సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 12,583 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 22,738 మంది రైతులు నష్టపోయారు. పది జిల్లాల్లో పండ్లు, కూరగాయలు, పూలతోటలు దెబ్బతిన్నాయి. అరటి, మిర్చి, బొప్పాయి, జామ, బత్తాయి, నిమ్మ తదితర తోటలు ప్రభావితమయ్యాయి. పండ్లతోటల సంరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సా్‌ర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు.
అన్ని పంటలకు సాధారణ సూచనలు..
⇔ వీలైనంత త్వరగా చేలల్లో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి.
⇔ పంట ఎదుగుదలకు తోడ్పడేలా బూస్టర్ డోస్ ఎరువులు – నత్రజని, డీఏపీ, జింక్ వంటివి వాడాలి.
⇔ అధిక తేమతో తెగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందున పురుగుల నివారణ చర్యలు చేపట్టాలి.
⇔ లేత తోటల్లో చనిపోయిన మొక్కల్ని తీసేసి కొత్తవి నాటాలి.
⇔ వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా చెట్ల మధ్య దున్నడం వల్ల తేమ త్వరగా ఆరి చెట్లు కోలుకుంటాయి.
⇔ అధిక గాలులకు వేళ్లతో సహా ఒరిగిన చెట్లను నిలబెట్టి మట్టిని ఎగదోసి ఊతమివ్వాలి.
అరటి తోటలో..
⇔ రెండు పిలకలు వదిలేసి విరిగిన చెట్లను నరికేయాలి. చెట్లకు వెదురు కర్రలను పాతి ఊతమివ్వాలి.
⇔ అరటిచెట్లు నాలుగురోజుల కంటే ఎక్కువగా నీళ్లలో ఉంటే కోలుకోవడం కష్టం. కోలుకున్నా ఎదుగుదల, దిగుబడి తక్కువగా ఉంటాయి.
⇔ రెండురోజులు నీటిముంపులో ఉంటే త్వరగా నీళ్లు బయటకుపంపి తోట ఆరేలా చేయాలి. ఒక్కో చెట్టుకు వందగ్రాముల యూరియా, 80 గ్రాముల పొటాష్ వేయాలి.
⇔ మూడునెలల కన్నా తక్కువ వయసు మొక్కలు మూడడుగుల లోతు నీటిలో ఉంటే నేల ఆరిన వెంటనే కొత్త పిలకలు నాటుకోవాలి.
⇔ గొర్రుతో అంతరసేద్యం చేసి యూరియా, మ్యూరేట్ పొటాష్‌ను 20, 25 రోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు వేయాలి.
⇔ ఆకులు, గెలలపై పొటాషియం నైట్రేట్‌ను వారం రోజుల వ్యవధిలో మూడునాలుగుసార్లు పిచికారీ చేయాలి.
⇔ సగం తయారైన గెలలను ఎండిన ఆకులతో కప్పి 15 రోజుల్లోగా కోసి అమ్ముకోవాలి.
⇔ దుంపకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాముల్ని లీటర్ నీటికి కలిపి మొక్క చుట్టూ తడిచేలా నేలలో పోయాలి
⇔ సిగటోక ఆకుమచ్చ తెగులును అరికట్టేందుకు ప్రొపికొనజోల్ ఒక మిల్లీలీటరును వారంరోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు పిచికారీ చేయాలి.
బత్తాయి, నిమ్మ తోటల్లో..
⇔ వేర్లకు ఎండ తగిలేలా చూడాలి. పడిపోయిన చెట్లను నిలబెట్టే ఏర్పాట్లు చేయాలి.
⇔ విరిగిన కొమ్మల్ని కొట్టేసి పైభాగాన బోర్డో మిశ్రమం పోయాలి.
⇔ ఎనిమిదేళ్లపైబడి కాపు ఇస్తున్న తోటలో చెట్టుకు 500 గ్రాముల యూరియా, 750 గ్రాముల పొటాష్ వేసుకోవాలి.
⇔ చెట్టు మొదళ్ల దగ్గర ఒకశాతం బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాములను లీటర్ నీటికి కలిపి పోయాలి.
⇔ తోటలో కాపు ఉంటే 2–4–డి మందు చల్లి పిందె, పండు రాలడాన్ని నివారించుకోవాలి.
⇔ బెంజైల్ ఆడినైన్ పిచికారీ చేస్తే అధిక తేమను నివారించుకోవచ్చు.
బొప్పాయి తోటలో..
⇔ మెటలాక్జిల్ ఎంజెడ్ మూడుగ్రాములు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాములను నీటికి కలిపి మొదళ్ల దగ్గర పోయాలి.
⇔ ఐదుగ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమ పిచికారీ చేయాలి.
⇔ కోతకు తయారైన కాయలుంటే తక్షణమే కోసివేయాలి. పండు కుళ్లు నివారణకు హెక్సాకొనజోల్ జిగురు మందు చల్లాలి.
జామ తోటలో..
⇔ అధిక నీటిని తీసేయాలి. గొర్రుతో దున్ని పాదులు చేసి మొదళ్ల దగ్గర కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాముల్ని లీటర్ నీటికి కలిపి పోయాలి.
⇔ కాయకోత అనంతరం వచ్చే ఆంత్రాక్నోస్ తెగులు నివారణకు కార్బండిజం పిచికారీ చేయాలి.
⇔ వడలు తెగులు నివారణకు ట్రైకోడెర్మావిరిడి మిశ్రమాన్ని (30 కిలోల పశువుల ఎరువు, 4 కిలోల వేపపిండి, 500 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి) ఒక్కో చెట్టుకు వేయాలి.
⇔ చౌడుభూమి ఉంటే ఒక్కో చెట్టుకు కిలో జిప్సం వేయాలి.
మిరప తోటలో..
⇔ ఎండుతెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్, మెటాలాక్సిల్, మంకోజెబ్‌ను మొక్కల మొదళ్లలో పోయాలి.
⇔ ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండిజం, మంకోజెబ్ పిచికారీ చేయాలి.
⇔ నేలలో తేమ ఎక్కువగా ఉంటే సాలిసిక్ యాసిడ్ పిచికారీ చేసి మొక్కల్లో నిల్వ ఉండే పోషకాల వినియోగాన్ని పెంపొందించవచ్చు.
⇔ వర్షాలు ఆగిన తర్వాత మూడు 19లు లేదా 13ః0ః45, యూరియా వంటి పోషకాలను చల్లుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment