్మెంట్ క్లస్టర్‌గా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాల్లో ఉద్యాన తోటలపై సర్వే నిర్వహించిన ఎన్‌హెచ్‌బీ... కొన్ని ప్రామాణికాల ఆధారంగా 12 జిల్లాల పరిధిలో 7 ఉద్యాన పంటలను గుర్తించింది. అందులో అరటికి సంబంధించి తమిళనాడులోని థేనీ జిల్లాతో పాటు ‘అనంత’కు స్థానం కల్పించడం విశేషం. మిగతా వాటి విషయానికి వస్తే... యాపిల్ క్లస్టర్లుగా షోపియాన్ (జమ్మూకాశ్మీర్), కిన్నౌర్ (హిమాచలప్రదేశ్), మామిడి క్లస్టర్లుగా లక్నో (ఉత్తరప్రదేశ్), కచ్ (గుజరాత్), మహబూబ్‌నగర్ జిల్లా (తెలంగాణా) ఉన్నాయి. అలాగే ద్రాక్ష క్లస్టర్‌గా నాసిక్ (మహారాష్ట్ర), ఫైనాపిల్ క్లస్టర్‌గా సిఫాహిజలా (త్రిపుర), దానిమ్మ క్లస్టర్లుగా షోలాపూర్ (మహారాష్ట్ర), చిత్రదుర్గ (కర్ణాటక) ఉండగా పసుపు క్లస్టర్‌గా పశ్చిమ జైంతియాహిల్స్ (మేఘాలయ)ను ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన తాజాగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అడిషనల్ సెక్రటరీ డాక్టర్ అభిలాక్ష్ లిఖీ శుక్రవారం నార్పల మండలం కర్ణపుడికి గ్రామంలోని అరటి తోటలను పరిశీలించారు. రైతుల సమస్యలు, అనుభవాలు తెలుసుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ తదితరులు ఉన్నారు. అరటి దిగుబడి, లభిస్తున్న ధర, ఎగుమతులు, సాగు పద్ధతులను తెలుసుకున్నారు. నార్పల మండం కర్ణపుడికిలో అరటి తోట పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న అభిలాక్ష్ లిఖీ అరటి రైతులకు మూడింతల ఆదాయం మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం ద్వారా దిగుబడి పెరగడంతో పాటు రైతులకు మూడింతల ఆదాయం వచ్చేలా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రూ.270 కోట్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అడిషనల్ సెక్రటరీ డాక్టర్ అభిలాక్ష్ లిఖీ తెలిపినట్లు ఉద్యానశాఖ అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. అందులో ఉత్పత్తి పెంపునకు రూ.116.50 కోట్లు, పంట కోతల తర్వాత యాజమాన్యం, విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం రూ.74.75 కోట్లు, మార్కెటింగ్, బ్రాండింగ్, రవాణా వసతుల కోసం రూ.78.70 కోట్లు వెచ్చించడానికి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. అరటి తోటలు ఎక్కువగా ఉన్న నార్పల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి తదితర ప్రాంతాల్లో నాణ్యమైన దిగుబడులు, మార్కెటింగ్ వ్యవస్థ కల్పించడానికి రైపనింగ్ ఛాంబర్లు, కోల్ట్‌స్టోరేజీలు, ఎగుమతుల పెంపు కోసం ఇతరత్రా మౌలిక సదుపాయం కల్పించే అవకాశం మెండుగా ఉందని చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో కూడా అరటి అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. దీంతో భవిష్యత్తులో అరటికి కేరాఫ్‌గా ‘అనంత’ మారుతుందని అంచనా వేస్తున్నారు. క్లస్టర్ ప్రకటనతో ఎన్‌హెచ్‌బీ అధ్యయనం అనంతను అరటి క్లస్టర్‌గా ప్రకటించిన నేపథ్యంలో.. నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ)కి చెందిన ఇరువురు అధికారులు బృందం గతేడాది రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించింది. అరటి తోటల సాగు, రైతుల స్థితిగతులపై అధ్యయనం చేసింది. జిల్లాలో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, భూమి లక్షణాలు, రైతులు అవలంభిస్తున్న యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్, లభిస్తున్న ధర, నికర ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. -
వైరల్: అరటి గెల మీద పడిందని రూ.4 కోట్లు రాబట్టాడు
బెర్న్: ప్రమాదవశాత్తు సంస్థలో పనిచేసే కార్మికులకు గాయాలైతే లేదా చనిపోతే సదరు సంస్థే నష్టపరిహారం చెల్లిస్తుంది. ప్రమాద తీవ్రదతను బట్టి కొంత మొత్తాన్ని వారికి అప్పజెప్పుతుంది. అయితే తాజాగా ఓ అరటి తోటలో పనిచేసే కార్మికుడిపై అరటి చెట్టు పడటంతో యాజమానిపై దావా వేసి ఏకంగా 4 కోట్లు రాబట్టాడు. ఈ ఆశ్యర్యకర ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. చదవండి: Viral: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే! క్వీన్స్‌ల్యాండ్‌లో సమీపంలోని ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు చెందిన అరటి తోటలో జైర్ లాంగ్ బాటమ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. కాపుకు వచ్చిన చెట్లనుంచి అరటి పండ్ల గెలలను నరుకుతుండగా ప్రమాదవశాత్తు అరిటి పండ్ల గెలతో పాటు అరటి చెట్టుకూడా అతనిపై పడింది. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దెబ్బలు తీవ్రంగా తగలటంతో లాంగ్ బాటమ్ వికలాంగుడైపోయాడు. ప్రమాదం కారణంగా పనిచేయలేక ఉపాధి కోల్పోయాడు. దీంతో బాధితుడు తనకు పరిహారం కోరుతూ అరటితోట యజమానిపై క్వీన్స్‌ల్యాండ్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు. ఇది 2016లో జరిగింది. చదవండి: డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..! ఈ పిటీషన్‌పై కోర్టు విచారణ ఇప్పటి వరకు కొసాగింది. తాజాగా మరోసారి ఈ కేసుపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అరటి పండ్ల గెల మీద పడటం కారణంగానే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని, ఆ ఘటన వల్లనే అతను జీవితాంతం ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని కోర్టు అభిప్రాయపడింది.. కాబట్టి ఆ కూలీకి యజమాని 502,740 డాలర్ల పరిహారాన్ని అంటే భారత కరెన్సీలో 3,77,15,630 రూపాయలను చెల్లించాలని అరటి తోట యజమానిని కోర్టు ఆదేశించింది. ఇలా క్వీన్స్లాండ్ సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో చేసేందేంలేక సదరు యజమాని కూలీకి పూర్తి నష్టపరిహారం చెల్లించాడు. -
పండ్లతోటల రక్షణకు చర్యలు అవసరం
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 12,583 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 22,738 మంది రైతులు నష్టపోయారు. పది జిల్లాల్లో పండ్లు, కూరగాయలు, పూలతోటలు దెబ్బతిన్నాయి. అరటి, మిర్చి, బొప్పాయి, జామ, బత్తాయి, నిమ్మ తదితర తోటలు ప్రభావితమయ్యాయి. పండ్లతోటల సంరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సా్ర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. అన్ని పంటలకు సాధారణ సూచనలు.. ⇔ వీలైనంత త్వరగా చేలల్లో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి. ⇔ పంట ఎదుగుదలకు తోడ్పడేలా బూస్టర్ డోస్ ఎరువులు – నత్రజని, డీఏపీ, జింక్ వంటివి వాడాలి. ⇔ అధిక తేమతో తెగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందున పురుగుల నివారణ చర్యలు చేపట్టాలి. ⇔ లేత తోటల్లో చనిపోయిన మొక్కల్ని తీసేసి కొత్తవి నాటాలి. ⇔ వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా చెట్ల మధ్య దున్నడం వల్ల తేమ త్వరగా ఆరి చెట్లు కోలుకుంటాయి. ⇔ అధిక గాలులకు వేళ్లతో సహా ఒరిగిన చెట్లను నిలబెట్టి మట్టిని ఎగదోసి ఊతమివ్వాలి. అరటి తోటలో.. ⇔ రెండు పిలకలు వదిలేసి విరిగిన చెట్లను నరికేయాలి. చెట్లకు వెదురు కర్రలను పాతి ఊతమివ్వాలి. ⇔ అరటిచెట్లు నాలుగురోజుల కంటే ఎక్కువగా నీళ్లలో ఉంటే కోలుకోవడం కష్టం. కోలుకున్నా ఎదుగుదల, దిగుబడి తక్కువగా ఉంటాయి. ⇔ రెండురోజులు నీటిముంపులో ఉంటే త్వరగా నీళ్లు బయటకుపంపి తోట ఆరేలా చేయాలి. ఒక్కో చెట్టుకు వందగ్రాముల యూరియా, 80 గ్రాముల పొటాష్ వేయాలి. ⇔ మూడునెలల కన్నా తక్కువ వయసు మొక్కలు మూడడుగుల లోతు నీటిలో ఉంటే నేల ఆరిన వెంటనే కొత్త పిలకలు నాటుకోవాలి. ⇔ గొర్రుతో అంతరసేద్యం చేసి యూరియా, మ్యూరేట్ పొటాష్‌ను 20, 25 రోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు వేయాలి. ⇔ ఆకులు, గెలలపై పొటాషియం నైట్రేట్‌ను వారం రోజుల వ్యవధిలో మూడునాలుగుసార్లు పిచికారీ చేయాలి. ⇔ సగం తయారైన గెలలను ఎండిన ఆకులతో కప్పి 15 రోజుల్లోగా కోసి అమ్ముకోవాలి. ⇔ దుంపకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాముల్ని లీటర్ నీటికి కలిపి మొక్క చుట్టూ తడిచేలా నేలలో పోయాలి ⇔ సిగటోక ఆకుమచ్చ తెగులును అరికట్టేందుకు ప్రొపికొనజోల్ ఒక మిల్లీలీటరును వారంరోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు పిచికారీ చేయాలి. బత్తాయి, నిమ్మ తోటల్లో.. ⇔ వేర్లకు ఎండ తగిలేలా చూడాలి. పడిపోయిన చెట్లను నిలబెట్టే ఏర్పాట్లు చేయాలి. ⇔ విరిగిన కొమ్మల్ని కొట్టేసి పైభాగాన బోర్డో మిశ్రమం పోయాలి. ⇔ ఎనిమిదేళ్లపైబడి కాపు ఇస్తున్న తోటలో చెట్టుకు 500 గ్రాముల యూరియా, 750 గ్రాముల పొటాష్ వేసుకోవాలి. ⇔ చెట్టు మొదళ్ల దగ్గర ఒకశాతం బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాములను లీటర్ నీటికి కలిపి పోయాలి. ⇔ తోటలో కాపు ఉంటే 2–4–డి మందు చల్లి పిందె, పండు రాలడాన్ని నివారించుకోవాలి. ⇔ బెంజైల్ ఆడినైన్ పిచికారీ చేస్తే అధిక తేమను నివారించుకోవచ్చు. బొప్పాయి తోటలో.. ⇔ మెటలాక్జిల్ ఎంజెడ్ మూడుగ్రాములు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాములను నీటికి కలిపి మొదళ్ల దగ్గర పోయాలి. ⇔ ఐదుగ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమ పిచికారీ చేయాలి. ⇔ కోతకు తయారైన కాయలుంటే తక్షణమే కోసివేయాలి. పండు కుళ్లు నివారణకు హెక్సాకొనజోల్ జిగురు మందు చల్లాలి. జామ తోటలో.. ⇔ అధిక నీటిని తీసేయాలి. గొర్రుతో దున్ని పాదులు చేసి మొదళ్ల దగ్గర కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాముల్ని లీటర్ నీటికి కలిపి పోయాలి. ⇔ కాయకోత అనంతరం వచ్చే ఆంత్రాక్నోస్ తెగులు నివారణకు కార్బండిజం పిచికారీ చేయాలి. ⇔ వడలు తెగులు నివారణకు ట్రైకోడెర్మావిరిడి మిశ్రమాన్ని (30 కిలోల పశువుల ఎరువు, 4 కిలోల వేపపిండి, 500 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి) ఒక్కో చెట్టుకు వేయాలి. ⇔ చౌడుభూమి ఉంటే ఒక్కో చెట్టుకు కిలో జిప్సం వేయాలి. మిరప తోటలో.. ⇔ ఎండుతెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్, మెటాలాక్సిల్, మంకోజెబ్‌ను మొక్కల మొదళ్లలో పోయాలి. ⇔ ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండిజం, మంకోజెబ్ పిచికారీ చేయాలి. ⇔ నేలలో తేమ ఎక్కువగా ఉంటే సాలిసిక్ యాసిడ్ పిచికారీ చేసి మొక్కల్లో నిల్వ ఉండే పోషకాల వినియోగాన్ని పెంపొందించవచ్చు. ⇔ వర్షాలు ఆగిన తర్వాత మూడు 19లు లేదా 13ః0ః45, యూరియా వంటి పోషకాలను చల్లుకోవాలి. -
జీ9 అరటికి ‘పనామా’ముప్పు!
అరటి సాగుకు ’పనామా తెగులు’ గొడ్డలిపెట్టుగా మారింది. మట్టి ద్వారా వ్యాపించే ఈ శిలీంధ్రపు తెగులు అరటి పంటను ప్రపంచవ్యాప్తంగా తుడిచి పెట్టేస్తోంది. పనామా తెగులులో ఒక రకం (టిఆర్1) మన అమృతపాణి అరటి రకాన్ని ఇప్పటికే తుడిచి పెట్టేసింది. ఇప్పుడు గ్రాండ్ నైన్ (జీ9) వంతు వచ్చింది. మూడేళ్ళుగా బీహార్, మరో మూడు రాష్ట్రాల్లో పనామా తెగులు మరో రకం (టిఆర్4) జీ9 అరటి తోటలను తీవ్రంగా నష్టపరుస్తోంది. ఇటీవలే శాస్త్రవేత్తలు జీవ శిలీంధ్రనాశినిని తయారు చేశారు. అయినప్పటికీ మన రాష్ట్రాల్లోకి ఇది రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, బీహార్ నుంచి కంద పిలకలు తెచ్చుకోవటం మానుకోవాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది. ప్రాచీన కాలం నుంచి మన దేశంలో విరివిగా పండిస్తున్న సాంప్రదాయ పరంగా ప్రాముఖ్యత కలిగిన పండ్లతోట అరటి. అరటిని పండించే దేశాల్లో మన దేశం ముందుండడమే కాకుండా ఇంచుమించు 30 శాతం ప్రపంచ అరటి ఉత్పత్తిని కలిగి ఉంటుంది. మన దేశ అరటి సుమారు 884 వేల హెక్టార్లలో సాగు చేయబడుతూ, 30 మిలియన్ టన్నుల దిగుబడిని కలిగి ఉంటుంది. దేశంలో అరటిని సాగుచేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనది. మన రాష్ట్రంలో సుమారు లక్ష హెక్టార్లలో సాగు చేయబడుతూ, 5 మిలియన్ మెట్రిక్ టన్నుల దిగుబడిని కలిగి ఉంది. ఉభయ గోదావరి, ఇతర కోస్తా జిల్లాలతో పాటు, ఆధునిక సేద్య విధానంతో ఈ మధ్య కాలంలో రాయలసీమలోని కడప, అనంతపురం జిల్లాల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేసి అధిక దిగుబడులను రైతులు సాధిస్తున్నారు. భారతదేశంలో సుమారు 20 అరటి రకాలు సాగులో ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రధానంగా సాగులో ఉన్న అరటి రకాలు కావెండిష్ (గ్రాండ్నైన్), అమృతపాణి, తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, సుగంధాలు, కూర రకాలైన కొవ్వూరు బొంత. అరటిలో దిగుబడులు తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం అరటిని ఆశిస్తున్న తెగుళ్లు. వీటిలో ముఖ్యమైనది పనామా/ ఫ్యుజేరియం తెగులు (రేస్–1). ఈ తెగులును ఫ్యుజేరియం ఆక్సీస్పోరమ్ ఫార్మాస్పీసిస్ కుబెన్స్ అనే నేలలో నివసించే శిలీంధ్రం కలుగజేస్తుంది. ఈ రేస్–1 పనామా తెగులు వల్ల మన రాష్ట్ర రైతులు ఇష్టంగా సాగుచేసే అమృతపాణి రకం తుడిచిపెట్టుకుపోయింది/ సాగులో లేకుండా పోయింది. రైతులు ఇతర రకాలైన గ్రాండ్నైన్, తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, మార్టమాన్ వంటి రకాలను సాగుచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో దేశంలోని అరటి పంటను నష్టపరుస్తున్న సమస్య: ట్రోపికల్ రేస్ 4 (టీఆర్ 4) వల్ల కలిగే పనామా/ ఫ్యుజేరియం తెగులు. ఈ తెగులు గ్రాండ్నైన్ రకాన్ని ఎక్కువగా ఆశించి నష్టపరచడమే కాకుండా ఇతర రకాలైన అమృతపాణి, కూర అరటిని కూడా ఆశిస్తుంది. పనామా తెగులును కలిగించే ఫ్యుజేరియం శిలీంధ్రంలో నాలుగు రకాల రేస్‌లు ఉన్నాయి. ఇందులో మూడు రకాలు అరటిని ఆశించి నష్టపరుస్తాయి. రేస్–1 అనేది అమృతపాణి వంటి అరటి రకాలను ఆశిస్తుంది. రేస్–2 కూర అరటిని ఆశిస్తుంది. రేస్–3 హెలికోనియా పుష్పాలను ఆశిస్తుంది. రేస్–4 గ్రాండ్నైన్ రకాలతో పాటు పైన వివరించిన అమృతపాణి, కూర రకాలను కూడా ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. దేశవ్యాప్తంగా పండించే అరటి రకాల్లో ఈ గ్రాండ్నైన్ రకం 55 నుంచి 60 శాతం సాగుచేస్తున్నారు. కాబట్టి ఈ తెగులు ఉనికి ప్రమాదకరంగా పరిణమించింది. టీఆర్–4 అనే ఈ పనామా తెగులు ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో గమనించడం జరిగింది. 2016–17 సంవత్సరాల్లో బిహార్‌లోని పూర్ణియ, కటిహార్ జిల్లాల్లో మొదటగా గుర్తించారు. దీనిని టీఆర్–4గా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా (ఎన్ఆర్సీబీ) తిరుచ్చిరాపల్లి శాస్త్రవేత్తలు దృవీకరించడం జరిగింది. క్రమంగా ఈ సమస్యను బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో గమనించారు. అయితే మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ టీఆర్–4 పనామా తెగులు ఉనికిని గమనించలేదు. డా. వైఎస్ఆర్హెచ్ఓ, హెచ్ఆర్ఎస్, కొవ్వూరు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఈ తెగులు గురించి సర్వేలను చేపడుతున్నారు. రైతులు ఈ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, సమస్యపైన సరైన అవగాహన ఏర్పర్చుకోవాలి. హెచ్ఆర్ఎస్, కొవ్వూరు శాస్త్రవేత్తలు వివిధ కార్యక్రమాల్లో, రైతు దినోత్సవాల్లో ఈ సమస్య ప్రాముఖ్యతను రైతుల దృష్టికి తీసుకువస్తున్నారు. గౌరవనీయులు ఉపకులపతి డా. టి జానకీరామ్, డా. వైబీఆర్హెచ్ఓ, డా. ఆర్వీఎస్కే రెడ్డి, పరిశోధనా సంచాలకులు, డా. వైఎస్ఆర్హెచ్ఓ అధ్యక్షతన ఈ సమస్యపై అవగాహన కోసం యూనివర్సిటీ శాస్త్రవేత్తలకు, రైతులకు వెబినార్‌ను జూలై 25వ తేదీన చేపట్టారు. దేశంలో నిష్ణాతులైన డా. కృష్ణకుమార్, Ex DDG (Hort). డా. ఎస్. ఉమ, డైరక్టర్ ఎన్ఆర్సీబీ, తిరుచ్చిరాపల్లి, డా. దామోదరన్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ ఐసీఏఆర్–సీఎస్ఎస్సీఐ లక్నో వారి ద్వారా ఈ సమస్యపై జరుగుతున్న పరిశోధనలపై అవగాహన ఏర్పరిచారు. ఫ్యుజేరియం అనే ఈ శిలీంధ్రం నేలలో నివాసం ఏర్పరుచుకొని, వేర్లను ఆశించి మొక్కలోపలికి ప్రవేశిస్తుంది. మొక్కలోని నాళికా కణజాలాన్ని ఆశించి నీరు, పోషక రవాణాను అడ్డుకొని మొక్క చనిపోవడానికి దారితీస్తుంది. దేశవ్యాప్తంగా ఈ టీఆర్–4 పనామా తెగులుపై జరుగుతున్న పరిశోధనల్లో ఐసీఏఆర్– సీఎస్ఎస్ఆర్ఐ, లక్నో, ఐసీఏఆర్–ఎన్ఆర్సీబీ, ట్రీచీ, ఐసీఏఆర్–సీఐఎస్హెచ్ లక్నో ముందున్నాయి. అఖిల భారత సాయిల్ సెలినిటీ (ఐసీఏఆర్–సీఎస్ఎస్ఆర్ఐ, లక్నో) వారు చేపట్టిన పరిశోధనల్లో ICAR-FUSICONT అనే జీవ శిలీంధ్రనాశిని ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గ్రాండ్నైన్ రకాన్ని ఆశించిన ఈ టీఆర్–4 పనామా తెగులును సమర్థవంతంగా అరికడుతున్నట్టు గమనించారు. చాలా మంది రైతులు పొలాల్లో ఈ మందును వాడి తెగులు తీవ్రతను తగ్గించడం జరిగింది. ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో కూడా ఈ ICAR-FUSICONT సామార్థ్యం గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న రేస్–1 పనామా తెగులుపై ఈICAR-FUSICONTను ఉపయోగించి పరిశోధనలు చేపట్టడం జరిగింది. మొదటి దశలో ఉన్న ప్రయోగాల్లో ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. టిఆర్–1 పనామా తెగులు నివారణ చర్యలు 1. తెగులు ఉన్న ప్రాంతాల్లో అమృతపాణి రకాన్ని సాగుచేయకూడదు. తెగులు తట్టుకోగలిగిన ఇతర రకాలను ఎంపిక చేసుకోవాలి. 2. తెగులు ఉన్న తోటల్లో ఉపయోగించిన సామాగ్రిని శుభ్రపరుచుకోవాలి. కాళ్లను కూడా నీటితో శుభ్రపరుచుకోవాలి. 3. తెగులు ఉన్న తోటల్లో నీరు పారించకూడదు. డ్రిప్ పద్ధతిని పాటించాలి. 4. టిష్యూకల్చర్ మొక్కలను ఎంచుకోవాలి. టీఆర్–4 పనామా తెగులు నివారణ చర్యలు 1. భూమిలో నివాసం ఉండి వేర్ల ద్వారా మొక్కను ఆశించే ఈ శిళీంధ్రం, మన రాష్ట్రంలోని అరటి నేలల్లోకి రాకుండా చూసుకోవాలి. రైతులు వేరే రాష్ట్రాల నుంచి పిలకల ద్వారా అరటి మొక్కలను తెచ్చుకోకూడదు. పిలకలను అంటిపెట్టుకున్న మట్టి ద్వారా శిలీంధ్రం మన నేలల్లోకి ప్రవేశించవచ్చు. 2. ఉభయ గోదావరి జిల్లా రైతులు అరటిలో కందను అంతరపంటగా వేసేటప్పుడు బిహార్ నుంచి కంద పిలకలను తెస్తున్నారు. బిహార్‌లోని ఈ టీఆర్–4 ఉనికిని గమనించడం జరిగింది కాబట్టి ఆ పిలకల ద్వారా, మట్టిద్వారా టీఆర్–4 శిలీంధ్రం మన రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చు కాబట్టి రైతులు బిహార్ కంద పిలకలను తెచ్చుకోకూడదు. 3. గ్రాండ్నైన్ అరటి రకాల్లో ఈ తెగులు లక్షణాలు ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. 4. రైతులందరూ ఈ సమస్యపై అవగాహన ఏర్పరుచుకోవాలి. -
అరటితోట దగ్ధం..రూ.5 లక్షలు ఆస్తినష్టం
ముదిగుబ్బ (ధర్మవరం) : ముదిగుబ్బ మండల పరిధిలోని దొరిగిల్లులో దివాకర్‌రెడ్డి అనే రైతుకు చెందిన అరటితోటలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగి, పూర్తిగా కాలిపోయింది. బాధిత రైతు తహసీల్దార్ పీవీ రమణకు వినతిపత్రం అందజేశాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షలు పంట నష్టం వాటిల్లినట్లు రైతు పేర్కొన్నాడు. పంటను పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రైతుకు హామీ ఇచ్చారు. -
ఆరు ఎకరాల్లో అరటితోట దగ్ధం
పుట్లూరు : మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరు ఎకరాల్లో సాగు చేసిన అరటితోట దగ్ధమైంది. చాగంటి పుల్లారెడ్డి అనే రైతుకు చెందిన అరటితోటకు మంటలు వ్యాపించడంలో సమీప పొలాల్లోని రైతులు ఫైరింజి¯ŒS సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజి¯ŒS వచ్చేలోపు అరటితోట దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 టన్నుల అరటిగెలలు కాలిపోయాయి. డ్రిప్పు పరికరాలు బూడిద కావడంతో రూ.6 లక్షల మేరకు నష్టం జరిగినట్లు బాధిత రైతు వాపోయాడు.