Orange gardens
-
పండ్లతోటల రక్షణకు చర్యలు అవసరం
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 12,583 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 22,738 మంది రైతులు నష్టపోయారు. పది జిల్లాల్లో పండ్లు, కూరగాయలు, పూలతోటలు దెబ్బతిన్నాయి. అరటి, మిర్చి, బొప్పాయి, జామ, బత్తాయి, నిమ్మ తదితర తోటలు ప్రభావితమయ్యాయి. పండ్లతోటల సంరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సా్ర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. అన్ని పంటలకు సాధారణ సూచనలు.. ⇔ వీలైనంత త్వరగా చేలల్లో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి. ⇔ పంట ఎదుగుదలకు తోడ్పడేలా బూస్టర్ డోస్ ఎరువులు – నత్రజని, డీఏపీ, జింక్ వంటివి వాడాలి. ⇔ అధిక తేమతో తెగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందున పురుగుల నివారణ చర్యలు చేపట్టాలి. ⇔ లేత తోటల్లో చనిపోయిన మొక్కల్ని తీసేసి కొత్తవి నాటాలి. ⇔ వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా చెట్ల మధ్య దున్నడం వల్ల తేమ త్వరగా ఆరి చెట్లు కోలుకుంటాయి. ⇔ అధిక గాలులకు వేళ్లతో సహా ఒరిగిన చెట్లను నిలబెట్టి మట్టిని ఎగదోసి ఊతమివ్వాలి. అరటి తోటలో.. ⇔ రెండు పిలకలు వదిలేసి విరిగిన చెట్లను నరికేయాలి. చెట్లకు వెదురు కర్రలను పాతి ఊతమివ్వాలి. ⇔ అరటిచెట్లు నాలుగురోజుల కంటే ఎక్కువగా నీళ్లలో ఉంటే కోలుకోవడం కష్టం. కోలుకున్నా ఎదుగుదల, దిగుబడి తక్కువగా ఉంటాయి. ⇔ రెండురోజులు నీటిముంపులో ఉంటే త్వరగా నీళ్లు బయటకుపంపి తోట ఆరేలా చేయాలి. ఒక్కో చెట్టుకు వందగ్రాముల యూరియా, 80 గ్రాముల పొటాష్ వేయాలి. ⇔ మూడునెలల కన్నా తక్కువ వయసు మొక్కలు మూడడుగుల లోతు నీటిలో ఉంటే నేల ఆరిన వెంటనే కొత్త పిలకలు నాటుకోవాలి. ⇔ గొర్రుతో అంతరసేద్యం చేసి యూరియా, మ్యూరేట్ పొటాష్‌ను 20, 25 రోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు వేయాలి. ⇔ ఆకులు, గెలలపై పొటాషియం నైట్రేట్‌ను వారం రోజుల వ్యవధిలో మూడునాలుగుసార్లు పిచికారీ చేయాలి. ⇔ సగం తయారైన గెలలను ఎండిన ఆకులతో కప్పి 15 రోజుల్లోగా కోసి అమ్ముకోవాలి. ⇔ దుంపకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాముల్ని లీటర్ నీటికి కలిపి మొక్క చుట్టూ తడిచేలా నేలలో పోయాలి ⇔ సిగటోక ఆకుమచ్చ తెగులును అరికట్టేందుకు ప్రొపికొనజోల్ ఒక మిల్లీలీటరును వారంరోజుల వ్యవధిలో రెండుమూడుసార్లు పిచికారీ చేయాలి. బత్తాయి, నిమ్మ తోటల్లో.. ⇔ వేర్లకు ఎండ తగిలేలా చూడాలి. పడిపోయిన చెట్లను నిలబెట్టే ఏర్పాట్లు చేయాలి. ⇔ విరిగిన కొమ్మల్ని కొట్టేసి పైభాగాన బోర్డో మిశ్రమం పోయాలి. ⇔ ఎనిమిదేళ్లపైబడి కాపు ఇస్తున్న తోటలో చెట్టుకు 500 గ్రాముల యూరియా, 750 గ్రాముల పొటాష్ వేసుకోవాలి. ⇔ చెట్టు మొదళ్ల దగ్గర ఒకశాతం బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాములను లీటర్ నీటికి కలిపి పోయాలి. ⇔ తోటలో కాపు ఉంటే 2–4–డి మందు చల్లి పిందె, పండు రాలడాన్ని నివారించుకోవాలి. ⇔ బెంజైల్ ఆడినైన్ పిచికారీ చేస్తే అధిక తేమను నివారించుకోవచ్చు. బొప్పాయి తోటలో.. ⇔ మెటలాక్జిల్ ఎంజెడ్ మూడుగ్రాములు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాములను నీటికి కలిపి మొదళ్ల దగ్గర పోయాలి. ⇔ ఐదుగ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమ పిచికారీ చేయాలి. ⇔ కోతకు తయారైన కాయలుంటే తక్షణమే కోసివేయాలి. పండు కుళ్లు నివారణకు హెక్సాకొనజోల్ జిగురు మందు చల్లాలి. జామ తోటలో.. ⇔ అధిక నీటిని తీసేయాలి. గొర్రుతో దున్ని పాదులు చేసి మొదళ్ల దగ్గర కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడుగ్రాముల్ని లీటర్ నీటికి కలిపి పోయాలి. ⇔ కాయకోత అనంతరం వచ్చే ఆంత్రాక్నోస్ తెగులు నివారణకు కార్బండిజం పిచికారీ చేయాలి. ⇔ వడలు తెగులు నివారణకు ట్రైకోడెర్మావిరిడి మిశ్రమాన్ని (30 కిలోల పశువుల ఎరువు, 4 కిలోల వేపపిండి, 500 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి) ఒక్కో చెట్టుకు వేయాలి. ⇔ చౌడుభూమి ఉంటే ఒక్కో చెట్టుకు కిలో జిప్సం వేయాలి. మిరప తోటలో.. ⇔ ఎండుతెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్, మెటాలాక్సిల్, మంకోజెబ్‌ను మొక్కల మొదళ్లలో పోయాలి. ⇔ ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండిజం, మంకోజెబ్ పిచికారీ చేయాలి. ⇔ నేలలో తేమ ఎక్కువగా ఉంటే సాలిసిక్ యాసిడ్ పిచికారీ చేసి మొక్కల్లో నిల్వ ఉండే పోషకాల వినియోగాన్ని పెంపొందించవచ్చు. ⇔ వర్షాలు ఆగిన తర్వాత మూడు 19లు లేదా 13ః0ః45, యూరియా వంటి పోషకాలను చల్లుకోవాలి. -
నాలుగు తడులతో సిరుల పంట!
బత్తాయి తోటలో సైతం అంతర పంటగా సిరిధాన్యాల సాగుతో అధికాదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు రైతు పుట్ట జనా«ర్ధన్‌రెడ్డి. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు అవసరం లేకుండానే పండ్ల తోటలో అంతర పంటగా సిరిధాన్యాలను సాగు చేస్తున్నారు. సిరిధాన్యాల సాగుతో ఆర్ధిక, ఆరోగ్య, ఆహార భద్రత ఉంటుందనే నమ్మకాన్ని రైతుల్లో కల్పిస్తున్నారు. కేవలం 4 నీటి తడులతో ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడులు సాధించవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. సాక్షి, నల్లగొండ అగ్రికల్చర్ :నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి తన లేత బత్తాయి తోటలో రబీ సీజన్లో అంతర పంటగా సిరిధాన్యాలను సాగు చేస్తున్నారు. తన తోటలో పది ఎకరాలతో పాటు మరో 30 ఎకరాలను ఇతర రైతుల వద్ద భూమిని లీజుకు తీసుకొని మొత్తం 40 ఎకరాల్లో సిరిధాన్యాలను సాగు చేస్తున్నారు. 85 రోజుల్లో పంట చేతికి వచ్చే కొర్ర, అండు కొర్ర, సామ పంటలను సాగు చేస్తున్నారు. డిసెంబర్ 15న ఎకరాకు మూడు కేజీల విత్తనాలను జల్లారు. ఆ తర్వాత ఇప్పటి వరకు నాలుగు సార్లు నీటి తడులు పెట్టారు. ప్రస్తుతం చేను ఏపుగా పెరిగి కంకి ఎండు దశలో ఉంది. కూలీల అవసరం లేకుండా మిషన్‌తో కోతకోసి నూర్పిడి చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు. ఎకరానికి రూ.3 వేల పెట్టుబడి. సుమారు 10 క్వింటాళ్ల వరకు సిరిధాన్యాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎకరం సాగు చేసి రూ. 30 వేల ఆదాయం సమకూరుతుందని ఆయన ఆశిస్తున్నారు. సిరిధాన్య పంటల గడ్డిని పశువులకు చక్కని పోషకాలను అందించే పశుగ్రాసంగా వినియోగించుకోవచ్చు. సిరిధాన్యాల సాగు విధానం దుక్కి దున్నుకొని పొలాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. పదును తగుమాత్రంగా ఉంటే సరి. లేదంటే నీళ్ళు పెట్టుకొని దుక్కిలో ఎకరానికి మూడు కిలోల విత్తనాలు 1:3 పద్ధతిలో ఇసుకను కలిపి వెదజల్లే పద్ధతిలో గాని, సాలు పద్ధతిలో గానీ విత్తుకోవాలి. తర్వాత గొర్రు తోలుకోవాలి. విత్తనాలు మొలకెత్తిన తరువాత నాలుగు వర్షాలు పడితే చాలు సిరిధాన్యాలు పండుతాయి. రబీలో వర్షాలు లేకపోతే మూడు నుంచి నాలుగు విడతలుగా నీటి తడులు పెట్టాలి. స్ప్రింక్లర్లు ఉపయోగిస్తే చాలా తక్కువ నీటితోనే సిరిధాన్యాల పంట సాగు చేయవచ్చు. అరికలు ఆరు నెలల పంట. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు వంటి సిరిధాన్యాలను నీటి వసతి ఉంటే సంవత్సరంలో మూడు పంటలను కూడా తీసుకోవచ్చు. ఎకరం వరి పంట సాగు చేసుకునే నీటి వసతి ఉంటే నాలుగు ఎకరాలలో సరిధాన్యాలను సాగు చేసుకోవచ్చని జనార్దన్‌రెడ్డి అంటున్నారు. ఎలాంటి రసాయనిక ఎరువుల అవసరం లేదు సిరిధాన్యాల సాగుకు ఎలాంటి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల అవసరం లేదు. జీవామృతంతోనే అధిక దిగుబడులను సాధించవచ్చని నిరూపిస్తున్నారు రైతు జనార్దన్‌రెడ్డి. గుంపులుగా వచ్చే పక్షులు కొన్ని గింజలు తిన్నప్పటికీ పొలంలో అవి వేసే రెట్ట వలన భూమి సారవంతం అవుతుంది. ఎలాంటి రసాయనిక ఎరువుల అవసరం ఉండదు. నీటి తడులతో పాటు జీవామృతం అందిస్తే సరిపోతుంది. క్వింటా ముడి సిరిధాన్యాలకురూ. 4 వేల ధర సమాజంలో ప్రస్తుతం సిరిధాన్యాల బియ్యం వాడకం అధికం కావడం వలన సిరిధాన్యాల ముడి ధాన్యానికి మార్కెట్లో డిమాండ్ ఉంది. క్వింటాలుకు రూ. 4 వేల వరకు చెల్లించి ప్రాసెసింగ్ యూనిట్ ఉన్న వ్యాపారులే రైతుల వద్ద కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారని జనార్దన్‌రెడ్డి తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను సాధించే సిరిధాన్యాల సాగును జాతీయ ఆహార భద్రత మిషన్‌లో చేర్చి, అన్ని జిల్లాల్లోనూ హెక్టారుకు రూ. 6 వేల చొప్పున ఆర్ధిక తోడ్పాటును అందించాలని నల్లగొండ జిల్లా రైతులు కోరుతున్నారు. దీంతో పత్తి సాగు చేసే రైతులు సిరిధాన్యాల సాగుకు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. – ఆవుల లక్ష్మయ్య,సాక్షి, నల్లగొండ అగ్రికల్చర్ ఫొటోలు: కంది భజరంగ్‌ప్రసాద్, నల్లగొండ సిరిధాన్యాల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి కేవలం ఎకరానికి రూ.3 వేల పెట్టుబడితో పాటు కూలీల అవసరం పెద్దగా లేకుండా ఎకరానికి ఒక పంటకు రూ.30 వేల వరకు ఆదాయం వస్తుంది. నీరు, విద్యుత్ పొదుపు అవుతాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. జీవామృతం అందిస్తే చాలు. విద్యార్థుల హాస్టళ్లలో, మధ్యాహ్న భోజనంలో సిరిధాన్యాల ఆహారాన్ని అందించడం ద్వారా ప్రభుత్వం సిరిధాన్యాల రైతులను ప్రోత్సహించాలి. త్వరలో ప్రొసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నా. ఖరీఫ్‌లో సుమారు మరింత విస్తీర్ణంలో సాగు చేయాలని అనుకుంటున్నా. సిరిధాన్యాలను సాగు చేయాలనుకునే రైతులకు సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తా.– పుట్ట జనార్దన్‌రెడ్డి (98484 32345),పరడ, కట్టంగూరు మండలం, నల్లగొండ జిల్లా -
బత్తాయి రైతుకు విద్యుత్ షాక్
పీసీపల్లి, న్యూస్‌లైన్: వర్షాభావానికి తోడు విద్యుత్ కోతలతో బత్తాయి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. రోజుకు కనీసం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. తెగుళ్ల విజృంభణతో బత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పీసీపల్లి మండలంలో 4 వేల హెక్టార్లకు పైగా బత్తాయి సాగు చేశారు. సీజన్లో పీసీపల్లి నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, చెన్నై తదితర ప్రాంతాలకు బత్తాయి ఎగుమతి చేసేవారు. కానీ ప్రస్తుతం చెట్లను బతికించుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. సాగునీరందక 1500 హెక్టార్లలో బత్తాయి తోటలు ఎండిపోయాయి. కరెంటు సమస్య ఎలా అధిగమించాలో..ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. ఆదుకోని సబ్సిడీ పథకాలు: మండలంలోని 4 వేల హెక్టార్లలో బత్తాయి సాగు చేశారు. కానీ సాగు చేసిన సమయం నుంచి సబ్సిడీ పథకం కింద వచ్చే ఎరువులు కానీ, పరికరాలు కానీ రైతుల దరిచేరలేదు. చెట్లు పెరిగినప్పుడు కట్ చేసుకోవడానికి కూలి ఖర్చుల కోసం‘కొమ్మ కత్తెర పథకం’ కింద 50 శాతం రాయితీ ప్రభుత్వం అందించాల్సి ఉండగా మండలంలోని ఏ ఒక్కరూ ఈ పథకం కింద లబ్ధి పొందలేదు. కనపడని ఉద్యానవన శాఖాధికారులు: వివిధ పథకాల కింద రైతులకు చేయూతనివ్వాల్సిన ఉద్యానవన శాఖాధికారులు మండలం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. రైతులు నానా అవస్థలు పడి కనిగిరి ఉద్యానవన శాఖ కార్యాలయానికి వస్తే అది ఎప్పుడూ మూసివేసి ఉంటుంది. ఒక వేళ తెరిచి ఉంటే సబ్సిడీలో ఎటువంటి ఎరువులు కానీ పరికరాలు కానీ లేవని రైతులకు చెప్తారు. దీంతో రైతులు వెనుతిరుగుతున్నారు. తప్పని తెగుళ్ల బెడద పండ్ల తోటలకు తెగుళ్ల బెడద తప్పడం లేదు. ఏ తెగుళ్లకు ఏ మందు కొట్టాలో ఎవరిని అడగాలో రైతులకు తెలియని పరిస్థితి. ఇటీవల తెగుళ్లు సోకి ఎండిపోవడంతో ధర్మవరపు వెంకటేశ్వర్లు మూడెకరాలు బత్తాయి తోట కొట్టివేశారు. రైతులకు సమస్యలు, సలహాలు అందించేవారు లేకపోవడంతో పండ్ల తోటలు పెంచడం పెద్ద సవాలుగా మారింది.